హోంమంత్రి అనిత అడిగినట్లు.. బాబాయ్ హత్యపై ప్రధానికి లేఖ రాయరా జగన్?

ఇదంతా పక్కన పెడదాం. నిజంగానే జగన్ చెప్పినట్లుగా తెలుగుదేశం మూకలు కలిసి తమ పార్టీకి చెందిన వ్యక్తిని హత్య చేశాడనే అనుకుందాం.

Update: 2024-07-19 08:49 GMT

ఏపీలో అధికార బదిలీ జరిగి నెల దాటేసింది. ఇటీవల కాలంలో తమ పార్టీకి చెందిన నేతలపై దాడులు జరుగుతున్నాయంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన ఉదంతాల సంగతి ఎలా ఉన్నా వినుకొండలో జరిగిన పాతకక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పులమటం.. తాను ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో వినుకొండలో పెరిగిన గ్యాంగ్ వార్ మీద కనీస చర్యలు తీసుకోని వైసీపీ అధినేత ఈ రోజున అందుకు భిన్నమైన వాదనను వినిపించటం గమనార్హం.

ఇదంతా పక్కన పెడదాం. నిజంగానే జగన్ చెప్పినట్లుగా తెలుగుదేశం మూకలు కలిసి తమ పార్టీకి చెందిన వ్యక్తిని హత్య చేశాడనే అనుకుందాం. హత్యకు గురైన రషీద్ నేర చరిత్ర ఏంటి? హత్య చేసిన జిలానీకి అతగాడికి ఉన్న వైరం ఏమిటి? ఇలాంటి విషయాల మీద కూడా జగన్ మాట్లాడాలి కదా? తమ కార్యకర్త హత్యకు గురయ్యారన్నంతనే బెంగళూరు నుంచి హుటాహుటిన విజయవాడకు వచ్చిన జగన్.. తర్వాతి రోజే వినుకొండకు వెళ్లి పరామర్శల ప్రోగ్రాం పెట్టుకోవటాన్ని తప్పు పట్టలేం. వ్యక్తి ఎలాంటి వాడైనా..తమ పార్టీకి పని చేసే వాడైనప్పుడు.. అతడ్ని హత్య చేసినప్పుడు.. వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ సిద్ధం కావటాన్ని తప్పు పట్టలేం.

కార్యకర్త హత్య విషయంలోనే ఇంత వేగంగా స్పందించిన జగన్.. తన సొంత బాబాయ్ ను అత్యంత దారుణంగా హత్య చేసినప్పుడు.. అంతే వేగంగా ఎందుకు స్పందించలేదు? తన ఇంటి మనిషి.. తన తండ్రికి స్వయాన సోదరుడైన బాబాయ్ ను అత్యంత కిరాతకంగా.. ఇంట్లోనే చంపేసిన ఉదంతంపై ఇదే జగన్ ఎంత వేగంగా రియాక్టు కావాలి? అందునా.. రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రిగా తనకున్న విశేష అధికారాలతో నిందితుల్ని.. వారి కుట్రల్ని బట్టబయలు చేసి.. వారికి కఠిన శిక్షపడేలా చేయాలి కదా? కానీ.. అలాంటిదేమీ ఎందుకు జరగలేదు?

కార్యకర్తతో పోలిస్తే.. సొంత బాబాయ్ అంత తక్కువా? ఆయన మరణంపై జగన్ తీసుకున్న చర్యలేంటి? ఈ రోజున ఏపీలో హింస జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. తప్పు లేదు. ఆ హక్కు ఒక రాజకీయ పార్టీ అధినేతగా జగన్ కు ఉంటుంది. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ.. ఇక్కడే మరో విషయాన్ని ప్రస్తావించాలి. తన సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిని అత్యంత దారుణంగా.. కిరాతకంగా.. నానా హింసలు పెట్టి చంపేసిన ఉదంతంపై విచారణను వేగంగా జరిపించాలని కోరుతూ ప్రధానమంత్రి మోడీకి తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల లో కానీ.. అధికారం చేజారిన తర్వాత కానీ ఎందుకు రాయట్లేదు?

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర బాధ్యతలు నెత్తి మీద ఉన్న వేళలో.. సొంతింటి వ్యవహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదని.. ప్రజల సమస్యల మీదనే ఎక్కువ ఫోకస్ చేయాలన్నది జగన్ ఆలోచనే అనుకుందాం. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తీరుబడిగా ఉన్న ఈ సమయంలో అయినా తన బాబాయ్ హత్య కేసు సంగతి త్వరగా తేల్చాలని ఎందుకు కోరటం లేదు? బాబాయ్ కంటే వినుకొండ రోడ్డు మీద పాత కక్షలతో హత్యకు గురైన పార్టీ కార్యకర్తే ఎక్కువా జగన్ కు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. వివేకా హత్య అంశాన్ని ప్రధాని మోడీకి ఎప్పుడైనా లేఖ రాశారా? అంటూ ఏపీ హోం మంత్రి అనిత అడిగిన ప్రశ్నలోనూ అర్థముంది. వివేకా హత్య విషయంలో స్పందించేందుకు నానా తాత్సారం చేసే జగన్.. మిగిలిన విషయాల్లో మాత్రం జెట్ స్పీడ్ తో ఎందుకు రియాక్టు అవుతున్నట్లు? ఈ ప్రశ్నలకు జగన్ కాస్తంత క్లారిటీ ఇస్తే బాగుండు.

Tags:    

Similar News