టీడీపీ పొత్తు కోసం రాజు గారి ఉబలాటం..!

పొత్తు ఉంటే ఆయనకు సీటు దక్కుతుంది. అపుడు గెలుపు గ్యారంటీ అవుతుంది. అందుకే ఆయన చాలా కాలం నుంచి పొత్తు పాట పాడుతున్నారు.

Update: 2024-01-20 09:30 GMT

పొత్తు ఉంటే ఆయనకు సీటు దక్కుతుంది. అపుడు గెలుపు గ్యారంటీ అవుతుంది. అందుకే ఆయన చాలా కాలం నుంచి పొత్తు పాట పాడుతున్నారు. ఆయనే విశాఖ ఉత్తర నియోజకవర్గం బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు. ఆయన తడవకు ఒకసారి మీడియా ముందుకు వచ్చి బీజేపీ టీడీపీ జనసేన పొత్తు ఉండాలి. కూటమి కట్టాలని తన మనసులోని మాటను ఢిల్లీ పెద్దలకు వినిపించాలన్న తాపత్రయంతో చెప్పి పోతూ ఉంటారు.

పొత్తు ఉంటే విశాఖ ఉత్తరం సీటు దక్కించుకుని మరోసారి ఎమ్మెల్యే కావాలన్నదే రాజు గారి ఆలోచన. 2014లో అదే జరిగింది. ఆనాడు పొత్తు ఉండబట్టే ఆయన గెలిచారు. 2019 నాటికి ఆ మ్యాజిక్ కుదరలేదు. దాంతో ఒంటరిగా పోటీ చేసిన రాజు గారికి 18 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అది కూడా చాలా మంది బీజేపీ అభ్యర్ధులకు వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ.

వ్యక్తిగతంగా ఆయనకు మంచి పేరు ఉంది. దాంతో పాటు అయిదేళ్ళ పాటు ఎమ్మెల్యేగా ఎంతో కొంత అభివృద్ధి పనులు చేసి చూపించారు. అయితే విశాఖ ఉత్తరంలో బీజేపీకి సొంతంగా పెద్దగా బలం లేదు. దాంతో పొత్తు పాటను రాజు గారు పాడుతున్నారు. ఆయన ఇదే డిమాండ్ తో ఉన్నారు కూడా.

ఒకవేళ పొత్తు కుదిరితే రాజు మరోసారి ఎమ్మెల్యే కావడం ఖాయమని ఆయన అనుచరులు అంటున్నారు. అదే కనుక కాకుంటే మాత్రం ఆయన వేరే ఆలోచనలు చేస్తారు అని కూడా అంటున్నారు. టీడీపీ లేదా జనసేనలోకి ఆయన జంప్ చేస్తారు అని కూడా అంటున్నారు.

అయితే జనసేనలో చేరినా టీడీపీలో చేరినా టికెట్ కి అయితే హామీ ఉండదు, అక్కడ చాలా మంది నేతలు ఉన్నారు. పొత్తు ఉంటేనే బీజేపీ ఆ సీటు తీసుకోగలుతుంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఆయన మరోమారు రాజకీయ జోస్యం చెప్పారు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఉంటే ఏపీలో వైసీపీకి 17 సీట్లకు మించి రావు అని అంటున్నారు.

ఈసారి వైసీపీ ఎన్ని రకాలుగా వ్యూహాలు పన్నినా ఎంతలా ఎత్తులు వేసినా గెలిచేది లేదని అన్నారు. వై నాట్ 175 లో ఆ చివరి 5 ని తీసేసి రాజు గారు 17 మాత్రమే నంబర్ ఇచ్చారు. మొత్తానికి బీజేపీ రాజు కోరిక తీరుతుందా. బీజేపీ టీడీపీ పొత్తు కలుపుతాయా అంటే ఢిల్లీ పెద్దల వైపే అంతా మరోసారి చూడాల్సి ఉంది.

Tags:    

Similar News