కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్న రెండో ఎమ్మెల్యే ఈయనేనా?

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం సాధించడమే లక్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అభ్యర్థుల స్థానాల్లో మార్పులుచేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2024-01-03 10:02 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం సాధించడమే లక్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అభ్యర్థుల స్థానాల్లో మార్పులుచేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి విడతలో 11 స్థానాల్లో మార్పులు చేసిన ఆయన తాజాగా 27 చోట్ల మార్పులు చేశారు. ప్రజాబలం లేదని తేలిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఆయన సీట్లు నిరాకరించారు. సీట్లు లభించనివారికి పార్టీ అధికారంలోకి వచ్చాక వేరే రూపాల్లో న్యాయం చేస్తామని చెబుతున్నారు. మరికొందరు ఇందుకు ఒప్పుకోక వేరే పార్టీల్లో చేరికకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఈ కోవలో తాజాగా విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు జగన్‌ సీటు నిరాకరించారు. విజయవాడ సెంట్రల్‌ సీటును వెలంపల్లి శ్రీనివాసరావుకు కేటాయించారు. ఇప్పటివరకు వెలంపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ పశ్చిమ సీటును ఏపీ మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌ షేక్‌ ఆసిఫ్‌ కు ఇచ్చారు. దీంతో మల్లాది విష్ణుకు సీటు లేకుండా పోయింది.

దీంతో మల్లాది విష్ణు కాంగ్రెస్‌ పార్టీలో చేరొచ్చని అంటున్నారు. టీడీపీ, జనసేన పార్టీల్లో చేరినా ఆయనకు సీటు లభించే అవకాశాలు లేవు. ఎందుకంటే విజయవాడ సెంట్రల్‌ లో టీడీపీ తరఫున బొండా ఉమా ఉన్నారు. గత ఎన్నికల్లో ఉమా కేవలం 25 ఓట్ల తేడాతోనే మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయారు. 2014లో బొండా ఉమా టీడీపీ తరఫున గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో మరోమారు టీడీపీ–జనసేన తరఫున ఆయనే బరిలోకి దిగొచ్చు.

ఈ నేపథ్యంలో మల్లాది విష్ణు కాంగ్రెస్‌ పార్టీలో చేరొచ్చని అంటున్నారు. ఇప్పటికే మల్లాది లాగా సీటు దక్కని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాను కాంగ్రెస్‌ లో చేరతానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆర్కేకు కూడా జగన్‌ సీటు నిరాకరించారు. ఆ సీటును గంజి చిరంజీవికి కేటాయించారు. దీంతో ఆర్కే వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిలకు ఏపీ పీసీసీ పగ్గాలు అప్పగించవచ్చని ప్రచారం జరుగుతోంది. నేడో, రేపో ఆమె కాంగ్రెస్‌ లో చేరడం ఖాయం. ఇప్పటికే ఈ విషయాన్ని స్వయంగా షర్మిల తెలిపారు. దీంతో ఆమెతోపాటు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కూడా కాంగ్రెస్‌ లో చేరుతున్నారు.

ఇదే కోవలో తాజాగా వైసీపీ సీటు దక్కని మల్లాది విష్ణు కూడా కాంగ్రెస్‌ లో చేరొచ్చని చెబుతున్నారు. 2009లో మల్లాది విష్ణు కాంగ్రెస్‌ పార్టీ తరఫున విజయవాడ సెంట్రల్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగి నాలుగో స్థానంలో నిలిచారు. ఇక 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన మల్లాది విష్ణుకు జగన్‌ విజయవాడ సెంట్రల్‌ సీటును కేటాయించారు. ఆ ఎన్నికల్లో 25 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

వచ్చే ఎన్నికల్లో తన సీటును నిలుపుకోవడం కోసం లాబీయింగ్‌ చేసేందుకు తీవ్ర ప్రయత్నం చేసిన విష్ణుకు జగన్‌ సీటు నిరాకరించారు. జగన్‌ విడుదల చేసిన అభ్యర్థుల రెండో జాబితాలో విష్ణు పేరు లేదు. ఆయన స్థానంలో విజయవాడ (సెంట్రల్‌) నుంచి విజయవాడ (పశ్చిమ) ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌కు పార్టీ టిక్కెట్టు ఇచ్చింది.

పార్టీ నిర్ణయంతో కలత చెందిన విష్ణు అనుచరులు పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళనకు దిగి పార్టీ నాయకత్వంపై మండిపడ్డారు. వెంటనే విష్ణు తన అనుచరులతో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు.

తన మాతృపార్టీ అయిన కాంగ్రెస్‌ లోకే విష్ణు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. తద్వారా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బాటలోనే ఆయన కూడా పయనించొచ్చని పేర్కొంటున్నారు.

Tags:    

Similar News