వైసీపీ నేతలపై మాజీ వలంటీర్ల వ్యాఖ్యలు వైరల్!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచీ వాలంటీర్లకు సంబంధించిన విషయాలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే

Update: 2024-06-20 08:07 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచీ వాలంటీర్లకు సంబంధించిన విషయాలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఈ వ్యవస్థ హాట్ టాపిక్ గా మారింది. ప్రధానంగా... ఎన్నికల సమయంలో వీరి విధులను అడ్డుకోవడం.. అనంతరం వీరిలో కొంతమంది రాజీనామాలు చేయించడం తెలిసిందే! అయితే... తమతో బలవంతంగా వైసీపీ నేతలు రాజీనామాలు చేయించారని అంటున్నారు మాజీ వాలంటీర్లు.

అవును... ఏపీలో ఎన్నికల వేళ అత్యంత హాట్ టాపిక్ గా మారిన వాలంటీర్లు.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వార్తల్లో నిలుస్తున్నారు! ఇందులో భాగంగా... ఎన్నికల వేళ వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని అంటున్నారు. అయితే ఈ విషయంపై స్పందించిన మంత్రి అచ్చెన్న... ఎవరెవరైతే బలవంతంగా రాజినామాలు చేయించారో వారిపై కేసులు పెట్టండి అంటూ మాజీ వాలంటీర్లకు సూచించిన సంగతి తెలిసిందే.

దీంతో... మాజీ వాలంటీర్లంతా పోలీస్ స్టేషన్స్ ముందు క్యూ కట్టారు. ఉదాహరణకు... నెల్లూరు జిల్లాలో 13,609 మంది వాలంటీర్లు ఉండగా.. వారిలో సుమారు 200 మందిని ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారనే కారణంతో విధుల నుంచి తప్పించారు. మరో 4,539 మంది వరకు రాజీనామాలు చేశారు. అయితే వారిలో కొందరు మాత్రం తమను వైసీపీ నేతలు బెదిరించి రాజీనామాలు చేయించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు!

ఈ సందర్భంగా స్పందించిన మాజీ వాలంటీర్లు... ఎన్నికల ముందు వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా ఆదోనిలోని సబ్ కలెక్టర్ ఆఫీసు ఎదుట మాజీ వాలంటీర్లంతా నిరసన చేపట్టారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకుని, తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నారు.

Tags:    

Similar News