‘పోర్ట్ బ్లెయిర్’ పేరు పెట్టబడిన ఆర్కిబాల్డ్ బ్లెయిర్ గురించి తెలుసా?

అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును "శ్రీ విజయపురం" గా మారుస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Update: 2024-09-14 19:30 GMT

అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును "శ్రీ విజయపురం" గా మారుస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. వలసవాద ముద్రల నుంచి విముక్తి కల్పించేందుకు ఈ పేరు మార్పు అని కేంద్రం ప్రకటించింది. ఈ సమయంలో అసలు అండమాన్ నికోబార్ రాజధానికి పోర్ట్ బ్లెయిర్ పేరు ఎలా వచ్చింది.. ఎప్పుడు వచ్చింది.. ఎందుకు వచ్చింది.. అనేది చర్చ తెరపైకి వచ్చింది.

అవును... వలసవాద ముద్రల నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును మారుస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా "ఎక్స్" వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి.. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో కలిసి పనిచేసిన నావికాదళ అధికారి కెప్టెన్ ఆర్కిబాల్డ్ బ్లెయిర్ పేరు మీద ఈ నగరానికి గతంలో ఆ పేరు పెట్టారు.

ఎవరీ కెప్టెన్ ఆర్కిబాల్డ్ బ్లెయిర్..?

బ్రిటిష్ నావికాదళ అధికారి అయిన కెప్టెన్ ఆర్చిబాల్డ్ బ్లెయిర్ 1771లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ కింద బాంబే మెరైన్ లో లెఫ్టినెంట్ గా చేరారు. అనంతర కాలంలో ఆయన ఇండియా, ఇరాన్, అరేబియా తీరాల వెంబడి సర్వే మిషన్ ను ప్రారంభించాడు. అయితే 1780లో కేప్ ఆఫ్ గుడ్ హోప్ యాత్రలో ఉండగా బ్లెయిర్ ప్రయాణం ఊహించని మలుపు తిరిగింది!

ఇందులో భాగంగా అతడిని ఓ ఫ్రెంచ్ యుద్ధనౌక బంధించింది. దీంతో... 1784 వరకూ అతడు వారి వద్ద ఖైదీగా ఉన్నాడు. చివరికి డచ్ కి అప్పగించబడ్డాడు. ఈ క్రమంలో తిరిగి బాంబే మెరైన్ కు వచ్చాడు. అనంతరం తన నౌకాదళ ప్రయాణాలను తిరిగి కొనసాగించాడు. ఈ క్రమంలోనే హిందూ మహాసముద్రం అంతటా సర్వేలు నిర్వహించాడు.

ఇందులో భాగంగా... మాల్దీవులకు దక్షిణానికి సమీపంలో ఉన్న చాగోస్ ద్వీపసమూహం, కోల్ కతా సమీపంలోని డైమండ్ హార్బర్, హుగ్లీ నదీతో సహా పలు ప్రాంతాలను 1786 - 1788 మధ్య కాలంలో సర్వే చేశాడు. ఈ క్రమంలోనే 1788-1789 మధ్య కాలంలో ప్రధానంగా అండమాన్ దీవులపై బ్లెయిర్ సర్వే జరిగింది.

దీనికి సంబంధించిన సమగ్ర పరిశోధనలను బ్రిటీష్ గవర్నర్ జనరల్ కు సమర్పించాడు బ్లెయిర్. అతని వివరణాత్మక నివేదిక అండమాన్ దీవులను వలసరాజ్యం చేయాలనే బ్రిటీష్ సామ్రాజ్య నిర్ణయానికి బలం చేకూర్చింది. ఈ సమయంలోనే అండమాన్ లో సురక్షిత నౌకాశ్రయాన్ని నిర్మించాలని బ్రిటిష్ వారు లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇలా గ్రేట్ అండమాన్ ద్వీపం దక్షిణ భాగానికి తన సాహస యాత్రతో కెప్టెన్ ఆర్కిబాల్డ్ బ్లెయిర్ ఓ అద్భుతమైన సహజ నౌకాశ్రయాన్ని కనుగొన్నాడని బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలోనే అతని గౌరవార్థం ఆ ప్రాంతాన్ని పోర్ట్ బ్లెయిర్ గా నామకరణం చేశారు. అయితే తాజాగా ఈ పోర్ట్ బ్లెయిర్ ప్రాంతాన్ని శ్రీ విజయపురంగా పేరు మారుస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

Tags:    

Similar News