ఈ లిక్కర్‌ కింగ్‌ ఈసారైనా దొరుకుతాడా?

విజయ్‌ మాల్యా కేసును విచారిస్తున్న సీబీఐ ముంబై కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్‌ లో సైతం ఇదే అంశాన్ని పేర్కొంది.

Update: 2024-04-26 11:30 GMT

మనదేశంలోని బ్యాంకుల్లో 9 వేల కోట్ల రూపాయలు రుణాలుగా తీసుకుని.. దేశం నుంచి బిచాణా ఎత్తేసిన లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా లండన్‌ లో తలదాచుకున్న సంగతి తెలిసిందే. అతడు ఇండియా నుంచి పరారై దాదాపు పదేళ్లు గడిచిపోయాయి. అయితే ఇంతవరకు అతడిని దేశానికి రప్పించలేకపోయారు.

విజయ్‌ మాల్యా భారత్‌ లో బ్యాంకులకు ఎగవేసిన రుణాలతో విదేశాల్లో భారీ ఎత్తున ఆస్తులను కొన్నట్టు సమాచారం. విజయ్‌ మాల్యా కేసును విచారిస్తున్న సీబీఐ ముంబై కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్‌ లో సైతం ఇదే అంశాన్ని పేర్కొంది. భారత్‌ లో తీసుకున్న బ్యాంకుల రుణాల్లో విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేశాకే అతడు దేశం వదిలిపారిపోయినట్టు చెబుతున్నారు.

మరోవైపు ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. నల్లధనానికి అడ్డుకట్ట వేస్తామని.. బ్యాంకులను ముంచిన వారిని శిక్షిస్తామని మోదీ ప్రభుత్వం ఊకదంపుడు కబుర్లు చెప్పిందని.. కానీ ఆచరణలో ఘోరంగా విఫలమైందని మండిపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి యూకేలో దాక్కున్న విజయ్‌ మాల్యాను దేశానికి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లండన్‌ నుంచి ఇతర ఐరోపా దేశాల్లో అతడి కదలికలను అడ్డుకోవడానికి, ఆ దేశాలకు వస్తే తమకు అప్పగించడానికి పావులు కదుపుతోంది.

ఇందులో బాగంగా ఏప్రిల్‌ రెండో వారంలో భారత్‌ – ఫ్రాన్స్‌ మధ్య మనీలాండరింగ్, ఉగ్రవాదులకు నిధులు అందకుండా కట్టడి చేయడంపై జరిగిన చర్చల్లో విజయ్‌ మాల్యా అంశం కూడా చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. ఈ జాయింట్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశంలో కొన్ని ముందస్తు షరతులతో విజయ్‌ మాల్యాను అప్పగిస్తామని ఫ్రాన్స్‌ వెల్లడించినట్టు సమాచారం. అయితే ఎలాంటి షరతులు లేకుండా తమకు అప్పగించాలని భారత్‌ కోరిందని మీడియా కథనాలు పేర్కొన్నాయి.

భారత్‌ – ఫ్రాన్స్‌ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో నేరస్తుల అప్పగింత ఒప్పందం కూడా ఇరు దేశాల మధ్య జరిగింది. మరోవైపు విజయ్‌ మాల్యా పలు ఐరోపా దేశాల్లో ఆస్తులను కొనుగోలు చేయడంతోపాటు అక్కడ పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. ఫ్రాన్స్‌ లోనూ అతడికి ఆస్తులున్నట్టు తెలుస్తోంది.

విజయ్‌ మాల్యా ఫ్రాన్స్‌లో 35 మిలియన్‌ యూరోలు వెచ్చించి స్థిరాస్తి కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ విషయాన్ని సీబీఐ కూడా ధ్రువీకరించింది. అయితే ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వినతి మేరకు ఫ్రాన్స్‌ ప్రభుత్వం రూ.14 కోట్ల విలువైన మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌ తో నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉండటంతో విజయ్‌ మాల్యాను తమకు అప్పగించాలని భారత్‌ కోరుతోంది.

ప్రస్తుతం మాల్యా యూకే రాజధాని లండన్‌ లోనే తలదాచుకున్నాడు. యూరప్‌ దేశాల్లో ఆస్తులను కొనుగోలు చేయడంతో అతడు స్వేచ్ఛగా ఆ దేశాల్లో పర్యటిస్తున్నట్టు భారత ప్రభుత్వానికి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అతడు ఆ దేశాలకు వెళ్తే తమకు అప్పగించాలని భారత్‌ ఒత్తిడి చేస్తోంది.

Tags:    

Similar News