విశాఖ వైసీపీ సంగతేంటి....!?
ఆయన వైసీపీ పునాదుల నుంచి ఉన్న నాయకుడు విశాఖ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా చాలా కాలం పనిచేశారు.
ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి అంటున్నారు. వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్న సీనియర్ నేత వంశీ క్రిష్ణ శ్రీనివాస్ పార్టీ మారడంతో ఒక అలజడి రేగుతోంది. ఆయన వైసీపీ పునాదుల నుంచి ఉన్న నాయకుడు విశాఖ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా చాలా కాలం పనిచేశారు.
అటువంటి వంశీ ఇపుడు బయటకు వచ్చి వైసీపీ లోకల్ లీడర్ షిప్ మీద విమర్శలు చేశారు. జనసేనలో చేరిన తరువాత మీడియాతో మాట్లాడిన వంశీ జగన్ తనను బాగా చూసుకున్నారు అని చెప్పుకొచ్చారు. విశాఖ వైసీపీలో మాత్రం కొంతమందిని ప్రోత్సహిస్తున్నారని ఫలితంగా పార్టీ కోసం పనిచేసిన వారికి ముందు నుంచి ఉన్న వారికీ అవకాశాలు లేకుండా పోతున్నాయని అన్నారు.
ఇక చూస్తే విజయసాయిరెడ్డి హయాంలో విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాలలో వైసీపీ గట్టి పట్టు సాధించింది. టీడీపీ కంచుకోట అయిన విశాఖ సిటీలో ఎక్కువ సీట్లు సాధించి మేయర్ పీఠాన్ని కైవశం చేసుకుంది. విజయసాయిరెడ్డి ఉంటే ఢిల్లీ లేకుంటే విశాఖ అన్నట్లుగా ఉండేవారు.
ఆయన పార్టీలోని అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకు సాగేవారు. ఒక విధంగా చెప్పాలీ అంటే అందరికీ అందుబాటులో ఉండేవారు. సమస్య చాలా వరకూ లోకల్ గానే సెటిల్ అయ్యేది. వైవీ సుబ్బారెడ్డి కూడా ఆ విధంగా చేస్తే బాగుంటుంది అని అంటున్నారు.
విశాఖ సిటీలో ఈ రోజుకీ టీడీపీకి కొంత బలం ఉంది. ఇక రూరల్ లో వైసీపీ గట్టిగానే ఉంది. విజయనగరం జిల్లాలో వైసీపీది పై చేయి అయితే శ్రీకాకుళం జిల్లలో హోరా హోరీ అన్నట్లుగా సీన్ ఉంది.
ఈ నేపధ్యంలో ఇంచార్జిల మార్పుని స్మూత్ గానే డీల్ చేయాల్సి ఉంటుందని అంటున్నారు. లేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఒకరిని మార్చి మరొకరిని తీసుకుని వచ్చేటపుడు పాత వారు కూడా కలసి ఉండేలా చేయాల్సి ఉంది అని అంటున్నారు. లేకపోతే కొత్త ముఖంతో ఎన్నికలకు వెళ్ళవచ్చు కానీ పాత వారు వేరే పార్టీలోకి వెళ్తే అది తీరని నష్టం అంటున్నారు.