ఏపీ పాలిటిక్స్‌లో వైశ్య గళం.. ఎంత బలం.. 10 సీట్లకు డిమాండ్..!
రాష్ట్రంలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల నైనా తమకు కేటాయించాలని ఈ వర్గం నాయకులు చెబుతున్నారు.
రాష్ట్రంలో మరో సామాజిక వర్గం ఎన్నికల కురుక్షేత్రంలోకి అడుగు పెట్టింది. వాస్తవానికి ఈ సామాజిక వర్గం.. నుంచి ఎంతో మంది నాయకులు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం జరుగుతున్న కులాల రాజకీయాలు.. ఎన్నికల నేపథ్యంలో తమకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలనే వ్యూహంతో వైశ్య సామాజిక వర్గం దూకుడు ప్రదర్శిస్తుండడం గమనార్హం. రాష్ట్రంలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల నైనా తమకు కేటాయించాలని ఈ వర్గం నాయకులు చెబుతున్నారు. తాజాగా మాజీ మంత్రి టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో వైశ్య సామాజిక వర్గానికి ప్రతిపార్టీ కనీసం 5 నుంచి 10 సీట్లు కేటాయించాలని ఆయన డిమండ్ చేశారు. అంతేకాదు.. వైశ్య సామాజిక వర్గం ఓట్లను ఏ పార్టీ కూడా గుర్తించడం లేదని.. వారి డిమాండ్లను కూడా నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి రాజకీయ పార్టీ కూడా.. కనీసం 5 స్తానాలు ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైశ్యుల సత్తా చూపిస్తామని కూడా టీజీ హాట్ కామెంట్స్ చేశారు.
ఇదిలావుంటే.. వచ్చే ప్రభుత్వానికి కూడా టీజీ టార్గెట్ పెట్టారు. వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు ఈ కార్పొరేషన్‌కు హీనపక్షం 10 కోట్ల రూపాయలు కేటాయించాలని ఆయన కోరారు. ఇదే సమయం లో ఆయన వైసీపీ నాయకుడుగా ఉన్న ఎమ్మెల్యే మద్దాలి గిరికి టికెట్ ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఆయనకు టికెట్ ఇవ్వాలన్నది టీజీ డిమాండ్. లేకపోతే.. తమతో వస్తే.. టికెట్ ఇప్పిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.
టీజీ కామెంట్లు ఎలా ఉన్నా.. ప్రధాన పార్టీలైన టీడీపీ-వైసీపీలను చూసుకుంటే.. వైశ్య సామాజిక వర్గానికి బాగానే ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే.. ఎటొచ్చీ.. టీజీ కుటుంబానికి ఈ మధ్య కాలంలో రాజకీయంగా ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. మొత్తం కులసంఘాల బాధగా ఆయన మార్చేయడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంపీ టికెట్‌ను కోరుతున్నారనే ప్రచారం కొన్నాళ్లుగా ఉంది. కర్నూలు నుంచి ఆయన ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక వర్గం వంకతో ఇలా డిమాండ్లను తెరమీదికి తెచ్చారని అంటున్నారు పరిశీలకులు.