తెలంగాణలో 'హంగ్'.. రేవంత్ రియాక్షన్ విన్నారా?

రోజుల్లోకి వచ్చేసి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వేళ.. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది.

Update: 2023-10-08 04:41 GMT

రోజుల్లోకి వచ్చేసి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వేళ.. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఎవరికి వారు గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తున్న వేళ.. బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన బీఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హంగ్ తథ్యమని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వీలైన మెజర్టీ రాదన్న వాదనను వినిపిస్తున్నారు.

బీఎల్ సంతోష్ వ్యాఖ్యలపై రియాక్టు అయ్యారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సికింద్రాబాద్ లో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన.. హంగ్ అంశంపై తన స్పందనను తెలియజేస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ వస్తే.. బీజేపీతో కలిసి బీఆర్ఎస్సేనని రేవంత్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ను నిలువరించే పధకంలో భాగంగానే ఈ రెండు పార్టీలు దుర్మార్గమైన ఎత్తుగడను అనుసరిస్తున్నట్లుగా మండిపడ్డారు.

కాంగ్రెస్ ఓట్లు చీల్చి హంగ్ వచ్చేలా చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందన్నారు. హంగ్ ఏర్పడిన తర్వాత బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బీఆర్ఎస్ కుట్రను భగ్నం చేయాలని ప్రజల్ని కోరారు. కాంగ్రెస్ కు ప్రజలు దన్నుగా నిలవాలని కోరారు. కేసీఆర్ తనను కొడంగల్ లో పడగొడితే.. ప్రజలు తనను మల్కాజిగిరిలో నిలబెట్టిన వైనాన్ని ప్రస్తావించిన రేవంత్.. బీజేపీ-బీఆర్ఎస్ లది ఫెవికాల్ బంధంగా పేర్కొన్నారు.

కొప్పుల ఈశ్వర్ తన పక్కన కూర్చుంటే కేసీఆర్ సహించలేరని.. అయితే కాంగ్రెస్ పార్టీలో దళితుడైన ఖర్గేను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక చేసిన వైనాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే.. మోడీ పతనం ప్రారంభమైనట్లేనన్న రేవంత్.. తెలంగాణను మరో మణిపూర్ చేయాలన్నది బీజేపీ ఆలోచనగా మండిపడ్డారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని.. కేసీఆర్ గెలిస్తే.. మోడీ గెలిచినట్లేనని వ్యాఖ్యానిస్తున్న రేవంత్ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

Tags:    

Similar News