మహిళలపై ద్వేషం తీవ్రవాదమే.. ఒక దేశం కీలక నిర్ణయం
మహిళలను ఇప్పుడిప్పుడే గౌరవంగా చూసే పరిస్థితి వస్తోంది. పురుషులతో స్త్రీలు సమానం అనే భావన పెరుగుతోంది
ఈ ప్రపంచంలో మహిళ అంటేనే అద్భుతం.. తల్లిగా, చెల్లిగా, భార్యగా ఆమె చూపించే ప్రేమ.. ఆప్యాయత.. అనురాగం.. చేసే సేవలకు వెల కట్టలేం. అయితే, అందరూ మహిళను సమభావం చూసే పరిస్థితిలో లేరు. కొందరు చులకనగా, మరికొందరు గౌరవంగా, ఇంకొందరు ఓ ఆట వస్తువుగా పరిగణిస్తుంటారు. మహిళ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ సకల దేవతలు కొలువుదీరతారనేది భారతీయులు నమ్మే మాట.
సమాజంలో వివక్షే
మహిళలను ఇప్పుడిప్పుడే గౌరవంగా చూసే పరిస్థితి వస్తోంది. పురుషులతో స్త్రీలు సమానం అనే భావన పెరుగుతోంది. కొన్ని దశాబ్దాల కిందటి వరకు అమ్మాయిలకు చదువంటే ఎందుకు అనే ప్రశ్న వచ్చేది. ఇప్పుడు అదే అమ్మాయిలు చదువుల్లో దూసుకెళ్తున్నారు. కాగా, సంప్రదాయాల పేరిట కొన్ని దేశాల్లో ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నా.. ఒక్కొక్కటిగా తొలగుతున్నాయి.
భేష్ యూకే నిర్ణయం..
పౌరుల హక్కులకు అధిక ప్రాధాన్యం ఇచ్చే దేశాలు పాశ్చాత్య దేశాలు. అలాంటివాటిలో యునైటెడ్ కింగ్ డమ్ ముందుంటుంది. ఒకప్పుడు విశాల సామ్రాజ్యాన్ని పాలించిన బ్రిటిష్ వారు.. ఆయా దేశాల్లో హక్కులను అణగదొక్కారన్న అపవాదును మోశారు. అలాంటి తెల్లదొరలే ఇప్పుడు బాలికలు, మహిళలపై పెరుగుతున్న హింసాత్మక ఘటనల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిని నిరోధించడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు.
స్త్రీపై ద్వేషం తీవ్రమే
అకారణంగా మనిషిని ద్వేషించడం ఎక్కడైనా తప్పే. అది మహిళల విషయంలో అయితే మరీ తప్పు. ఇప్పుడు ఇలాంటి తీవ్రమైన స్త్రీ ద్వేషాన్ని తీవ్ర వాదంగా పరిగణించాలని నిర్ణయించింది. ఆన్ లైన్ లో మహిళలపై విద్వేష ప్రసంగాలు చేస్తున్నవారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని యూకే హోం మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని అమలుచేయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై పెరుగుతున్న దాడుల నిరోధానికి కఠిన చట్టాలు అవసరం అని అంటున్నారు. ఇలాంటి సమయంలో యూకే తీసుకున్న నిర్ణయం ప్రశంసించదగినదే. మిగతా దేశాలూ అనుసరించదగినది.