అర కిలోమీటర్ పరిగెత్తి రాజధాని రైలు ఆపి వందలాది ప్రాణాలు సేవ్ చేశాడు

కొంకణ్ రైల్వే డివిజన్ పరిధిలో రైల్వే ఉద్యోగి మహాదేవ. ఇతను ట్రాక్ మ్యాన్. తన విధుల్లో భాగంగా పట్టాల తనిఖీని చేస్తున్నాడు.

Update: 2024-09-08 06:30 GMT

ప్రమాదం జరిగే అవకాశం ఉన్న అంశాన్ని గుర్తించిన రైల్వే చిరుద్యోగి చేసిన సాహసం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ.. ఈ ఉద్యోగి చొరవ చూపించకున్నా.. తెగువను ప్రదర్శించకున్నా.. ఈ పాటికి ఒక భారీ రైలు ప్రమాదం గురించి వార్తలు చదువుతూ.. తీవ్రమైన విషాదంలో నిండిపోయే పరిస్థితి ఉండేది. పండుగ జోష్ మీద కూడా ప్రభావం చూపేది. కానీ.. ప్రమాదం ఎదురుకాకుండా ఉండేందుకు డ్యూటీలో ఉన్న ఒక ట్రాక్ మ్యాన్ ప్రదర్శించిన సాహసం ఆయన్ను హీరోగా మార్చాయి. అంతేకాదు.. ఎంతో మంది ప్రాణాల్ని కాపాడిన అతడిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు అందుతున్నాయి. ఇంతకూ అసలేం జరిగిందంటే..

కొంకణ్ రైల్వే డివిజన్ పరిధిలో రైల్వే ఉద్యోగి మహాదేవ. ఇతను ట్రాక్ మ్యాన్. తన విధుల్లో భాగంగా పట్టాల తనిఖీని చేస్తున్నాడు. ఈ క్రమంలో తెల్లవారుజామున 4.50 గంటల వేళలో కుమ్టా - హోన్నావర్ స్టేషన్ల మధ్య తనిఖీల్ని చేపట్టాడు. ఇది కొంకణ్ రైల్వే డివిజన్ లో ఉంటుంది. అతడు తనిఖీ చేస్తుండగా.. ఒక చోట పట్టాల జాయింట్ వద్ద వెల్డింగ్ అసంపూర్తిగా ఉందన్న విషయాన్ని గుర్తించారు. అదే సమయంలో ఆ రూట్లో తిరువనంతపురం - ఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ వస్తోంది.

తాను వెంటనే స్పందించకపోతే జరిగే ప్రమాదాన్ని ఊహించిన సదరు ట్రాక్ మ్యాన్ వెంటనే రియాక్టు అవుతూ.. కుమ్టా స్టేషన్ కు సమాచారాన్ని ఇచ్చారు. కానీ.. అప్పటికే ఆ రైలు ఆ స్టేషన్ ను దాటేసింది. దీంతో.. లోకో పైలెట్ కు సమాచారాన్ని అందించే ప్రయత్నం చేసినా.. అది ఫలించలేదు. దీంతో.. రైలును ఆపేందుకు పట్టాల మీదుగా రైలు వచ్చే వైపు ఎదురుగా పరుగులు తీయటం స్టార్ట్ చేశారు.

ఐదు నిమిషాల్లో అరకిలోమీటర్ కు పైనే పరుగులు తీసిన అతను.. లోకో పైలెట్ కు సిగ్నల్ అందించి.. రైలును నిలిపేయటంలో కీలక భూమిక పోషించాడు. ఎట్టకేలకు అతడి తెగువ.. సాహసంతో రాజధాని రైలు ఆగింది. పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. వెల్డింగ్ పనిని పూర్తి చేసిన తర్వాత ట్రైన్ ముందుకు కదిలింది. ప్రమాదాన్ని పసిగట్టి పెద్ద సాహసాన్ని చేసిన మహాదేవకు రైల్వే ఉన్నతాధికారులు సన్మానించటమే కాదు.. రూ.15 వేల నగదు పురస్కారాన్ని అందజేశారు. అయితే.. అంత పెద్ద సాహసం చేస్తే.. అంత చిరు మొత్తం ఇవ్వటం కన్నా.. ఇంకేదైనా ప్రోత్సాహాన్ని ఇచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News