బాబు అరెస్ట్ మీద తలసాని సంచలన కామెంట్స్ !
ఏపీలో రాజకీయాల మీద చంద్రబాబు అరెస్ట్ మీద తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు.
ఏపీలో రాజకీయాల మీద చంద్రబాబు అరెస్ట్ మీద తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు. డెబ్బై నాలుగేళ్ల వయసు ఉన్న పెద్ద మనిషి ఎన్నో హుందా అయిన పదవులు చేసిన చంద్రబాబుని అరెస్ట్ చేసి జైలులో వేయడం కరెక్ట్ కాదని కుండబద్ధలు కొట్టారు. అసలు సరైన ప్రొసీజర్ ని అనుసరించలేదని అన్నారు.
ఎవరూ చట్టానికి అతీతులు కారని, అంత మాత్రం చేత ప్రజాస్వామ్యంలో పద్ధతులు కొన్ని ఉంటాయి వాటిని అనుసరించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని అన్నారు. ఆయన తప్పు చేసి ఉంటే నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించుకోవచ్చునని అలా కాకుండా సడెన్ గా అరెస్ట్ చేసి లోపల వేయడమేంటి అని నిలదీశారు. ఈ అరెస్ట్ వెనక ఎవరు ఉన్నారు అన్నది దేశమంతటికీ తెలుసు. తాను నరేంద్ర మోడీని జగన్ని ఎవరినీ పేరు పెట్టి విమర్శించనని ఆయన అంటున్నారు.
ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ అధికారంలోకి వచ్చి మరో నాయకుడిని ఈ రోజు జైలులో వేస్తే రేపు మరో పార్టీ వచ్చి ఇంకో నాయకుడిని వేస్తే ఇదేనా డెమోక్రసీ అని ఆయన నిలదీశారు. ఇలా కక్ష సాధింపు రాజకీయాలు చేసుకుంటూ పోతే రాజకీయాలకు అర్ధం ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ కూడా అతిగా రియాక్ట్ అవుతోందని ఆయన ఫైర్ అయ్యారు.
ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్న తీరుని తప్పు పట్టారు. ఇక్కడ ఎవరి మీద ఎవరూ ఆధారపడరని అన్నారు. తాను మొదటి రోజునే బాబు అరెస్ట్ ని ఖండించానని గుర్తు చేశారు. ఎవరి ఎలా రియాక్ట్ కావాలన్నది మరొకరు చెప్పాల్సింది లేదని కూడా అన్నారు. ఇన్ని మాటలు చెబుతున్న తెలుగుదేశం బాబు అంతటి పెద్ద మనిషిని అరెస్ట్ చేసి జైలులో పెడితే ఏమి చేస్తోందని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు పక్కన ఉండి అధికారం అనుభవించిన వారు, మంత్రులుగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా చేసిన వారు ఇపుడు ఏమి చేస్తున్నారు అని ఎదురు ప్రశ్నించారు. వారంతా ఇంట్లో కూర్చున్నారని అన్నారు. బయటకు వస్తే ఏమి పోతుందని ఆయన అన్నారు అంతా ఏదో ఒకనాడు చావాల్సిందే అని బాబు అరెస్ట్ ని నిరసిస్తూ వ్యవస్థనలను స్థంభింపచేయలేరా అని టీడీపీ నేతలనే సూటింగా ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే చంద్రబాబు ఉమ్మడి ఏపీకి సీఎం గా చేశారని, ఎన్నో సేవలు అందించారని ఆయన అన్నారు. తాను ఆయన మంత్రివర్గంలో పనిచేశానని చెప్పారు. చంద్రబాబు వంటి పెద్ద నాయకుడిని అరెస్ట్ చేసిన తీరు అయితే అంతా తప్పు పట్టాల్సిందే అన్నారు.
ఇక తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం ముందు సమానమే అన్నారు. మొత్తానికి తలసారి అటు బాబు అరెస్ట్ పట్ల తన సానుభూతి మద్దతు తెలియచేస్తూనే వైసీపీ టీడీపీ నేతల తీరుని తప్పు పట్టారు. అదే టైం లో బాబు అరెస్ట్ వెనక ఎవరున్నారు అన్నది అందరికీ తెలుసు అంటూ కొన్ని డౌట్లు జనంలో వదిలిపెట్టారు. ఆయన నరేంద్ర మోడీ జగన్ ని ఏమీ అనను అన్న మాట కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం.