ప.గో. టీచరమ్మ పెళ్లికార్డు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక టీచరమ్మ పెళ్లి వేళ.. తన పెళ్లికార్డును వినూత్నంగా డిజైన్ చేయించిన వైనం ఆసక్తికరంగా మారింది.
అందరిలా ఎందుకు నడవాలి? రోటీన్ కు భిన్నంగా ట్రై చేయొచ్చుగా అన్నట్లుగా ఉంటున్నారు పలువురు. ఇస్పెషల్ గా ఉండేందుకు సెలబ్రిటీలే కానక్కర్లేదన్నట్లుగా వారి తీరు ఉంటోంది. జీవితంలో ఒక్కసారి చేసుకునే పెళ్లికి సంబంధించి ప్రతి విషయంలోనూ కాస్తంత ప్రత్యేకంగా.. విభిన్నంగా.. వినూత్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్న తీరు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక టీచరమ్మ పెళ్లి వేళ.. తన పెళ్లికార్డును వినూత్నంగా డిజైన్ చేయించిన వైనం ఆసక్తికరంగా మారింది. చూసినంతనే పెదాల మీద చిరునవ్వులు చిందేలా ఉండటమే కాదు.. ఇలాంటి కార్డును దాచుకోవాలన్నట్లుగా ఉండటం ఈ పెళ్లి కార్డు ప్రత్యేకతగా చెప్పాలి.
ఆగస్టు 23న పెళ్లి చేసుకుంటున్న ప్రత్యూష.. తన పెళ్లి శుభలేఖను కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేసింది. పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామానికి చెందిన టీచర్ ప్రత్యూష.. ఫణీంద్రను పెళ్లాడనున్నారు. ఈ సందర్భంగా తమ పెళ్లి కార్డును తన అభిరుచికి తగ్గట్లు డిజైన్ చేశారు. ట్రెడిషనల్ గా ఉండే తీరును పక్కన పెట్టేసిన ఆమె.. పెళ్లికార్డు ప్రత్యేకత ఏమంటే.. తన అధ్యాపక వృత్తిని గుర్తుకు తెచ్చేలా.. ఎనిమిది ప్రశ్నలతో పెళ్లికార్డును డిజైన్ చేశారు.
ఇందులో కొన్ని ప్రశ్నలకు సూటి సమాధానాలు. మరికొన్ని ప్రశ్నలకు.. ఆప్షన్లు.. మల్టీఫుల్ ఛాయిస్ లు ఇవ్వటం లాంటివి చేయటం.. ఒక ప్రశ్నకు ఫిల్ ఇన్ ది బ్లాంక్ అన్నట్లు వదిలేయటం లాంటివి చేశారు. ఈ శుభలేఖలో పెళ్లి కూతరు.. పెళ్లికొడుకు పేర్లు.. వారి తల్లిదండ్రుల పేర్లు.. కల్యాణ మండపం.. వివాహ ముహుర్తం.. విందులకు సంబంధించిన సమాచారాన్ని ప్రశ్నలు.. సమాధానాలతో అందరికి ఇట్టే అర్థమయ్యేలా డిజైన్ చేశారు.
శుభలేఖలో మొదటి ప్రశ్న.. పెళ్లికొడుకు ఫోటో ఇచ్చి.. అతడ్ని గుర్తించాలని పేర్కొనగా.. రెండో ప్రశ్నలో తన పేరు (ప్రత్యూష)ను ఇంగ్లిషులో తప్పు స్పెల్లింగ్ తో ఇచ్చి.. దాన్ని కరెక్టు చేయమని పేర్కొన్నారు. మూడో ప్రశ్నగా ఖాళీ ఇచ్చి పూరించాలంటూ.. పెండ్లికొడుకు తల్లిదండ్రుల పేర్ల దగ్గర ఖాళీ ఉంచారు. దాని కింద.. ఆన్సర్ గా వారి పేర్లను ముద్రించారు.
నాలుగో ప్రశ్నగా పెళ్లి ఎవరు చేస్తున్నారన్నది ఇచ్చి.. ఐదారు ప్రశ్నలను మాత్రం మల్టీఫుల్ ఛాయిస్ క్వశ్చన్లు ఇవ్వటం ద్వారా.. పెళ్లి ఎప్పుడు? ఏ టైంలో? ఎక్కడ? ఇలాంటి సమాచారం అందేలా చేశారు. అంతేకాదు.. ఎనిమిది ప్రశ్నలకు ఎనిమిది సమాధానాలు ఇవ్వటంతో ముగించకుండా.. వందకు వంద అంటూ స్కోరింగ్ కూడా ఇచ్చేయటం ఆకట్టుకుంటోంది. వినూత్నంగా సిద్ధం చేసిన ఈ పెళ్లి కార్డును అందుకున్న వారందరిని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇస్పెషల్ పెళ్లికార్డు వాట్సాప్ గ్రూపుల్లో ఇప్పుడు వైరల్ గా మారింది.