మన ఎన్నికల్లో అమెరి'కాలు'.. బద్ధ శత్రువు సంచలన ఆరోపణ
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. ప్రస్తుతం ఇలాంటిచోట ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. ప్రస్తుతం ఇలాంటిచోట ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. 96.8 కోట్ల మంది ఓటు వేయనున్నారు. గత ఎన్నికలకు ఇప్పటికి 15 కోట్ల మంది ఓటర్లు పెరిగారంటేనే మనది ఎంత పెద్ద ప్రజాస్వామ్య దేశమో తెలుస్తోంది. ఈ క్రమంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారు ప్రధాని మోదీ. బీజేపీ గెలుపు కోసం దేశవ్యాప్తంగా కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. మోదీని ప్రజాస్వామ్య వ్యతిరేకిగా అభివర్ణిస్తూ.. ఆయన మళ్లీ గెలిస్తే ప్రజాస్వామ్యానికే కాదు.. రాజ్యాంగానికీ ముప్పు అంటూ కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి ప్రచారం చేస్తోంది. కాగా, ఇప్పటికే భారత్ లో మూడు విడతల పోలింగ్ ముగియగా.. ఈ నెల 13న తెలుగు రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
విదేశీ హస్తం.. వాస్తవమెంత..?
భారత ఎన్నికలంటే మామూలు విషయం కాదు. అధికారికంగానే వేల కోట్లు ఖర్చు. అనధికారికంగా అయితే లక్షల కోట్లే అని చెప్పాలి. ఇక దీనికిమించి ఎన్నికల సమయంలో మన దేశంలో పెద్ద పండుగ వాతావరణమే నెలకొంటుంది. అభ్యర్థుల ఎంపికలు.. పార్టీల్లో తిరుగుబాట్లు.. ప్రాచారాలు, ప్రలోభాలు.. ఎత్తులు.. పైఎత్తులు.. వ్యూహాలు.. ప్రతివ్యూహాలు.. ఇలా ఎన్నో ఆసక్తికర అంశాలు జరుగుతుంటాయి. ఇలాంటి ఎన్నికలు సరిగ్గా మూడు దశలు పూర్తయిన సమయంలో రష్యా బాంబు పేల్చింది. భారత ఎన్నికల్లో అమెరికా వేలు పెట్టాలని చూస్తోందని ఆరోపించింది. దీనికి బలమైన ఉదాహరణనే ఇచ్చింది.
మత స్వేచ్ఛపై ఆ నివేదికే నిదర్శనమా?
భారత్ లో మత స్వేచ్ఛపై కొన్ని నెలల కిందట అమెరికా ప్రభుత్వ కమిషన్-కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడం (USCIRF) ఓ నివేదిక విడుదల చేసింది. మత స్వేచ్ఛ విషయంలో భారత్ లో తీవ్ర ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిచింది. అయితే, దీనిని భారత్ గట్టిగా తిప్పికొట్టింది. యూఎస్సీఐఆర్ఎఫ్ ను రాజకీయ ఎజెండాతో పక్షపాత సంస్థగా అభివర్ణించింది. ఇప్పుడిదే నివేదికను ప్రస్తావిస్తూ.. భారత ఎన్నికల్లో అమెరికా ప్రమేయం గురించి రష్యా ఆరోపణలు చేసింది. అయితే, భారత్ లో పరిస్థితి గురించి అమెరికావి నిరాధార ఆరోపణలు చేస్తోందని, ఇది ఆ దేశాన్ని అవమానించడమేనని పేర్కొంది. సరిగ్గా ఎన్నికల ముంగిట ఇలాంటి సున్నిత అంశాలపై నివేదికలు విడుదల చేయడాన్ని గట్టిగా తప్పుబట్టింది. భారత ఎన్నికల్లో తలదూర్చి వాటిని సంక్లిష్టం చేసే ఉద్దేశం ఇదని రష్యా మండిపడింది.
కాగా, అమెరికాలో నవంబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. పాత ప్రత్యర్థులు బైడెన్-ట్రంప్ మరోసారి తలపడనున్నారు. అమెరికా ఎన్నికల్లో రష్యా వేలు పెట్టి.. 2016లో ట్రంప్ గెలిచేలా ప్రచారం చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఇక మార్చి 15-17 మధ్య రష్యాలో ఎన్నికలు జరగ్గా పుతిన్ మళ్లీ గెలిచారు. మూడు రోజుల అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 2030 వరకు ఆయనే అధికారంలో కొనసాగనున్నారు.
కొసమెరుపు: పుతిన్ 2030 వరకు, ఒకవేళ మోదీ మళ్లీ గెలిస్తే 2029 వరకు, ట్రంప్ విజయం సాధిస్తే 2028 వరకు దేశాధినేతలుగా కొనసాగుతారు. వీరి ముగ్గురూ ఎన్నికల విషయంలో తీవ్రంగా చర్చనీయం అయినవారే.