కూటమి విజయానికి పవనే కారణం... వైసీపీ నేత హాట్ కామెంట్స్!
ఈ భేటీకి హాజరైన వారితో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ నేతలతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇందులో భాగంగా తాజాగా ఎమ్మెల్సీలతో భేటీ నిర్వహించారు. అసెంబ్లీలో బలం లేనప్పటికీ.. మండలిలో వైసీపీ బలమైన మెజారిటీ కలిగి ఉన్న నేపథ్యంలో... చేపట్టాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారని తెలుస్తుంది.
ఈ సందర్భంగా సుమారు 38 మందివరకూ ఉన్న వైసీపీ ఎమ్మెల్సీలు ఈరోజు వైఎస్ జగన్ ను కలిశారు. సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్యలే చేశారు. ఈ భేటీకి హాజరైన వారితో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు.
అవును... ఈ రోజు కూటమి అధికారంలోకి రావడానికి ప్రత్యేకంగా పవన్ కల్యాణే కారణం అని చెబుతూ.. ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. కూటమి గెలుపులో క్రెడిట్ మొత్తం పవన్ కల్యాణ్ కే చెందుతుందని స్పష్టం చేశారు. అందరూ కలిశారు కాబట్టే... ప్రజలు నమ్మారని.. అందులో తప్పుబట్టాల్సిందేమీ లేదని అన్నారు.
ఇదే సమయంలో పవన్ వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందని.. పవన్ ను అంచనా వేయడంలో తాము విఫలమయ్యేమనే విషయం ఫలితాలు చెబుతున్నాయని స్పష్టం చేశారు. కేవలం ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాదు.. అన్ని చోట్లా పవన్ కల్యాణ్ ప్రభావం కనిపించిందని.. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని తోట త్రిమూర్తులు స్పష్టం చేశారు!
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తో పాటు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుని, ఇతర మంత్రులను అభినందిస్తున్నట్లు తెలిపారు తోట త్రిమూర్తులు.
కాగా... ఒక పక్క ఈ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాపరింగ్ జరిగిందని, రకరకాల మోసాలు జరిగాయన్నట్లుగా పలువురు వైసీపీ నేతలు జగన్ ముందు వాపోతున్నారని.. అయితే, రుజువులు లేకుండా ఆ విషయాన్ని పబ్లిక్ గా ప్రస్థావించడం లేదని జగన్ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్న వేళ... కూటమిని ప్రజలు నమ్మారని, ఈ గెలుపు క్రెడిట్ మొత్తం పవన్ దే అని తోట త్రిమూర్తులు చెప్పడం ఆసక్తిగా మారింది.