కొత్త రచ్చ: బెదిరింపు కాల్స్ చేస్తున్న బన్నీ ఫ్యాన్స్ కు వార్నింగ్

ఈ ఎపిసోడ్ లో ఓయూ జేఏసీ నేతలు.. చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించటం.. ఇంటి ప్రాంగణంలో విధ్వంసాన్ని క్రియేట్ చేయటం తెలిసిందే.

Update: 2024-12-30 04:12 GMT

తెలుగు సినిమా రంగంలో ఇప్పటివరకు మరే సినిమాకు లేనంత కాంట్రావర్సీ పుష్ప2ను వెంటాడుతోంది. అదరగొట్టే కలెక్షన్లతో భారతదేశ సినీ చరిత్రను తిరిగి రాసేలా రికార్డుల్ని క్రియేట్ చేస్తున్న ఈ సినిమాకు.. అంతే స్థాయిలో వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ మూవీ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట.. తదనంతర పరిణామాల గురించి ప్రత్యేకంగాచెప్పాల్సిన అవసరం లేదు.

ఈ ఎపిసోడ్ లో ఓయూ జేఏసీ నేతలు.. చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించటం.. ఇంటి ప్రాంగణంలో విధ్వంసాన్ని క్రియేట్ చేయటం తెలిసిందే. ఈ ఘటనల్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించారు. ఇందులో భాగంగా ఓయూ జేఏసీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవటం.. కేసులు కట్టి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చటం చేశారు. అయితే..వీరికి బెయిల్ మంజూరు చేయటంతో జైలుకు వెళ్లకుండా బయటకు వచ్చారు.

ఇదిలా ఉంటే.. తమకు బన్నీ ఫ్యాన్స్ నుంచి పెద్ద ఎత్తున బెదిరింపుకాల్స్ వస్తున్నట్లుగా ఓయూ జేఏసీ నేతలు చెబుతున్నారు. తమను చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ పోలీసుల్ని ఆశ్రయించారు. తన ఫ్యాన్స్ ను అల్లు అర్జున్ కానీ అదుపు చేయకుంటే వేలాదిగా బన్నీ ఇంటిని ముట్టడిస్తామంటూ ఓయూ జేఏసీ నేతలు తాజాగా వార్నింగ్ ఇచ్చేశారు. అంతేకాదు.. తమకు ఫోన్లు చేస్తున్న వారిని గుర్తించి కేసులు కట్టాలని పోలీసుల్ని కోరుతున్నారు. తమ ఫోన్ నెంబర్లను సోషల్ మీడియాలో పెట్టిన వారిపైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదంతా చూస్తే.. ఇప్పటివరకు సాగిన రచ్చ సరిపోనట్లుగా.. కొత్త వివాదం మొదలైనట్లుగా చెప్పాలి. తమకు వస్తున్న బెదిరింపు కాల్స్ మీద ఓయూ పోలీసులకు ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు ఫిర్యాదు చేశారు. తమ పోరాటం వల్లే అల్లు అర్జున్ బాధితులకు న్యాయం చేశారన్నారు. తమకు ఫోన్ కాల్స్ రాకుండా చూడాల్సిన బాధ్యత అల్లు అర్జున్ దేనని స్పష్టం చేసిన వారు.. ఫోన్ కాల్స్ ఆగకుంటే మాత్రం తదుపరి చర్యలు తప్పవంటున్నారు. తన ఫ్యాన్స్ ను అల్లు అర్జున్ కట్టడి చేయకుంటే.. అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థులు కలిసి అల్లు అర్జున్ ఇంటికి వస్తే తట్టుకోలేరంటూ హెచ్చరించారు. ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.

Tags:    

Similar News