ఏపీలో మొదలైన ధర్నాలు, దీక్షలు... వాలంటీర్లకు మరొకరు తోడు!

ఇలా విడతల వారిగా వాలంటీర్లకు చెక్ పెడుతున్నారని అంటున్నారు. ఈ సమయంలో దీక్ష మొదలుపెట్టారు వాలంటీర్లు.

Update: 2024-12-16 10:13 GMT

ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీల ప్రభావమో.. లేక, పవన్ కల్యాణ్ కూడా తోడయ్యారనే నమ్మకమో.. దీని తోడు, కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ విజయంతో మరింత సహకరిస్తుందన్న ధైర్యమో తెలియదు కానీ... ఏపీ వాలంటీర్, వీఏవో మొదలైన ప్రభుత్వ (చిరు) ఉద్యోగులు కూటమిపై హోప్స్ ఎక్కువ పెట్టేసుకున్నారని అంటారు.

ప్రధానంగా వాలంటీర్ల సంగతైతే చెప్పే పనే లేదని అంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీతం 5వేల నుంచి 10 వేలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే... అసలు వాలంటీర్లకు సంబంధించిన అంశం ప్రభుత్వంలో ఎక్కడా లేదని పవన్ కల్యాణ్ వెల్లడించారు. దీంతో.. వైసీపీ నేతలు నాటి జీవోలు చూపించారు.

అయినప్పటికీ వాలంటీర్లపై కూటమి పెద్దలు కనికరం చూపించడం లేదని అంటున్నారు. ఇదే సమయంలో గ్రామ/వార్డు సచివాలయంలో వాలంటీర్ల హాజరుకు సంబంధించిన అవకాశాన్ని తీసేశారని చెబుతున్నారు. ఇలా విడతల వారిగా వాలంటీర్లకు చెక్ పెడుతున్నారని అంటున్నారు. ఈ సమయంలో దీక్ష మొదలుపెట్టారు వాలంటీర్లు.

అవును... తమ సమస్యలను పరిష్కరించాలంటూ విజయవాడలోని గాంధీనగర్ ధర్నా చౌక్ లో వాలంటీర్లు ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా... వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈ వ్యవస్థను కంటిన్యూ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమయంలో వీరి దీక్షకు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏ.ఐ.ఎస్.ఎఫ్) మద్దతు తెలిపింది.

ఈ సందర్భంగా స్పందించిన వాలంటీర్లు... వాలంటీర్లు గత ఆరు నెలలుగా పోరాటాలూ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని.. ఎన్నికల ముందు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇచ్చి, కుర్చీలు ఎక్కిన తర్వాత ఇలా ప్రవర్తించడం సరికాదని అంటున్నారు! పాలకులు ఇలా అన్యాయం చేయడం దారుణమని వాపోతున్నారు!

ఇదే సమయంలో... స్కిల్ డెవలప్ మెంట్ చేసి, ఎక్కువ డబ్బులు సంపాదించేలా చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని.. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలలుగా జీతాలు పెండింగ్ లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు! సోమవారం నుంచి మొదలుపెట్టి మూడు రోజుల పాటు 50 గంటల సేపు నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్లు వాలంటీర్లు తెలిపారు.

విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (వీఏవో) ధర్నా!:

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ వీఏవోలు కూడా విజయవాడలో ధర్నాకు దిగారు. వీరికి మద్దతుగా వివిధ కార్మిక సంఘాల నేతలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గత ఐదు నెలలుగా వేతనాలు లేక వీఏవోలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ఇందులో భాగంగా... సుమారు 15 వేల మందికి నెలకు ఎనిమిది వేల వేతనాన్ని ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వం తరహాలోనే ఈ ప్రభుత్వమూ వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని వీఏవోలు డిమాండ్ చేస్తున్నారు.

ఇలా అటు వాలంటీర్ల నిరాహార దీక్షలు.. ఇటు వీఏవోల ధర్నాలతో నేడు ఏపీలో మరోసారి నాటి పరిస్థితులు దర్శనమిస్తున్నాయనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు. ఈ ఉద్యోగుల సమస్యలపై చంద్రబాబు, కల్యాణ్ బాబు వెంటనే స్పందించి, పరిష్కరించాలని చెబుతున్నారు.

Tags:    

Similar News