చంద్రబాబుకు కేటాయించిన కారే జగన్ కు ఇచ్చారంట!

ఇదే సమయంలో జగన్ భద్రత విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్నారు.

Update: 2024-07-22 10:05 GMT

ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచీ, కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని.. వైసీపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని.. ఫలితంగా తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో జగన్ భద్రత విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్నారు. వినుకొండలో హత్యగావింపబడిన రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ రోడ్డు మార్గంలో వెళ్తున్న సమయంలో సరిగ్గ పని చేయని పాత సఫారీ వాహనాన్ని ప్రభుత్వం కేటాయించిందని వైసీపీ నుంచి ఆరోపణలు వచ్చాయి.

ఆ సమయంలో ఆ వాహనం కండిషన్ ను తెలుపుతూ వైసీపీ సోషల్ మీడియాలో పలు ఫోటోలు హల్ చల్ చేశాయి. ఈ సమయంలో... ప్రభుత్వం కేటాయించిన సఫారీ వాహనాన్ని దిగి.. జగన్ మరో ప్రైవేటు వాహనంలో వినుకొండకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత స్పందించారు. ఆ వాహనంపై క్లారిటీ ఇచ్చారు.

అవును... జగన్ వినుకొండ వెళ్తున్నప్పుడు ప్రభుత్వం కేటాయించిన సఫారీ వాహనంపై వైసీపీ నుంచి విమర్శలు వస్తున్న వేళ హోంమంత్రి అనిత క్లారిటీ ఇచ్చారు. ఇందులో భాగంగా... 2019 - 24 మధ్య ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబుకు కేటాయించిన వాహనాన్నే 2024 ఎన్నికల ఫలితాల అనంతరం జగన్ కు కేటాయించినట్లు స్పష్టం చేశారు.

ఇదే సమయంలో వైఎస్ జగన్ ప్రతిపక్షనేత కానప్పటికీ.. సాధారణంగా ప్రతిపక్ష నేతకు ఇచ్చే వాహనాలను ఇచ్చినట్లు అనిత తెలిపారు. తమ ఆలోచన సరైనదేనని.. కానీ వైసీపీ దురుద్దేశ్యంతోనే ప్రభుత్వం కేటాయించిన కాన్వాయ్ పై విమర్శలు చేస్తుందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.

Tags:    

Similar News