పవన్‌ తో వైసీపీ ఎంపీ కీలక భేటీ!

ఇటీవల వైసీపీకి ఆ పార్టీ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి రాజీనామా ప్రకటించిన సంగతి తెలిసిందే

Update: 2024-01-19 07:12 GMT

ఇటీవల వైసీపీకి ఆ పార్టీ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి రాజీనామా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను జనసేన పార్టీలో చేరబోతున్నట్టు బాలశౌరి ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌ లోని పవన్‌ నివాసంలో బాలశౌరి కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా ఉన్న బాలశౌరిని వచ్చే ఎన్నికల్లో అదే స్థానంలో జనసేన అభ్యర్థిగా దింపే ఆలోచనలో పవన్‌ కళ్యాణ్‌ ఉన్నారని టాక్‌ నడుస్తోంది. మచిలీపట్నం కాకుంటే కృష్ణా జిల్లాలోని పెడన, అవనిగడ్డ, కైకలూరు అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి బరిలోకి దింపొచ్చని చెబుతున్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో కాపు సామాజికవర్గం జనాభా అత్యధికం. బాలశౌరి కూడా కాపు సామాజికవర్గానికి చెందినవారే కావడం గమనార్హం.

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపైనే పవన్, బాలశౌరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. గుంటూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తానని బాలశౌరి.. పవన్‌ కు చెప్పినట్టు సమాచారం. అయితే గుంటూరు ఎంపీ స్థానంలో టీడీపీ బలంగా ఉందని, అంతేకాకుండా గత రెండు పర్యాయాలు టీడీపీనే అక్కడ గెలిచిందని పవన్‌ చెప్పినట్టు తెలుస్తోంది.

మధ్యేమార్గంగా మచిలీపట్నం ఎంపీ స్థానం, పెడన, కైకలూరు, అవనిగడ్డ అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడ నుంచైనా పోటీ చేయడానికి తనకు అభ్యంతరం లేదని పవన్‌ కళ్యాణ్‌ చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బాలశౌరి కూడా తాను ఆలోచించుకుని ఏ విషయం చెబుతానని పవన్‌ కు తెలిపినట్టు తెలుస్తోంది. బాలశౌరి అవనిగడ్డ లేదా పెడన నుంచి దాదాపు పోటీ చేయడం ఖాయమంటున్నారు.

అలాగే పార్టీలో చేరికపైన కూడా బాలశౌరి చర్చించారని చెబుతున్నారు. మచిలీపట్నంలో భారీ బహిరంగ సభను నిర్వహించి అక్కడ జనసేన పార్టీలో చేరతానని పవన్‌ కు తెలిపినట్టు సమాచారం. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఇప్పటికే అన్ని నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున జనసేకరణకు ఇప్పటికే బాలశౌరి అనుచరులు ఏర్పాట్లు చేస్తున్నారని అంటున్నారు. ఈ సభలోనే పవన్‌ సమక్షంలో బాలశౌరి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారని టాక్‌ నడుస్తోంది.

కాగా బాలశౌరి తొలిసారి 2004లో తెనాలి నుంచి కాంగ్రెస్‌ ఎంపీగా గెలుపొందారు. 2009లో నరసరావుపేట ఎంపీగా బరిలోకి దిగి 1607 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో గుంటూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు. 2019లో మచిలీపట్నం నుంచి ఎంపీగా విజయం సాధించారు.

Tags:    

Similar News