నాలుగో సారి టిక్కెట్ ఇస్తే జనం ఫీలింగ్ మారిందా?
ఇక్కడ నుంచి వరుస విజయాలు సాధిస్తున్న తొలకంటి ప్రకాష్ గౌడ్‌కు బీఆర్ ఎస్ టికెట్ ఇచ్చింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ ఎస్ అన్ని కీలక నియోజకవర్గాలపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కనీస మెజారిటీకి అటు ఇటుగా సీట్లు దక్కినా చాలనే ఉద్దేశంతో పార్టీ అడుగులు వేసింది. అదే దృష్టితో అభ్యర్థులను కూడా ఎంపిక చేసింది. ఇలా బీఆర్ ఎస్ పార్టీ గెలుపు గుర్రం ఎక్కుతుందని భావించి న నియోజకవర్గాల్లో రాజేంద్రనగర్ ఒకటి. ఇక్కడ నుంచి వరుస విజయాలు సాధిస్తున్న తొలకంటి ప్రకాష్ గౌడ్‌కు బీఆర్ ఎస్ టికెట్ ఇచ్చింది.
అయితే.. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఇప్పటికి మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. 2009 ఉమ్మడి రాష్ట్రంలోనూ, 2014లో విభజిత తెలంగాణ రాష్ట్రంలోనూ జరగిన ఎన్నికల్లో తొలకంటి ప్రకాష్ గౌడ్ విజయం దక్కించుకున్నారు. అయితే. అప్పట్లో ఆయన తెలుగు దేశం పార్టీ తరఫున విజయం సాధించారు. అనంతరం.. కేసీఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆయన టీడీపీకి రాంరాం చెప్పారు.
ఈ క్రమంలోనే 2018 ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ తరఫున బీఫాం పొంది 58 వేల మెజారిటీ ఓట్లతో ముచ్చటగా మూడోసారి విజయం దక్కించుకున్నారు. ఇప్పుడు నాలుగోసారి తాజా ఎన్నికల్లో బీఆర్ ఎస్ నుంచి ఆయన టికెట్ సాధించారు.
అయితే.. టికెట్ సాధించినంత ఈజీగా అయితే.. ఈ దఫా ప్రకాష్ గౌడ్ గెలుపు లేదనే చర్చ సాగుతోంది. ఈ నియోజకవర్గంలోని మూడు మండలాల్లో ఆశించినంత అభివృద్ధి లేకపోగా.. కొన్ని ప్రాంతాల్లో 15 ఏళ్ల కిందట ఎలాంటి సమస్యలు ఉన్నాయో.. ఇప్పటికీ అలానే ఉన్నాయనేది పబ్లిక్ టాక్.
మరోవైపు.. మూడుసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.. ప్రకాష్‌గౌడ్ తమకు ఏమీ చేయలేక పోయారనే చర్చ ప్రజల్లో జోరుగా సాగుతోందని సర్వేలు చెబుతున్నాయి. అయినప్పటికీ.. కేసీఆర్ మాత్రం ప్రకాష్ వైపే మొగ్గు చూపారు. దీనికి వివిధ కారణాలు ఉన్నాయనేది పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాజేంద్రనగర్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇక్కడ విజయం దక్కించుకునేందుకు ప్రకాష్ గౌడ్ పనితీరును వారు పూస గుచ్చినట్టు వివరిస్తున్నారు.
అదేసమయంలో బీజేపీ కూడా ఈ ప్రయత్నమే చేస్తోంది. ఇప్పుడు ఈ రెండు పార్టీలకూ.. ఉమ్మడి ప్రత్యర్థిగా ప్రకాష్ గౌడ్ మారారు. మొత్తం ఈ నియోజకవర్గంలో రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట మండలాలు ఉన్నాయి. వీటిలో గండిపేట ఎప్పటి నుంచో వెనుకబడిన ప్రాంతంగా ఉంది. ఇక, 4 లక్షల మంది ఓటర్లు ఇక్కడ నేతల భవితవ్యాన్ని తేల్చ నున్నారు.