ఆ రాష్ట్రాలకే అత్యధిక మంత్రి పదవులు ఎందుకు?
ఈ ఏడాది మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే జమ్మూకాశ్మీర్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
కేంద్ర మంత్రివర్గంలో కొన్ని రాష్ట్రాలకే అత్యధిక ప్రాధాన్యం లభించింది. ప్రధానంగా రానున్న రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు కేంద్ర మంత్రివర్గంలో పెద్దపీట లభించింది. సీనియార్టీ, సామాజికవర్గాల కూర్పు, పార్టీకి విధేయత వంటి కారణాలతోనే మంత్రి పదవులు లభించినా.. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు తాజా కేంద్ర మంత్రివర్గంలో పెద్దపీట వేశారని చర్చ జరుగుతోంది.
ఈ ఏడాది మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే జమ్మూకాశ్మీర్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాలకు కేంద్ర మంత్రివర్గంలో మంచి ప్రాధాన్యమే లభించింది.
మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీలకు ఈ ఏడాది అక్టోబర్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అలాగే ఈ ఏడాది చివరలో జార్ఖండ్ అసెంబ్లీకి, వచ్చే ఏడాది జనవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ముందుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, హరియాణాలకు కేంద్ర మంత్రివర్గంలో కీలక ప్రాధాన్యం లభించింది.
అత్యధికంగా మహారాష్ట్ర నుంచి ఆరుగురికి కేంద్ర మంత్రివర్గంలో పదవులు లభించాయి. ఇంకోటి కూడా లభించేది. అయితే ఎన్సీపీ నేత ప్రపుల్ పటేల్ తనకు సహాయ మంత్రి పదవి వద్దన్నారు. కేబినెట్ మంత్రి అయితేనే తీసుకుంటామన్నారు. మహారాష్ట్ర నుంచి చోటు దక్కిన ఆరుగురు మంత్రుల్లో నలుగురు బీజేపీ వారే. మరొకరు శివసేన (ఏకనాథ్ షిండే) కాగా మరొకరు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) పార్టీకి చెందినవారు.
అలాగే ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హరియాణాకు చెందిన ముగ్గురికి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించింది. హరియాణా చిన్న రాష్ట్రం. కేవలం 90 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. అలాగే పది ఎంపీ స్థానాలు మాత్రమే హరియాణాలో ఉన్నాయి. ఇందులో బీజేపీ ఐదు స్థానాల్లో విజయం సాధించింది. ఈ రీత్యా చిన్న రాష్ట్రమైన హరియాణాకు కేంద్ర మంత్రివర్గంలో మూడు బెర్తులు దక్కడం విశేషమనే చెప్పాలి. హరియాణా నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఒకరు కేబినెట్ మంత్రి హోదాలో, మరొకరు ఇండిపెండెంట్ హోదాలో, మరొకరు సహాయ మంత్రి హోదాలో ఉన్నారు.
ఇక జమ్మూకాశ్మీర్ అసెంబ్లీకి కూడా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్కడ మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఐదు ఎంపీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఇందులో తాజా ఎన్నికల్లో బీజేపీకి రెండు స్థానాలు మాత్రమే లభించాయి. దీంతో ఒకరికి ఇండిపెండెంట్ హోదాలో మంత్రివర్గంలో ప్రధాని మోదీ స్థానం కల్పించారు. ఉదంపూర్ ఎంపీగా గెలిచిన జితేంద్ర సింగ్ కు మంత్రి పదవి దక్కింది.
ఇక బీహార్ లో ఎన్డీయే కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకుంది. ఆ రాష్ట్రంలో బీజేపీ మిత్రపక్షాలు జేడీయూ, లోక్ జనశక్తి (రామ్ విలాస్), అవామీ హిందూ మోర్చాలకు మంత్రి పదవులు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో ఆ రాష్ట్రం నుంచి ఏకంగా 8 మందికి కేంద్ర మంత్రివర్గంలో పదవులు లభించాయి. ఇందులో అత్యధికం కేబినెట్ మంత్రి హోదాతో కూడినవే.