తప్పు చేస్తే అంతే: నకిలీ సర్టిఫికేట్లు తయారు చేస్తున్న వాలంటీర్ అరెస్టు

Update: 2023-08-02 04:44 GMT

తప్పు ఎవరు చేసినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోంది. సంచలనాల కోసం ఘాటు ఆరోపణలు చేయటం.. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారాల్ని చేపట్టం ఈ మధ్యన ఎక్కువైంది. ఒక వ్యవస్థలో అందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కోలా వ్యవహరిస్తుంటారు. అంత మాత్రాన తప్పులు చేస్తున్న వారిని హైలెట్ చేస్తూ.. వ్యవస్థపై సందేహాలు వ్యక్తమయ్యేలా చేయటం ఏ మాత్రం సరికాదు. ఏపీలో విపక్షాల వ్యవహార శైలి ఇప్పుడు అలానే ఉంటోంది. అయితే.. తప్పు చేసే వారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్న సత్యం తాజా ఉదంతాన్ని చూస్తే అర్థమవుతుంది.

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం సెజ్ కాలనీలోని సచివాలయంలో పని చేసే ఉద్యోగులు చేసిన తప్పుడు పనులకు చెక్ పెట్టేలా అధికారులు వ్యవహరించారు. ప్రభుత్వ పథకాలను అక్రమంగా పొందేందుకు వీలుగా తప్పుడు ధ్రువపత్రాల్ని తయారు చేస్తున్న ముగ్గురు సచివాలయ ఉద్యోగులు.. వాలంటీర్ ను పోలీసులు అరెస్టు చేశారు. సచివాలయంలో పని చేసే డిజిటల్ అసిస్టెంట్ సుధీర్ కు పెళ్లి కాలేదు.

కానీ.. డిజిటల్ కీను ఉపయోగించుకొని తనకు తాను నకిలీ పెళ్లి పత్రాన్ని క్రియేట్ చేసుకున్నాడు. ఇదే సచివాలయంలో పని చేసే మహిళా పోలీసులు రాజేశ్వరి.. వెంకటలక్ష్మిలు భర్తలతో కలిసి ఉంటున్నారు. అయినప్పటికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్థి పొందేందుకు తాము విడాకులు తీసుకున్నట్లుగా తప్పుడు పత్రాల్ని తయారు చేసుకున్నారు.

వీరి కక్కుర్తిని గుర్తించిన పంచాయితీ కార్యదర్శి అధికారులకు వీరి లీలల గురించి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. క్రాస్ చెక్ చేసి.. వచ్చిన ఆరోపణల్లో నిజం ఉందన్న విషయాన్ని గుర్తించారు. ఆ వెంటనే ముగ్గురు సచివాలయ సిబ్బంది.. వారికి సహకరించిన వాలంటీర్ లపై కేసులు నమోదు చేశారు. ఆ వెంటనే అరెస్టు చేశారు. ఈ కేసులన్ని బెయిల్ బుల్ కావటంతో వారికి స్టేషన్ బెయిల్ ఇప్పించారు. వీరు చేసిన తప్పుడు పనులపై విచారణ సాగుతోంది. ఇంత పెద్ద వ్యవస్థలో వాలంటీర్లు.. సచివాలయ సిబ్బందిలో కొందరు తప్పుడు పనులు చేసినా.. వారికి చెక్ పెట్టే వ్యవస్థ ఎంతలా పని చేస్తుందన్న దానికి తాజా ఉదంతం ఒక నిదర్శనంగా చెబుతున్నారు.

Tags:    

Similar News