బీజేపీలో బాబుకు ఆప్త మిత్రుడు ఆయనే...?

బీజేపీతో చంద్రబాబుకు చెడింది అని ఒక వైపు ప్రచారం ఉంది. మరో వైపు చూస్తే బీజేపీ ఎన్నికల వేళకు అయినా బాబుతో పొత్తుకు వస్తుంది అని అంటారు.

Update: 2023-09-24 16:02 GMT

బీజేపీతో చంద్రబాబుకు చెడింది అని ఒక వైపు ప్రచారం ఉంది. మరో వైపు చూస్తే బీజేపీ ఎన్నికల వేళకు అయినా బాబుతో పొత్తుకు వస్తుంది అని అంటారు. ఇక బీజేపీ అధినాయకులుగా నరేంద్ర మోడీ, అమిత్ షా ఉన్నంతవరకూ కమలం నీడ బాబుకు దొరకదు అని ఇంకో వెర్షన్ వినిపిస్తూంటారు.

ఎందుకంటే 2018 తరువాత చంద్రబాబు బీజేపీ పొత్తుకు తలాఖ్ అంటూ బయటకు వచ్చి చేసిన రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు, అదే టైం లో చంద్రబాబు కాంగ్రెస్ తో చేతులు కలిపారు. బీజేపీ నేతలను విమర్శించినా బాధ అంత ఉండకపోవచ్చు కానీ తమకు ఆగర్భ శత్రువు కాంగ్రెస్ తో బాబు చేతులు కలపడంతోనే నరేంద్ర మోడీ, అమిత్ షా బాగా గుస్సా అయ్యారని చెబుతారు.

ఇక 2019 ఎన్నికల తరువాత బాబు కాంగ్రెస్ కి దూరం జరిగి బీజేపీ వైపు చూస్తున్నా నమ్మకం కలగడంలేదు అంటున్నారు. ఎందుకంటే 2024 ఎన్నికలు చాలా కీలకంగా ఉంటాయి. బీజేపీకి సొంతంగా మెజారిటీ వస్తుందా రాదా అన్న డౌట్లు ఉన్నాయి. అదే టైం లో ఒక వేళ బీజేపీ మెజారిటీకి దూరంగా ఉంటే బాబు వెళ్ళి మరోసారి కాంగ్రెస్ తో కలుస్తారు అని కూడా అనుమానాలు ఉన్నాయట.

అందుకే బాబుకు కోరి చేయూతను ఇచ్చి ఎందుకు ఏపీలో రాజకీయంగా పెంచడం అన్న ఒక ఆలోచన ఉంది అంటారు. దానితో పాటు ఈసారి బాబు కనుక అధికారంలోకి వస్తే కుమారుడు లోకేష్ కి పట్టాభిషేకం చేస్తారు అని ఎటూ ప్రచారం ఉంది. అలా లోకేష్ కనుక కుదురుకుంటే మరో ముప్పయ్యేళ్ల పాటు టీడీపీని నాయకత్వ సమస్య ఉండదని అంటారు.

ఇక ఏపీలో బీజేపీ ఎదిగేందుకు కూడా మార్గాలు మూసుకుపోతాయి. ఎందుకంటే బీజేపీకి దక్కాల్సిన ఓటింగ్ అంతా టీడీపీ నుంచే రావాలి. అందువల్ల టీడీపీని ఈసారికి ఓడిస్తేనే ఏపీలో బీజేపీకి రాజమార్గం అని ఆ పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు అని అంటారు.

ఇదిలా ఉంటే బీజేపీలో బాబుకు మిత్రులు లేరా ఆయనను టీడీపీ పొత్తులకు కోరుకోని వారు లేరా అంటే బాబు జాతీయ స్థాయిలో ఒకప్పుడు చక్రం తిప్పిన వారు. చురుకైన నేతగా ఉన్నపుడే ఆయనకు బీజేపీలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. అంతదాకా ఎందుకు ఆరెస్సెస్ నేతలు కూడా బీజేపీతో పొత్తు కోరుకుంటారు అని కూడా ప్రచారం లో ఉన్న మాట.

అలా ఆరెస్సెస్ కి నాగపూర్ కి అతి దగ్గర వారు అయిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బాబుకు ఆప్త మిత్రుడు అని కూడా ప్రచారంలో ఉంది. నితిన్ గడ్కరీ సీనియర్ నేత. ఆయన ఆరెస్సెస్ మూలాల నుంచి వచ్చిన వారు. మహారాష్ట్రకు చెందిన ఆయన బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ గా చాలా కాలం పనిచేసారు. ఆయన ప్రధాని రేసులో కూడా ఉన్నారని ప్రచారంలో ఉంది.

అయితే మోడీ అమిత్ షాల బలమైన నాయకత్వం మధ్యలో నితిన్ గడ్కరీ కొంత తెర మరుగు అయ్యారన్న మాట ఉంది. ఆ మధ్యన అయితే ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మొత్తానికి ఆయన సర్దుకున్నారు. ఇటీవల చంద్రబాబు అరెస్ట్ అయితే దాని మీద టీడీపీ ఎంపీ కేశినేని నానితో ప్రత్యేకంగా పిలిచి వాకబు చసిన వారు నితిన్ గడ్కరీ. అంతే కాదు బాబు చాలా మంచి లీడర్ అని ఆయన తొందరలోనే బయటకు వస్తారని ఊరడింపు మాటలను కూడా అన్నారని కేశినేని నాని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

అలా బాబుకు బీజేపీలో గట్టి నేత నితిన్ గడ్కరీ మద్దతు ఉంది అని అంటారు. ఇక గడ్కరీ విషయం తీసుకుంటే 2024లో బీజేపీకి సొంతంగా సరిపడా సీట్లు రాకపోతే ఆయన ప్రధాని రేసులోకి మోడీని నెట్టి ముందుకు వస్తారని కూడా ప్రచారంలో ఉంది. బీజేపీ ఏ 250 సీట్లను తెచ్చుకుని ఆగిపోతే కచ్చితంగా మిత్రుల మద్దతు అవసరం.

అపుడు మిత్రుల మాట చెల్లుబాటు అవుతుంది. ఇక టీడీపీ లాంటి పార్టీల మద్దతూ కీలకం అవుతుంది. అందుకే నితిన్ బాబుతో సన్నిహితంగా ఉంటున్నారు అంటారు. ఒకవేళ టీడీపీతో బీజేపీ పొత్తు కుదిరినా బీజేపీకి మెజారిటీ దక్కకపోతే నితిన్ గడ్కరీ పేరే ఆరెస్సెస్ బయటకు తెస్తుందని అంటారు. ఆ కీలక సమయంలో బాబు మద్దతు కూడా అవసరమే అంటారు. అలా నితిన్ గడ్కరీ ప్రధాని అయ్యేలా బాబు సాయం ఇస్తారా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా బాబుకు అన్ని పార్టీలలో స్నేహితులు ఉన్నారు. అందులో బీజేపీలో గడ్కరీ ఒకరు అంటారు. చూడాలి మరి ఈ రెండు స్నేహాలకు తగిన ప్రతిఫలం దక్కుతుందా అన్నది.

Tags:    

Similar News