అనూహ్యం.. అక్కడి నుంచి వంగవీటి రాధా పోటీ!
జనసేన పార్టీ తరఫున వంగవీటి రాధాను మచిలీపట్నం ఎంపీగా బరిలో దించుతున్నారని పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరి తమపై తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతుండటంతో జనసేనాని పవన్ కళ్యాణ్ అందుకు విరుగుడు వ్యూహం సిద్ధం చేశారని తెలుస్తోంది. కాపుల ఆరాధ్య దైవం, దివంగత నేత వంగవీటి మోహన రంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాను పవన్ తెరమీదకు తెచ్చారు.
జనసేన పార్టీ తరఫున వంగవీటి రాధాను మచిలీపట్నం ఎంపీగా బరిలో దించుతున్నారని పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. ఇప్పటిదాకా మచిలీపట్నం ఎంపీగా వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తారని టాక్ నడిచింది. ప్రస్తుతం మచిలీపట్నం వైసీపీ ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి ఇటీవల జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తిరిగి ఎంపీగా బాలశౌరి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.
అయితే అనూహ్యంగా వంగవీటి రాధా పేరు మచిలీపట్నం ఎంపీగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేసిన వంగవీటి రాధా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి అతి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు, 2014లో తిరిగి విజయవాడ తూర్పు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ సీటు ఆశించిన రాధాకు వైఎస్ జగన్ మొండిచేయి చూపారు. విజయవాడ తూర్పు, అవనిగడ్డ అసెంబ్లీ లేదా మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని సూచించారు.
అయితే రాధా తనకు విజయవాడ సెంట్రల్ సీటే కావాలని కోరారు. వైఎస్ జగన్ ఆ సీటును రాధాకు ఇవ్వకపోవడంతో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అయితే గత ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ తరఫున పలు నియోజకవర్గాల్లో రాధా ప్రచారం చేశారు.
కాగా ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన జాబితాల్లో వంగవీటి రాధాకు ఎక్కడా సీటు ఇవ్వలేదు. విజయవాడ సెంట్రల్ సీటును మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాకే కేటాయించారు. ఈ పరిణామాలతో వంగవీటి రాధా తెనాలి వెళ్లి జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్, గుంటూరు వెళ్లి వల్లభనేని బాలశౌరిలను కలిసి వచ్చారు. దీంతో రాధా జనసేన ఎంట్రీ ఇవ్వడం ఖాయమని ప్రచారం జరిగింది.
జనసేన పొత్తుల్లో భాగంగా కృష్ణా జిల్లాలో మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి, అవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో రాధా మచిలీపట్నం ఎంపీగా ఆ పార్టీ తరఫున పోటీ చేయొచ్చని టాక్ నడుస్తోంది. ఇదే జరిగితే బాలశౌరి అవనిగడ్డ ఎమ్మెల్యేగా జనసేన తరఫున పోటీ చేయొచ్చని అంటున్నారు. ఇలా కాకుండా బాలశౌరే ఎంపీగా పోటీ చేస్తే రాధా అవనిగడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చని చెబుతున్నారు.
వంగవీటి రాధా జనసేనలో చేరితే కాపు ఓట్లన్నీ పోలరైజ్ అవుతాయని భావిస్తున్నారు. తద్వారా ముద్రగడ పద్మనాభంను చేర్చుకుని కాపుల ఓట్లను చీల్చాలనుకున్న వైఎస్ జగన్ వ్యూహాలకు రాధా చేరికతో అడ్డుకట్ట వేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని అంటున్నారు.