కశ్మీర్ ఎన్నికల ఫలితాన్ని ఎలా చూడాలి?
90 స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ 42 స్థానాల్ని సొంతం చేసుకొని పరభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటూ ఉంటే.. బీజేపీ 29 స్థానాల వద్దే ఆగిపోయింది.
మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితం ఇప్పుడు ఆసక్తికరంగామారింది. ఎందుకంటే.. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని.. హంగ్ ఖాయమని స్పష్టం చేశారు. అయితే.. అనూహ్యంగా స్పష్టమైన తీర్పును ఓటర్లు ఇచ్చేశారు. 90 స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ 42 స్థానాల్ని సొంతం చేసుకొని పరభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటూ ఉంటే.. బీజేపీ 29 స్థానాల వద్దే ఆగిపోయింది. ఎన్ సీకి మిత్రుడైన కాంగ్రెస్ కేవలం ఆరు స్థానాలకే పరిమితమైంది. ఒకప్పుడు బీజేపీకి జట్టు కట్టి ఆ తర్వాత కటీఫ్ చెప్పిన పీడీపీ కాంగ్రెస్ కంటే దారుణంగా మూడు స్థానాలకే పరిమితమైంది. జేపీసీ.. సీపీఎం.. ఆప్ పార్టీలు ఒక్కో స్థానంలో.. ఇండిపెండెంట్ అభ్యర్థులు ఏడు స్థానాల్లో విజయం సాధించారు.
ఈ ఎన్నికల ఫలితాల్నివిశ్లేషించే ముందు ప్రధాన పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం ఆసక్తికరంగా మారింది. బీజేపీ 25.64 శాతం ఓట్లతో తక్కువ స్థానాల్ని సొంతం చేసుకుంటే.. నేషనల్ కాన్పరెన్స్ మాత్రం 23.43 శాతం ఓట్లతో ఎక్కువ సీట్లను సొంతం చేసుకోవటమే కాదు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి. ఎందుకిలా? అంటే.. బీజేపీ తనకు పట్టున్న జమ్ము ప్రాంతంలోని అభ్యర్థులు పెద్ద ఎత్తున మెజార్టీని సొంతం చేసుకున్నారు. దీంతో.. ఓట్ల శాతం బీజేపీవైపు ఉన్నా.. సీట్లు గెలుచుకునే విషయంలో మాత్రం కమలనాథులు వెనుకబడిపోయారు.
గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే బీజేపీ తన ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగింది. సీట్లను మెరుగుపర్చుకోగలిగింది. అయితే.. కొత్త కశ్మీర్.. శాంతియుత కశ్మీర్.. లాంటి నినాదాలు కశ్మీరీలకు ఎక్కలేదు. ఆర్టికల్ 370 పునరుద్దరణ (జరిగే అవకాశం లేకున్నా).. రాష్ట్ర హోదానే వారికి ప్రాధాన్యతగా మారాయి. అందుకే.. కశ్మీర్ లో బీజేపీ తన పట్టును ప్రదర్శించలేకపోయింది. సంప్రదాయంగా తనకున్న బలమున్న జమ్ములో బీజేపీ తాను అనుకన్నట్లే ఫలితాల్ని సొంతం చేసుకోగలిగినా..కశ్మీర్ లో మాత్రం ఏ మాత్రం అనుకూల ఫలితాలు రాలేదు.
అదే సమయంలో నేషనల్ కాన్ఫరెన్స్.. కాంగ్రెస్ ల ఇండియా కూటమి ఘన విజయాన్ని సాధించింది. 47సీట్లు ఉన్న కశ్మీర్ లోయలో బీజేపీ ప్రభావం చాలా తక్కువగా కనిపించింది. అదే సమయంలో జమ్ములో తన వ్యూహం ఫలించి.. కశ్మీర్ రాజదండం చేతికి వస్తుందన్న అంచనాలు తప్పాయి. జమ్ములో మొత్తం 43 సీట్లు ఉండగా.. బీజేపీకి వచ్చిన మొత్తం 29 స్థానాల్ని చూస్తే.. జమ్ము ప్రజల మనసుల్ని దోచుకోవటంలోనూ తడబడినట్లుగా కనిపిస్తుంది.
తమకు రాష్ట్ర హోదా లేకుండా చేసిన బీజేపీపై కశ్మీరీలు గుర్రుగా ఉన్నరన్న విషయం ఈ ఎన్నికల్లో అర్థమైందని చెప్పాలి. కొత్త కశ్మీర్ ను స్రష్టిస్తున్నామని.. శాంతిభద్రతలు.. డెవలప్ మెంట్ మీద ఫోకస్ చేసినట్లుగా.. సంపద పెంచినట్లుగా చెప్పినప్పటికీ వాటిని ఓట్లుగా మలుచుకోవటంలో బీజేపీ ఫెయిల్ అయ్యింది. అంతేకాదు.. సయ్యద్ అల్తాఫ్.. బుఖారీకి చెందిన ఆప్నీ పార్టీతో పాటు సజ్జాద్ లోన్ కు చెందిన పీపుల్స్ కాన్ఫరెన్స్ తో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పార్టీ కోరుకున్న గెలుపు సొంతం కాలేదు. కనీసం హంగ్ ఏర్పడినా.. శాశ్విత ఎమ్మెల్యేల అండతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయింది.
నేషనల్ కాన్ఫరెన్స్.. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలు కశ్మీరీల గౌరవం పేరుతో చేసిన ప్రచారం బీజేపీని కశ్మీర్ వ్యతిరేకిగా ముద్ర వేయటంలో విజయం సాధించాయని చెప్పాలి. కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన తర్వాత కశ్మీర్ కు భారీ ఎత్తున పెట్టుబడులు పెడతామని.. ఉద్యోగాలు వస్తాయని చెప్పిన బీజేపీ చేతల్లో అంత చేసి చూపించలేకపోయింది. ఇది కూడా ఒక లోెటుగా చెప్పాలి. లోయలోని ఓటర్లు బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో నమ్మరన్న విషయం తాజా ఎన్నికల ఫలితంతో మరోసారి నిరూపితమైందని చెప్పాలి. కశ్మీర్ రాష్ట్ర హోదా డిమాండ్ రానున్న రోజుల్లో మరింత ప్రాధాన్యతను సంతరించుకోవటంతోపాటు.. కేంద్రంలోని మోడీ సర్కారుకు కొత్త సవాళ్లను తెచ్చి పెడుతుందని మాత్రం చెప్పక తప్పదు.