స్టాలిన్ ఆశలను సాలిడ్ గా కట్ చేసిన ఉదయనిధి

ఉదయనిధిని సీఎం గా బాధ్యతలు అప్పగించి తాను జాతీయ రాజకీయాల వైపు వెళ్ళాలని అనుకుంటున్నారు అని ప్రచారంలో ఉంది.

Update: 2023-09-05 13:36 GMT

డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆశలను నిలువునా పాతరేసేలా కుమారుడు ఉదయనిధి స్టాలిని రెచ్చిపోతున్నారు. తగ్గేదేలే అంటున్నారు. భారతదేశం అంటే సనాతన దేశం. ఆ సంగతి మరచి హద్దు మీరిన వాచాలత్వంతో సనాతన ధర్మాన్ని డెంగ్యూతోతో మరో దానితోనూ పోల్చుతూ చులకన చేశారు.

అయితే అది కాస్తా డీఎంకే ఆశలకు ఫ్యూచర్ కి కూడా పెద్ద దెబ్బగా మారింది అని అంటున్నారు. స్టాలిన్ అవక అవక దాదాపుగా ఏడు పదుల వయసులో తమిళనాడుకు సీఎం అయ్యారు. ఆయన పద్నాలుగేళ్లపుడే రాజకీయాల్లోకి వచ్చి తండ్రి కరుణానిధి నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. యాభై ఏళ్ళ వయసు నాటికి డిప్యూటీ సీఎం హోదాలో సరిపెట్టుకున్నారు. తండ్రి బతికి ఉండగా సీఎం అనిపించుకోలేకపోయినా ఓపికతో వ్యవహరించి మంచి మెజారిటీతో 2021లో తమిళనాడు కుర్చీని పట్టేశారు.

ఇక ఆయన బలమైన రాజకీయ పార్టీ డీఎంకేను ఇంకా పటిష్టం చేసేలా తొలి నాళ్ళలో వ్యవహరించారు. అయితే కొన్నాళ్ళ తరువాత ఆయన క్యాబినేట్ లో మంత్రిగా చేరిన ఉదయనిధి స్టాలిన్ తండ్రి కంటే తానే ఎక్కువ అన్నట్లుగా దూకుడు చేస్తున్నారు. ఆయనను మంత్రిగా చేసి మరో అధికార కేంద్రానికి స్టాలిన్ చాన్స్ ఇచ్చారు అని అంటున్నారు. అలా డీఎంకేలో సీనియర్లు నలుగుతున్నారు.

మరో వైపు చూస్తే 2021లో వచ్చిన ఊపు అయితే ఇపుడు డీఎంకేకు లేదు, కొంత తగ్గింది అని అంటున్నారు అవతల వైపు అన్నాడీఎంకే సరైన నాయకత్వం లేక దెబ్బతిన్నా కూడా కేంద్రంలోని బీజేపీ దాన్ని కంట్రోల్ చేస్తూ నిలబెడుతోంది. ఇక బీజేపీకి అన్నామలై అనే ఒక యువ నేత దొరికాడు. ఆయన పాదయాత్ర చేస్తూ తమిళనాడులో బీజేపీకి కొత్త ఆశలు కల్పిస్తున్నారు. అన్నాడీఎంకే బీజేపీ పొత్తుల వల్ల డీఎంకేకు కొన్ని సీట్లు పోతాయని తెలిసిందే.

ఇక ఇండియా కూటమిలో స్టాలిన్ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన ఈ టెర్మ్ తరువాత కొడుకు ఉదయనిధిని సీఎం గా బాధ్యతలు అప్పగించి తాను జాతీయ రాజకీయాల వైపు వెళ్ళాలని అనుకుంటున్నారు అని ప్రచారంలో ఉంది. ఇండియా కూటమిలో కాంగ్రెస్ కి నమ్మదగిన మిత్రుడుగా స్టాలిన్ ఉన్నారు. పైగా తమిళనాడు నుంచి ఎక్కువ మంది ఎంపీలను తెస్తే ఆయన ఢిల్లీ రాజకీయాలలో కింగ్ మేకర్ అవుతారు.

ఇలాంటి ఆశావహ వాతావరణాన్ని తన నోటి దురుసుతో ఉదయనిధి స్టాలిన్ మొత్తానికి మొత్తం పాడుచేశారు అని అంటున్నారు. ఉదయనిధి సనాతన ధర్మం మీద చేసిన విమర్శలకు జవాబు చెప్పుకోలేక ఇండియా కూటమి కిందా మీదా అవుతోంది. అదే టైం లో కాంగ్రెస్ కూడా ఉదయనిధి కామెంట్స్ ని తప్పుపట్టింది. మమతా బెనర్జీ అయితే ఒక జూనియర్ మాట్లాడిన మాటలు అవి అంటూ ఫైర్ అయ్యారు. కొడుకు కాబట్టి స్టాలిన్ మద్దతుగా మాట్లాడుతున్నారు కానీ ఆయనదీ ఇబ్బందికరమైన పరిస్థితి అంటున్నారు.

ఇక తమిళనాడులో చూస్తే సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో విజయ్ కొత్త పార్టీ పెట్టి వచ్చే ఎన్నికల నాటికి జనంలోకి రావాలని చూస్తున్నారు. ఆయన పార్టీ వల్ల కచ్చితంగా డీఎంకేకి గట్టి దెబ్బ పడుతుంది అని అంటున్నారు. రజనీ తరువాత అంతటి ఫాలోయింగ్ విజయ్ సొంతం అంటారు. ఇంకో వైపు చూస్తే తమిళనాడులో హిందూ దేవాలయాలు ఎక్కువే. ద్రవిడ ఉద్యమం అంటూ నాస్తిక వాదాన్ని ఎంత వ్యాప్తి చేసినా కూడా హింతూత్వకు కూడా అక్కడ ఆదరణ ఉంది.

ఇపుడు దాన్ని తట్టి లేపి సెంటిమెంట్ ని పంట పండించే ప్రయత్నం చేశారు ఉదయనిధి అని అంటున్నారు. ఒక విధంగా బీజేపీకి తమిళనాట దోవ చూపించారు అని అంటున్నారు. ఇల్లు అలకగానే పండుగ కాదు, ఈ రోజు అధికారంలో ఉండగానే రెచ్చిపో రాదు. డీఎంకే ఎపుడూ వరసగా రెండు సార్లు గెలిచింది లేదు.

ఆ చరిత్ర అన్నా డీఎంకేకి ఉంది. ఇపుడు కొత్త ప్రాంతీయ పార్టీ పుట్టినా లేక బీజేపీకి హిందూత్వ ఆక్సిజన్ అందినా స్టాలిన్ తో పాటు ఉదయనిది ఆశలు మొత్తం గోవిందా అవుతాయని అంటున్నారు. ఏది ఏమైనా చాన్స్ దొరికితే తానూ ప్రధాని రేసులో ఉన్నాను అని చెప్పుకోవడానికి తండ్రి స్టాలిన్ కి లేకుండా కొడుకు ఉదయనిధి చేశారని అంటున్నారు. సో డీఎంకేకు సన్ స్ట్రోక్ బాగానే తగిలింది అని అంటున్నారు.

Tags:    

Similar News