పవన్ తో విభేదాలపై వర్మ సంచలన కామెంట్స్

పిఠాపురం జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం. కూటమి తరవున ఆ సీటు జనసేన ఎంచుకుంది.

Update: 2024-10-18 11:20 GMT

పిఠాపురం జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం. కూటమి తరవున ఆ సీటు జనసేన ఎంచుకుంది. పవన్ అక్కడ నుంచి పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచారు. అయితే అక్కడ 2014 నుంచి 2019 దాకా ఎమ్మెల్యేగా పనిచేసిన ఎస్వీఎస్ఎన్ వర్మ ఉన్నారు. ఆయన 2019లో ఓటమి పాలు అయినా 2024లో గెలిచి తీరాలని పట్టుదలతో అయిదేళ్ళ పాటు పనిచేస్తూ వచ్చారు.

తీరా అన్నీ వడ్డించుకుని తినబోయే ముందు విస్తరాకు ఎవరో తీసుకున్నట్లుగా ఆ సీటు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. దాంతో వర్మ అనుచరులు మొదట్లోనే మండిపడ్డారు. ఏపీ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించేలా వారు నిరసనలు తెలిపారు. అయితే ఆ తరువాత టీడీపీ హై కమాండ్ సర్దిచెప్పడంతో ఆయన శాంతించారు. ఆ మీదట పవన్ కళ్యాణ్ వర్మ ఇంటికి నేరుగా వచ్చి మరీ ఆయన మద్దతు తీసుకోవడంతో కధ సుఖాంతం అయింది.

ఎన్నికల్లో వర్మ అండ్ కో పవన్ గెలుపునకు ఎంతో కష్టపడ్డారు. కూటమి వేవ్ కూడా దానికి తోడు కావడంతో పవన్ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచారు. ఇక గెలిచిన తరువాత పవన్ ఎటూ స్టేట్ లీడర్ పైగా ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయన తరఫున పిఠాపురం వ్యవహారాలను చూసుకోవచ్చు అని వర్మ అండ్ కో అనుకున్నారేమో తెలియదు.

అయితే వర్మకు ఆ ఛాన్స్ లేకుండా జనసేన నేతలే ముందుకు వచ్చారు. వారే అన్ని విషయాలూ చక్కబెడుతున్నారు. పిఠాపురంలో జనసేన విస్తరణకు ఇదే తగిన సమయం అని భావించి వారు దూకుడు చేస్తున్నారు. మరో వైపు వర్మ మాజీ ఎమ్మెల్యేగా తనకు ఉన్న పరిచయాలతో నియోజకవర్గంలో తన హవా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ క్రమంలో జనసేన వర్సెస్ వర్మ అన్నట్లుగా విభేదాలు బయటకు వచ్చాయని అంటున్నారు. అది కాస్తా ఇటీవల జరిగిన పిఠాపురం అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో బయటపడింది. వర్మ తరఫున వారు జనసేన నుంచి కొందరు పోటీ పడితే దాదాపుగా అన్ని డైరెక్టర్ పోస్టులను జనసేన కైవశం చేసుకుంది.

ఇవన్నీ పక్కన పెడితే పిఠాపురంలో టీడీపీకి తగ్గిన ప్రాధాన్యత గురించి వర్మ టీడీపీ అధినాయకత్వానికి ఇటీవల ఫిర్యాదు చేశారు అని కూడా ప్రచారం జరిగింది. వీటన్నింటి నేపథ్యంలో వర్మ తాజాగా స్పందించారు. పవన్ తో కానీ జనసేనతో లోకల్ లీడర్స్ తో కానీ ఏ రకమైన విభేదాలూ లేవని ఆయన స్పష్టం చేశారు. గ్రామాల్లో చిన్నపాటి గొడవలు అక్కడక్కడ క్యాడర్ మధ్య ఉండొచ్చేమో కానీ పై లెవెల్ లో అంతా బాగానే ఉంది అని ఆయన పక్కా క్లారిటీ ఇచ్చేశారు.

టీడీపీ కూటమి హయాంలో పిఠాపూంలోనే కాకుండా ఏపీవ్యాప్తంగా సంక్షేమ పధకాలు అన్నీ అమలు జరుగుతున్నాయని కూడా వర్మ చెప్పుకొచ్చారు. మొత్తానికి అంతా బాగానే ఉంది అన్న ఫీలింగ్ ని అయితే వర్మ ఇచ్చారని అంటున్నారు. అయితే వర్మ ఎంత చెబుతున్నా టీడీపీ జనసేన క్యాడర్ మధ్య మాత్రం విభేదాలు అలాగే ఉన్నాయని గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ చెబుతున్నాయి.

జనసేన వారికి తప్ప తమకు ప్రాధాన్యత దక్కడం లేదని పసుపు పార్టీ తమ్ముళ్ళు అంటున్నారు. అయితే ఒక పార్టీ నుంచి ఎంతో మంది ఆశావహులు ఉంటారు. ముందు వారికి ప్రయారిటీ ఇవ్వాల్సిందే అన్నది జనసేన వైపు నుంచి వస్తున్న మాట. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాలుగైదు నెలల తరువాత వర్మ ఇలా ఓపెన్ అయి పిఠాపురం ప్రశాంతం అని చెప్పారు. మరి ఆయన ఇచ్చిన క్లారిటీతో అయినా ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడుతుందా లేక ఇంకా అలాగే కొనసాగుతుందా అంటే దానికి జవాబు ఎవరూ చెప్పలేరు, ఎందుకంటే ఇది పాలిటిక్స్. ఎపుడేమి జరుగుతుందో ఎవరికీ తెలియదు అనే అంటున్నారు.

Tags:    

Similar News