తిరుమలలో కాసుల వర్షం కురిపిస్తున్న 'సోమవారం'

ఎన్నిసార్లు దర్శించుకున్నా.. మళ్లీ.. మళ్లీ వెళ్లాలని మనసు లాగే పుణ్యక్షేత్రాల్లో తిరుమల ముందుంటుంది

Update: 2023-08-16 06:02 GMT

ఎన్నిసార్లు దర్శించుకున్నా.. మళ్లీ.. మళ్లీ వెళ్లాలని మనసు లాగే పుణ్యక్షేత్రాల్లో తిరుమల ముందుంటుంది. ఐదు నుంచి పది సెకన్ల స్వామి దర్శనం కోసం వందలాది కిలోమీటర్లను గంటల కొద్దీ ప్రయాణం చేసి.. మరికొన్ని గంటల పాటు క్యూలో ఉండేందుకు సైతం సిద్దమయ్యే భక్తులు.. స్వామి దర్శనమైనంతనే.. అప్పటివరకు తాము పడ్డ శ్రమను.. అలసటను ఇట్టే మర్చిపోవటం మామూలే. అంతకంతకూ పెరుగుతున్న భక్తులతో తిరుమల కొండ రద్దీగా మారింది. గతంలో గురువారంతో మొదలయ్యే రద్దీ.. ఆదివారం వరకు కొనసాగేది. ఆదివారం రాత్రికి కొండ కాస్తంత తేలిక పడేది. కానీ.. కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి.

గతానికి భిన్నంగా సోమవారం కూడా భక్తుల రద్దీ సాగుతోంది. పెరిగిన భక్తులకు తగ్గట్లే.. హుండీ ఆదాయం కూడా భారీగా పెరుగుతోంది. దీంతో.. శ్రీవారి హుండీకి కాసుల వర్షం కురుస్తోంది. ఈసారి లాంగ్ వీకెండ్ ఉండటంతో సోమవారం సైతం భక్తులతో కిటకిటలాడింది. ఇక.. మంగళవారం పంద్రాగస్టు కావటంతో రద్దీ కొనసాగింది. సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం ఏకంగా రూ.5.67 కోట్లు రావటం గమనార్హం.

సోమవారం 74వేలకు పైగా భక్తులు స్వామిని సందర్శించుకోగా.. మంగళవారం సైతం అదే రద్దీ కొనసాగింది. ముందుస్తుగా టికెట్ బుకింగ్ లేకుండా దర్శనం కోసం వచ్చిన వారికి 24 గంటల పాటు కంపార్టుమెంట్లలో నిరీక్షించాల్సిన పరిస్థితి. గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో సోమవారాల్లో స్వామివారి హుండీల్లో పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తోంది. గత నెలలోని నాలుగు సోమవారాల్లో హుండీ ఆదాయం రూ.5కోట్లకు మించిన ఆదాయం అందుకోవటం విశేషం.

జులై పదిన (సోమవారం) హుండీ ఆదాయం రూ.5.11 కోట్లు కాగా.. పదిహేడును రూ.5.4 కోట్లు.. జులై 24న రూ.5 కోట్లు.. 31న రూ.5.21 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. ఇలా జులైలోని ప్రతి సోమవారం రూ.5కోట్ల హుండీ ఆదాయాన్ని దాటేయటం ఆసక్తికరంగా మారింది. జులై మాదిరే ఆగస్టులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. శని.. ఆదివారాల్లో భక్తులు ఎక్కువగా వస్తుండటం.. దానికి సంబంధించిన పరకామణి లెక్కలు సోమవారం చూడటం కారణంగా.. వసూళ్లు ఎక్కువగా వస్తున్నట్లు చెబుతున్నారు. అయితే.. గతంలోనూ ఇలాంటి పరిస్థితే ఉండాలి కదా? అన్నది ప్రశ్న.

అయితే.. ఇటీవల కాలంలో సోమవారాల్లోనూ శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగింది. ఆగస్టు విషయానికి వస్తే.. ఒక రోజు హుండీ ఆదాయం రూ.5.67 కోట్లుగా రావటంతో సోమవారం ఇంత భారీగా రావటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. ఇక.. శ్రీవారి హుండీకి గత ఏడాది మార్చి నుంచి భారీగా ఆదాయం వస్తోంది. ప్రతి నెలా రూ.100కోట్ల మార్కును దాటేయటం చూస్తే.. రానున్న రోజుల్లో హుండీ ఆదాయం మరింత పెరగటం ఖాయమని చెబుతున్నారు.

Tags:    

Similar News