ట్రంప్ 'లెక్కే' వేరు... ఎల్ సాల్వాడార్ 'నరకం' మరోసారి తెరపైకి!
అయితే ఇప్పుడు చెప్పుకోబోయే జైలులో ఒకసారి లోపలికి వెళ్లడమే తప్ప బయటకు సజీవంగా వచ్చేందుకు నో ఛాన్స్!
సాధారణంగా నేరం చేసినవారికి జైలు శిక్ష ఎందుకు వేస్తారు? అతడు చేసిన తప్పుకు శిక్ష అనుభవించి, పరివర్తన చెంది, తిరిగి మామూలు మనిషిగా, మంచి మనిషిగా జీవితాన్ని పునఃప్రారంభిస్తాడని.. మంచి పౌరుడిగా జీవిస్తాడని! అయితే ఇప్పుడు చెప్పుకోబోయే జైలులో ఒకసారి లోపలికి వెళ్లడమే తప్ప బయటకు సజీవంగా వచ్చేందుకు నో ఛాన్స్!
అవును... కిటికీలు లేని సెల్స్ లో పరుపులు లేని లోహపు పడకలపై నిద్రపోతూ, ములాఖత్ అనే మాటే లేకుండా, 24 గంటలూ నిఘాలో ఉంచబడుతు, ఖైదీలు అంటే మనుషులు కాదు అనే ఆలోచనతో ఓ జైలును ఈ రోజుల్లో కూడా నిర్వహిస్తున్నారు. అసలు ఏమిటీ జైలు, ఎక్కడుందీ జైలు, ఎందుకు నిర్వహిస్తున్నారు మొదలైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..!
ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాల మధ్యన సెంట్రల్ అమెరికాలో ఓ చిన్న దేశం "ఎల్ సాల్వడార్"! ఈ దేశంలో ఉందో మహా కారాగారం. దీనిపేరు సీ.ఈ.సీ.ఓ.ట్ (సీకోట్). ఇది టెర్రరిజం కన్ఫైన్మెంట్ సెంటర్. ఇది 2023లో ప్రారంభించబడిన దేశంలోనే అతిపెద్ద జైలు. ఇందులో గరిష్టంగా 40,000 మంది ఖైదీలు ఉండోచ్చు.
ఇందులో ఎనిమిది విశాలమైన పెవిలియన్స్ ఉండగా.. అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం ఒక్కో సెల్ లో 65 నుంచి 70 మంది ఖైదీలను ఇది కలిగి ఉంటుంది. ఇప్పుడు సడన్ గా ఈ జైలు గురించిన చర్చ ఎందుకు మొదలైందనేది పాఠకుల ప్రశ్న అయితే.. అందుకు సమాధానం డొనాల్డ్ ట్రంప్ తీసుకోబోతున్నట్లు చెబుతున్న నిర్ణయం అని అంటున్నారు!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ "అమెరికా ఫస్ట్", "మేక్ అమెరికా గ్రేట్ అగైన్", "ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలి" వంటి కామెంట్లు బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో మూడో ఆప్షన్ కోసం ట్రంప్ సరికొత్త ఆలోచన చేశారు. ఇందులో భాగంగా.. తమ ఖైదీల నిర్వహణ ఖర్చు తగ్గించాలని భావిస్తున్నారు.
ఇందులో భాగంగా... పదే పదే నేరాలకు పాల్పడే అమెరికన్లను అతి తక్కువ ఫీజు చెల్లించి ఇతర దేశాల్లో నిర్బంధించే అవకాశాలను తాను పరిశీలిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇదే సమయంలో... తమ జైలు వ్యవస్థలో కొంత భాగాన్ని అవుట్ సోర్స్ చేయడానికి అవకాశం ఇవ్వాలని సాల్వడార్ అధ్యక్షుడు నయీబ్ బుకెలే ప్రతిపాదించారని అంటున్నారు.
దీనిపై స్పందించిన ఎల్ స్వాల్వడార్ స్వచ్ఛంద సంస్థలు... అమెరికా ఖైదీలను తమ దేశంలో బంధిస్తే మానవ హక్కుల ఉల్లంఘన అధికమవుతుందని, మానవ హక్కులు మరింత ప్రమాదంలో పడతాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ.. ఇలాంటి చిన్న చిన్న విషయాలను ట్రంప్ పె ద్దగా పట్టించుకోరు కాబట్టి.. ఈ జైలుపై చర్చ తెరపైకి వచ్చిందని చెబుతున్నారు.
ఇక.. మళ్లీ జైలు పరిస్థితుల విషయానికొస్తే.. ఎల్ సాల్వడార్ రాజధాని శాన్ సాల్వడార్ కు తూర్పుగా 40 మైళ్ల దూరంలోని గ్రామీణ ప్రాంతంలో సుమరు 57 ఎకరాల్లో విస్తరించింది ఉంది ఈ భారీ కారాగారం. లాటిన్ అమెరికాలోనే ఇది అతి పెద్ద జైలు అని చెబుతారు. ఈ జైలులో ఖదీలు బాక్సర్ షార్ట్స్ మాత్రమే ధరించి కనిపిస్తారు.
ఇక వీరికి శిక్షాకాలం పూర్తైన తర్వాత కానీ.. అంతకంటే ముందు సక్రమ ప్రవర్తన కోటాలో కానీ భయటకు పంపే అవకాశం లేదు. అందుకే వీరికి వర్క్ షాప్ లు, విద్యా కార్యక్రమాలు వంటిని ఏమీ ఉండవు. వీరు ఎప్పటికీ బయటకు అనుమతించబడరు. లోపలికి వెళ్లడమే తప్ప బయటకు రావడానికి నో ఛాన్స్!