బేవకూఫ్.. బైఠో! పార్లమెంటులో శివసేన ఎంపీపై మంత్రి బూతులు
పవిత్రమైన పార్లమెంటులో అధికార పార్టీ సభ్యులు సహనం కోల్పోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
పవిత్రమైన పార్లమెంటులో అధికార పార్టీ సభ్యులు సహనం కోల్పోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రు లుగా ఉన్నవారు, బీజేపీ సీనియర్లు గత రెండు రోజులుగా తీవ్రస్థాయిలో ప్రతిపక్షంపై విమర్శలు గుప్పిస్తున్నారు. విరుచుకుపడు తున్నారు. మంగళవారం లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు సహా టీఎంసీ సభ్యుడిపై బీజేపీ ఎంపీలు విరుచుకుపడి తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఘటనలు ఇంకా చల్లారకముందే.. తాజాగా లోక్‌సభలో కేంద్రమంత్రి నారాయణ రాణే.. మహారాష్ట్రకు చెందిన ఉద్దవ్ ఠాకరే నేతృత్వంలోని శివసేన పార్టీ ఎంపీపై బూతులతో విరుచుకుపడ్డారు.
``బేవకూఫ్ బైఠో`` అంటూ.. కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యతో లోక్‌సభలో ఒక్కసారిగా కలకలం రేగింది. దీనిని సాక్షాత్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా తప్పుబట్టారు. అంతేకాదు, రికార్డుల నుంచి తక్షణమే తొలగిస్తున్నట్టు బేషరతుగా ఆయన ప్రకటన చేశారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రిని కూడా స్పీకర్ తీవ్రంగా హెచ్చరించారు. ``సభా సంప్రదాయాలు తెలుసుకోరా!`` అంటూ.. సొంత పార్టీ(బీజేపీ) సభ్యుడు, మంత్రిపై స్పీకర్ వ్యాఖ్యలు చేశారంటే.. ఏ రేంజ్‌లో మంత్రి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు.
అసలు ఏం జరిగింది?
విపక్ష కూటమి ఇండియా సభ్యులు.. మోడీ ప్రబుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం, బుధవారం(ఈరోజు) కూడా సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా శివసేన ఎంపీ అరవింద్ సావంత్ మాట్లాడు తూ.. మహారాష్ట్రలో తమ సర్కారును కూల్చేసిన ఘనత, ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలకే దక్కుతుందని విమర్శించారు. ఈ 9 ఏళ్లలోమా లాంటి పార్టీలను ఎన్నింటినో చీల్చి.. ప్రభుత్వాలను కూలదోశారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి నారాయణ రాణే(మహారాష్ట్రకు చెందిన నాయకుడు. గతంలో ఈయన చేసిన వివాదాస్పదపై కేసు కూడా నమోదైంది) లేచి.. ఒక్కసారిగా నిప్పులు చెరిగారు.
``బేవకూఫ్.. బైఠో.. మోదీజీ ఔర్ అమిత్ షా జీకో విమర్శ్ దేనేకో తుమ్‌తో స్థాయీ నహీహై.. బైఠో బేవకూఫ్.. మగర్..``(కూర్చో.. ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షాలపై వ్యాఖ్యలు చేసే స్థాయి నీకు లేదు. ఒకవేళ ను వ్వు మాట్లాడితే.. దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి) అని హెచ్చరిక చేశారు. దీంతో లోక్‌సభ స్పీకర్ ఆయన్ను మందలించారు. సరైన పదజాలం వాడండి అంటూ సూచించారు. రాణె ప్రవర్తనపై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తం అయ్యాయి.