సాయిరెడ్డి ముందర కాళ్ళకు జగన్ బంధం ?

క్యారెక్టర్ విలువలు అంటూ ఆయన విజయసాయిరెడ్డిని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేశారు. అంతే కాదు ప్రలోభాలకు లొంగి వెళ్ళిపోతున్నారు అన్నారు.

Update: 2025-02-07 11:30 GMT

వైసీపీలో ఎంపీగా జాతీయ స్థాయిలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నాయకుడు వి విజయసాయిరెడ్డి. ఆయన జగన్ కి తలలో నాలుకగా ఉండేవారు. పార్టీలో జగన్ తర్వాత ప్లేస్ ఆయనదే అన్నట్లుగా ఉండేది. వైసీపీ అధికారంలోకి వచ్చేంతవరకూ ఈ బంధం కొనసాగింది.

అయితే ఢిల్లీ స్థాయిలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి ఉంటూ కేంద్ర పెద్దల వద్ద మంచి పలుకుబడి సంపాదించారు. ఆయన ప్రీ అపాయింట్మెంట్ లేకుండానే కేంద్ర పెద్దలను కలిసేటంత సాన్నిహిత్యాన్ని అందుకున్నారని ప్రచారంలో ఉంది. అంతే కాదు ఆయనను చూసి ఆగి మరీ పేరు పెట్టి ప్రధాని నరేంద్ర మోడీ ఒక సందర్భంలో పలకరించారు అంటే విజయసాయిరెడ్డి హవా ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసు అని అంటున్నారు.

ఇక విజయసాయిరెడ్డికి వైసీపీ అధినాయకత్వం మధ్య కొంత గ్యాప్ అయితే ఏర్పడింది అన్నది 2022 తరువాతనే పార్టీ వర్గాలకు తెలిసింది అని అంటారు. ఆయనను ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ పదవి నుంచి తప్పించడంతో మనస్తాపం చెందారని అంటారు అంతే కాదు ఆయనకు పార్టీలో ఉన్న ప్రాధాన్యత కూడా ఆ తరువాత మెల్లగా తగ్గించారు అని ప్రచారంలో ఉన్న మాట.

ఇవన్నీ ఇలా ఉంటే 2024 తరువాత వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డిని తప్పించి వైవీ సుబ్బారెడ్డికి బాధ్యతలు జగన్ కట్టబెట్టడంతో విజయసాయిరెడ్డి కేవలం రాజ్యసభ నాయకుడిగా మాత్రమే పరిమితం అయ్యారు.

ఇలా చాలా అంతర్గతంగా జరిగినవి ఉన్నాయని ప్రచారంలో ఉంది. మరో వైపు బీజేపీ పెద్దలతో విజయసాయిరెడ్డి సాన్నిహిత్యం మాత్రం అలాగే కొనసాగుతూ వచ్చింది అంటారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి మరో మూడున్నర ఏళ్ళ వ్యవధి ఉండగాన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం వైసీపీకి షాక్ గా మారింది. అంతే కాదు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ఆయన ప్రకటించారు.

అయితే పార్టీని వీడిపోతూ విజయసాయిరెడ్డి జగన్ ని ఏమీ అనలేదు, పైగా ఆయన మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకున్నారు. మరి జగన్ కూడా విజయసాయిరెడ్డి పట్ల సాఫ్ట్ కార్నర్ తో ఉంటారనే అంతా అనుకున్నారు. కానీ మీడియా సమావేశంలో మాత్రం జగన్ విజయసాయిరెడ్డి విషయం రాగానే కాస్తా హార్ష్ గానే మాట్లాడారు, క్యారెక్టర్ విలువలు అంటూ ఆయన విజయసాయిరెడ్డిని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేశారు. అంతే కాదు ప్రలోభాలకు లొంగి వెళ్ళిపోతున్నారు అన్నారు.

దానిని విజయసాయిరెడ్డి కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. తనకు క్యారెక్టర్ ఉందని ప్రలోభాలకు లొంగలేదు కాబట్టే తాను పదవులు వదులుకున్నాను, రాజకీయాలూ వదులుకున్నానని చెప్పారు. విజయసాయిరెడ్డి తన వరకూ చెప్పినది కరెక్ట్ గా ఉన్నా ఈ సమయంలో ఆయన రాజీనామా చేయడం అన్నది కూటమికే హెల్ప్ గా ఉందని చెబుతున్నారు.

ఆయన రాజీనామా చేసిన తరువాత ఆ పదవి కూటమికే పోతుంది. పైగా మూడున్నరేళ్ళ పాటు ఉన్న పదవి. అందుకే జగన్ ప్రలోభాలు అన్న మాట వాడారా అని చర్చ వస్తోంది. విజయసాయిరెడ్డి రాజకీయ వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నాను అని ప్రకటన చేసినా ఫ్యూచర్ లో మళ్ళీ రాజకీయాల్లోకి రారు అని ఎవరూ చెప్పలేరని అంటున్నారు

అంతే కాదు ఆయనకు బీజేపీ పెద్దలతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల కొన్నాళ్ళ తరువాత అయినా గవర్నర్ లాంటి పదవులు ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. రాజ్యసభలో బీజేపీకి ఎంపీలు అవసరం, విజయసాయిరెడ్డి రాజీనామాతో ఆ లోటు బీజేపీకి తీరుతోందని అంటున్నారు. అందుకేనా జగన్ ఆయన మీద ఈ తరహా కామెంట్స్ చేశారా అన్న చర్చ కూడా వస్తోంది.

ఇవన్నీ ఇలా ఉంటే విజయసాయిరెడ్డి జగన్ కామెంట్స్ మీద స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను ప్రలోభాలకు లొంగలేదని. మరి రేపటి రోజున ఆయన ఏ పదవీ స్వీకరించకుండా జీవితాంతం వ్యవసాయమే చేయదలచుకుంటే మాత్రం జగన్ చేసిన కామెంట్స్ తప్పుగానే చూడాలి. అలా కాకపోతే మాత్రం జగన్ విజయసాయిరెడ్డి మీద ఏదో ఒక అంచనాతో చేసినట్లుగా వాటిని భావించాలి. ఏది ఏమైనా విజయసాయిరెడ్డి భవిష్యత్తు ఆలోచనలు కనుక ఉంటే వాటి ముందర కాళ్ళకు జగన్ తన కామెంట్స్ ద్వారా బంధం వేశారా అన్న చర్చ సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News