బెంగళూరు యూట్యూబర్ ఓవరాక్షన్..పోలీసులు అరెస్టు

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి తాను టికెట్ కొనకుండా వెళ్లానని.. భద్రతా సిబ్బంది కళ్లు గప్పి ఎయిర్ పోర్టులోపలకు వెళ్లటమే కాదు.. తాను టికెట్ లేకుండానే రన్ వే మీదకు కూడా వచ్చినట్లు పేర్కొన్నారు.

Update: 2024-04-18 05:24 GMT

అతికి సైతం ఒక అడ్డు అదుపు ఉండాలి. అదేమీ లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించే కొందరు కష్టాల్ని కొని తెచ్చుకుంటారు. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించారు బెంగళూరుకు చెందిన యూట్యూబర్. ఇతగాడి ఓవరాక్షన్ ఎంతంటే.. ఇతని తీరును తప్పు పట్టటమే కాదు.. చివరకు పోలీసులు సైతం అరెస్టు చేశారు. యూట్యూబ్ లో ఇతగాడు పోస్టు చేసిన వీడియో వైరల్ అయినంతనే స్పందించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇంతకూ అతగాడు చేసిన అతి ఏమిటంటే..

బెంగళూరుకు చెందిన వికాస్ గౌడ్ ఒక యూట్యూబర్. వీక్షకుల్ని పెద్ద ఎత్తున ఆకట్టుకోవాలన్న ఉద్దేశంతో తాజాగా అతగాడో వీడియోను చేశాడు. దాన్ని తాజాగా అప్ లోడ్ చేశాడు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి తాను టికెట్ కొనకుండా వెళ్లానని.. భద్రతా సిబ్బంది కళ్లు గప్పి ఎయిర్ పోర్టులోపలకు వెళ్లటమే కాదు.. తాను టికెట్ లేకుండానే రన్ వే మీదకు కూడా వచ్చినట్లు పేర్కొన్నారు. అంతేకాదు.. 24 గంటల పాటు అక్కడే గడిపినట్లుగా పేర్కొన్నారు.

తాను ఇంత చేసినా.. ఎవరూ తనను గుర్తించలేదని పేర్కొన్నారు. ఈ వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేసినంతనే వైరల్ గా మారింది. ఈ వీడియోపై సీఐఎస్ఎఫ్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే వారు స్పందించి.. అతడ్ని అరెస్టు చేశారు.

ఫ్లైట్ టికెట్ తోనే తాను విమానాశ్రయంలోకి అడుగు పెట్టానని.. రన్ వే వరకు వచ్చి వీడియో తీసుకొని వెనక్కి వచ్చేసినట్లుగా పోలీసులకు తెలిపాడు. అయితే.. అలా వెళ్లి వెనక్కి రావటం అసాధ్యం కావటంతో.. అతడి నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు పోలీసులు విచారిస్తున్నారు. నాలుగు లైకుల కోసం సమస్యల్లోకి దిగే ఈ మూర్ఖత్వాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

Tags:    

Similar News