నవంబరులో 3 విపక్ష రాష్ట్రాల్లో ఎన్నికల మహా సమరం..బీజేపీకి పరీక్షే

ఓవైపు కశ్మీర్, హరియాణా ఎన్నికల హంగామా ముగుస్తుండగానే.. మరోవైపు మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి.

Update: 2024-09-15 09:17 GMT

ఓవైపు కశ్మీర్, హరియాణా ఎన్నికల హంగామా ముగుస్తుండగానే.. మరోవైపు మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టబోయిన చందంగా అత్తెసరు మెజారిటీతో గెలిచిన బీజేపీకి ఇవి కఠిన పరీక్ష పెట్టబోతున్నాయి. ఎందుకంటే సరిగ్గా రెండు నెలల్లో మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇవన్నీ విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలే కావడం గమనార్హం. మొన్నటివరకు హరియాణా, మహారాష్ట్ర, కశ్మీర్ ఎన్నికలు కలిపి నిర్వహిస్తారని భావించారు. కానీ, వర్షాలు- వరదలను కారణంగా చూపుతూ ఆ రాష్ట్రంలో ఎన్నికల తేదీలు ప్రకటించలేదు. హరియాణా, కశ్మీర్ లో ఈ నెల, వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి.

మూడుకు మూడు కఠినమే

ఇప్పుడు రెండు రోజుల్లో ఢిల్లీ సీఎంగా రాజీనామా చేస్తానని కేజ్రీవాల్ ప్రకటించిన నేపథ్యంలో ఆ రాష్ట్రానికీ ఎన్నికల నిర్వహణ అనివార్యం కానుంది. వాస్తవానికి ఢిల్లీ శాసనసభకు ఫిబ్రవరి వరకు గడువుంది. అయితే, కేజ్రీ రాజీనామతో ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి. అయితే, జార్ఖండ్, మహారాష్ట్రతో పాటే ఢిల్లీకీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావించినట్లు కథనాలు వచ్చాయి. వారు అలా అనుకున్నా.. కేజ్రీ రాజీనామా కూడా కలిసొచ్చింది. 2015 నుంచి ఢిల్లీలో కేజ్రీవాలే అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఓ విధంగా నరేంద్రమోదీకి గొంతులో పచ్చి వెలక్కాయ లాగా మారిన ఆయనను మద్యం కేసులో జైలుకు పంపింది కేంద్ర ప్రభుత్వం.

కొరుకుడుపడని జార్ఖండ్

జార్ఖండ్ కు 2019 డిసెంబరులో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ హేమంత్ సోరెన్ సారథ్యంలోని జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ ప్రభుత్వాన్ని బీజేపీ నానా తిప్పులు పెట్టింది. హేమంత్ ను కూడా జైలుకు పంపింది. అయితే, ఈయన రాజీనామా చేసి తన స్థానంలో చంపయీ సోరెన్ కు అవకాశం ఇచ్చారు. హేమంత్ బయటకు వచ్చాక దిగిపోయిన ఈయన.. బీజేపీలో చేరడం కొసమెరుపు. డిసెంబరులో జరగాల్సిన ఎన్నికలను నవంబరులో మహారాష్ట్ర-ఢిల్లీతో కలిపి చేపట్టే వీలుంది.

మహా సమరమే..

గత ఐదేళ్లలో ఏ రాష్ట్రంలోనూ జరగని రాజకీయ మార్పులు దేశంలోని పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో జరిగాయి. తొలుత బీజేపీ-శివసేన కూటమిలో చేరిన ఎన్సీపీ అజిత్ పవార్.. రోజుల్లోనే వెనక్కు వచ్చేశారు. కాంగ్రెస్-శివసేన (ఉద్ధవ్)-ఎన్సీపీ కూటమి సర్కారు ఉద్ధవ్ సారథ్యంలో కొన్నాళ్లు కొనసాగింది. అయితే, శివసేన ఏక్ నాథ్ శిందే ద్వారా చీల్చిన బీజేపీ ఆయననే సీఎంను చేసింది. మరొక్క ఏడాదిలోనే ఎన్సీపీని అజిత్ పవార్ ద్వారా చీల్చింది. అజిత్ నూ అధికారంలో భాగం చేసింది. మహారాష్ట్రలో 2019లో అక్టోబరు 21న ఎన్నికలు జరిగాయి. ఈ లెక్కన ఈ రాష్ట్రంలోనూ హరియాణా, కశ్మీర్ తో పాటే ఎన్నికలు జరపాలి. కానీ.. ఎన్నికల సంఘం మాత్రం నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు జార్ఖండ్, ఢిల్లీతో పాటు మహారాష్ట్రకు నవంబరులో ఎన్నికలు జరిపే చాన్సుంది. ఇదంతా అంచనా మాత్రమే. ఎన్నికల సంఘం నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. వీటిలో గెలవడం మాత్రం బీజేపీకి, ప్రధాని మోదీకి చాలా ప్రతిష్ఠాత్మకం. గెలుపు అవకాశాలు మాత్రం కనిపించడం లేదనేది విశ్లేషకుల అభిప్రాయం.

Tags:    

Similar News