విష్ణువర్ధన్ రెడ్డి హాట్ కామెంట్స్... కాంగ్రెస్ లో జూబ్లీహిల్స్ టెన్షన్?
ఇందులో భాగంగా... కష్టకాలంలో పార్టీని వీడకుండా ఉంటే కాంగ్రెస్ తనకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార బీఆరెస్స్ ఇప్పటికే టిక్కెట్లు ప్రకటించగా.. కాంగ్రెస్ 55 స్థానాల్లో తొలిజాబితా, బీజేపీ 52 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేసింది. ఈ సమయంలో టికెట్ ఆశించి భంగపడిన నేతలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీరిలో కొంతమంది పార్టీలో ఉంది ఎర్రజెండాలు ఎగరేస్తుంటే.. మరి కొంతమంది పార్టీలు మారిపోతున్నారు.
ఈ సమయంలో ఇతర పార్టీల్లో అసంతృప్త నేతలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నీలం మదు, మోత్కుపల్లి నర్సింహులు, ఆకుల లలిత మొదలైన వారు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి ఇష్యూ ఆసక్తిగా మారింది.
అవును... కాంగ్రెస్ పార్టీ తొలుత ప్రకటించిన 55 మంది అభ్యర్థుల జాబితాతో పాటు తాజాగా 45 మందితో రెండో విడుదల చేసిన జాబితాలోనూ తన పేరు లేకపోవడంతో.. జూబ్లీహిల్స్ టికెట్ ఆశించిన పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా... కష్టకాలంలో పార్టీని వీడకుండా ఉంటే కాంగ్రెస్ తనకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తనకు ఎందుకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వలేదో ఇప్పటికీ అర్థం కావటం లేదని చెబుతున్న ఆయన... ఒకే కుటుంబంలో రెండు టిక్కెట్లు ఇవ్వడమే కారణంఆ అని ప్రశ్నించారు. ఈ విషయం తమవరకూ వచ్చేటప్పటికే గుర్తుకువచ్చిందా అన్నట్లుగా ఆయన ప్రశ్నించారు. దీంతో... ఉత్తం కుమార్ రెడ్డి దంపతులకు, మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడికి టికెట్లు ఇచ్చిన విషయాన్ని ఆయన పరోక్షంగా లేవనెత్తినట్లయ్యిందని అంటున్నారు.
అనంతరం... తాను జూబ్లీహిల్స్ లో గెలుస్తానని అన్ని రిపోర్టులు చెప్తున్నాయని.. అయితే కావాలనే తనకు టిక్కెట్ ఇవ్వలేదని.. పొమ్మనలేక పొగబెట్టే ఆలోచనగా అనిపిస్తుందని.. టికెట్ ఇస్తామని ఢిల్లీ పెద్దలు చాలాకాలంగా చెబుతూనే ఉన్నప్పటికీ అనూహ్యంగా జాబితాలో పేరు లేకపోవడం షాకింగ్ గా అనిపించిందని విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు.
ఇదే సమయంలో... తాను వేరే పార్టీలో చేరితే మంచి స్థానం ఇస్తామని ఇప్పటికే పలు ఆఫర్లు వచ్చాయని చెబుతున్న విషణువర్ధన్ రెడ్డి... కార్యకర్తల సమావేశం తర్వాత తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. అనంతరం... హాఫ్ టికెట్ గాళ్లకు కూడా టికెట్లు ఇచ్చారంటూ విమర్శించిన విష్ణు... తాను కచ్చితంగా జూబ్లీహిల్స్ నుంచి పోటీచేస్తానని స్పష్టం చేశారు.