భారత్ లో ట్రంప్ టవర్.. ఏ నగరంలో అంటే?
ఇదిలా ఉంటే తాజాగా ట్రంప్ రియల్ ఎస్టేట్ సంస్థ భారత్ లోకి అడుగు పెట్టేందుకు రంగం సిద్ధమైంది.;
ప్రపంచానికి పెద్దన్న అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ట్రంప్ రాజకీయ నేత మాత్రమే కాదు.. ఆయన వివిధ వ్యాపారాలుచేస్తారన్న సంగతి తెలిసిందే. ఆయన చేసే వ్యాపారాల్లో రియల్ ఎస్టేట్ చాలా కీలకమైనది. ఇదిలా ఉంటే తాజాగా ట్రంప్ రియల్ ఎస్టేట్ సంస్థ భారత్ లోకి అడుగు పెట్టేందుకు రంగం సిద్ధమైంది.
ఈ కొత్త ప్రాజెక్టు మహారాష్ట్రలోని పూణె నగరం వేదిక కానుంది. ఐటీ రంగంలో నొయిడా.. బెంగళూరు.. హైదరాబాద్ తర్వాత ఫూణె కీలక భూమిక పోషిస్తుంది. అలాంటి ఆ నగరానికి ట్రంప్ రియల్ సంస్థ అడుగు పెట్టటం ఆసక్తికరంగా మారింది. పూణెలోని నార్త్ మొయిన్ రోడ్ జిల్లాలో రెండు అత్యాధునిక ఆఫీస్ టవర్ల సముదాయాన్ని సిద్ధం చేయనున్నట్లుగా చెబుతున్నారు. మన దేశంలో ట్రంప్ రియల్ సంస్థ షురూ చేస్తున్న తొలి ప్రాజెక్టుగా దీన్ని చెప్పాలి. ఈ ప్రాజెక్టును ట్రిబెకా డెవలపర్స్.. కుందన్ స్పేసెస్ సహకారంతో డెవలప్ చేస్తున్నారు.
ట్రంప్ సంస్థ కొన్ని దశాబ్దాలుగా భారత్ లో తన మార్కెట్ కు ప్రాధాన్యత పెంచుకోవటానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే భారత్ వెలుపల ట్రంప్ బ్రాండ్ కు ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. ఇక.. భారత్ లో అడుగు పెడుతున్న ట్రంప్ సంస్థ జత కడుతున్న ట్రిబెకా డెవలపర్స్ విషయానికి వస్తే.. ఇప్పటికే ఆ సంస్థ దేశంలోని నాలుగు నగరాల్లో లగ్జరీ నివాస ప్రాజెక్టులను డెవలప్ చేసిన ట్రాక్ రికార్డు ఉంది.
ఈ కొత్త ప్రాజెక్టు పేరు ట్రంప్ వరల్డ్ సెంటర్ గా పేర్కొంటున్నారు. దీన్ని 4.3 ఎకరాల్లో డెవలప్ చేయనున్నారు. స్థానికంగా రియల్ ఎస్టేట్ వాల్యూ ఉన్న ప్రాంతంలో ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. మొత్తం 27 అంతస్తుల్లో 1.6 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నారు. వ్యాపార.. కార్యాలయ స్పేస్ కు ఉపయోగపడేందుకు వీలుగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేసినట్లుగా చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యేందుకు దాదాపు నాలుగేళ్ల సమయం పడుతుందని చెబుతున్నారు. ఈ ఈ ప్రాజెక్టుకు రూ.1700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనుండగా.. అమ్మకాలు దాదాపు రూ.2500 కోట్ల వరకు ఉంటాయని చెబుతున్నారు. ప్రాజెక్టు ప్రారంభానికి ముందే.. ప్రాఫిట్ ప్రాజెక్టును చేపట్టనున్న విషయం అర్థమవుతుంది.