ఇటు డబ్బు- అటు సెంటిమెంటు.. విజయవాడ ఫైట్ మామూలుగా లేదు!
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు కీలక విషయాలు ఓటర్లను ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తున్నాయి
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు కీలక విషయాలు ఓటర్లను ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తున్నాయి. దీనిలో ఒకటిడబ్బు, రెండోది సెంటిమెంటు. ఈ రెండు విషయాలపైనే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటరు తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. విజయవాడ వెస్ట్‌లో బీజేపీ నుంచి ప్రముఖ పారిశ్రామిక వేత్త, రాజకీయ దిగ్గజం సుజనా చౌదరి తొలిసారి పోటీ చేస్తున్నారు. ఈయన డబ్బులు బాగానే ఖర్చు చేస్తున్నారు.
ఒక వినూత్న పంథాలో కార్యకర్తలను నియమించుకుని ఆయన ప్రచారం చేస్తున్నారు. ఇక, నిన్న మొన్నటి వరకు అంటీ ముట్టనట్టుగా ఉన్న టీడీపీ నేతలను కూడా.. మచ్చిక చేసుకున్నారు. వారి సమస్యలు కూడా పరిష్కరించారు. దీంతో టీడీపీ నేతలు కలిసి వస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలోని కీలకమైన వ్యాపార వర్గం మొత్తాన్ని ఆకర్షించేలా.. రహదారుల విస్తరణ వంటి సంచలన హామీలు ఇస్తున్నారు. అదేవిధంగా కొండ ప్రాంతాల వారికి జలజీవన్‌మిషన్ ద్వారా నీటిని సరఫరా చేస్తామనిఅంటున్నారు.
దీంతో సుజనా చౌదరి గ్రాఫ్ అమాంతంగా పెరిగింది. ఆయనపై విశ్వాసంకూడా పెరిగిందని స్థానికంగా వినిపిస్తున్న టాక్. మరోవైపు.. వైసీపీ నుంచి మైనారిటీ ముస్లిం నాయకుడు.. ఆసిఫ్ బరిలో ఉన్నారు. ఈయన ఆర్థికంగా బలంగా ఉన్న నాయకుడు కాదు. ఓ కార్పొరేటర్ మాత్రమే. అయితే.. నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న నాయకుడు.. మైనారిటీల్లో బలమైన వాయిస్ వినిపిస్తున్న నాయకుడు కావడంతో ఆయన కూడా బలంగానే పోటీ ఇస్తున్నారు.
మొత్తంగా చూస్తే.. సుజనా అయినా.. ఆసిఫ్ అయినా.. ఎవరు గెలిచినా.. చాలా తక్కువ మెజారిటీతోనే ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. సుజనాకు నాన్ లోకల్ ముద్ర పడినా.. ఆయన దాని నుంచి బయట పడేందుకు శ్రమిస్తున్నారు. ఈ ఒక్కటే ఇక్కడ సుజనాకు మైనస్‌గా ఉంది. మైనరిటీ ఓటు బ్యాంకు కోల్పోయినా.. ఇదే సమయంలో వ్యాపార, బ్రాహ్మణ సామాజిక వర్గాల ఓట్లు ఈయనకు ప్లస్ అవుతున్నాయి.