చంద్రబాబు కేసు అప్ డేట్స్... ఏపీ సీఐడీకి సుప్రీం కీలక ఆదేశాలు
ఇదే సమయంలో మరోవైపు ఏపీ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో సుమారు 53 రోజులు ఉన్న అనంతరం బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటికే స్కిల్ స్కాం కేసుపై సుప్రీంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో మరోవైపు ఏపీ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తాజాగా ఈ రోజు ఆ కేసు విచారణకు వచ్చింది.
అవును... సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కు సంబంధించిన విచారణ జరిగింది. డిసెంబర్ 12కు ఈ కేసుపై విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. ఇదే సమయంలో ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పై సుప్రీంలో గురువారం... జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఏపీ సీఐడీకి కీలక ఆదేశాలు ఇచ్చింది.
ఇందులో భాగంగా... ఫైబర్ నెట్ కేసులో డిసెంబర్ 12 వరకు చంద్రబాబుపై ఎలాంటి చర్యలూ తీసుకోకూడదని సర్వోన్నత న్యాయస్థానం ఏపీ సీఐడీని ఆదేశించింది. ఇదే సమయంలో... గతంలో జారీచేసిన ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. అదేవిధంగా... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పై తీర్పు రాస్తున్నట్లు న్యాయమూర్తి అనిరుద్ద బోస్ వెల్లడించారు.
దీంతో డిసెంబర్ 12లోపు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో తీర్పు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఈ తీర్పు మిగిలిన కేసులకు కీలకంగా మారనుంది. ఈ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుకు సంబంధించి దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ లో 17ఏ కేంద్రంగా సుదీర్ఘ వాదనలు జరిగిన సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో చంద్రబాబుపై నమోదైన మరో కేసు ఏపీ మద్యం కుంభకోణం! ఈ క్రమంలో తాజాగా ఆ మద్యం కేసులో కూడా హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సమయంలో... కాస్త సమయం కావాలని సీఐడీ కోర్టును కోరింది.
కాగా... ఇప్పటికే చంద్రబాబుకు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు గురించి ఎక్కడా మాట్లాడటానికి అవకాశం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... రాజకీయ సభల్లో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. ఈ సమయంలో హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దుచేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ ను స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ తీర్పు తర్వాత విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది!
కేసుల వ్యవహారం అలా ఉంటే... మరోపక్క చంద్రబాబు వరుస పర్యటనలు చేస్తున్నారు! ఇందులో భాగంగా... తిరుమలకు బయల్దేరారు. ఈ రాత్రి తిరుమలలో బస చేసి, రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం అమరావతి చేరుకుంటారు. ఈ క్రమంలో డిసెంబర్ 2న విజయవాడ కనకదుర్గ అమ్మవారిని, డిసెంబర్ 3న సింహాచలం వెళ్లి అప్పన్న స్వామిని దర్శనం చేసుకుంటారు.
ఇక డిసెంబర్ 5న శ్రీశైలం మల్లన్నను చంద్రబాబు దర్శించుకోనున్నారు! ఆ తరువాత వరుసగా రాజకీయ సభలకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ సమయంలోనే సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ తీర్పు వచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి తీర్పు రాబోతుందనేది ఆసక్తిగా మారింది.