పీవీ.. తెచ్చిన ఆర్థిక సంస్కరణలేమిటి? దేశానికి మేలేమిటి?

వాస్తవానికి ఢిల్లీ వాతావరణ పరిస్థితులు, రాజకీయాలను తట్టుకోలేక పీవీ హైదరాబాద్ వచ్చేద్దాం అనుకున్నారు.

Update: 2024-02-09 09:08 GMT

అందుకే 1991 బడ్జెట్ ను ఆధునిక భారత చరిత్రలో అతి పెద్ద నిర్ణయాల్లో ఒకటిగా పరిగణిస్తారు.

ఆధునిక ఆర్థిక భారత దేశాన్ని మనం రెండు భాగాలుగా చూడాలి. 1991కి ముందు.. 1991 తర్వాత. మరి ముప్పై ఏళ్ల కిందట భారత్ పరిస్థితి ఎలా ఉంది..? రోజువారీ ఖర్చులకూ కష్టమైన ఆ రోజుల నుంచి ఇప్పుడు ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎలా ఎదిగింది..? మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎలా మారనుంది? దీనికి పునాది వేసింది ఎవరు..? ఇంకెవరు... మన తెలుగు రత్నం.. పీవీ నరసింహారావు.

రాజీవ్ గాంధీ హత్య అనంతరం 1991లో అనూహ్యంగా పీవీ దేశానికి ప్రధాని అయ్యారు. వాస్తవానికి ఢిల్లీ వాతావరణ పరిస్థితులు, రాజకీయాలను తట్టుకోలేక పీవీ హైదరాబాద్ వచ్చేద్దాం అనుకున్నారు. కానీ, పరిస్థితులు ఆయనను ప్రధానిని చేశాయి. ఆ సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. 1991 జూన్ లో పీవీ ప్రధాని పీఠాన్ని అధిరోహించినప్పటికి టన్నుల కొద్దీ బంగారంలో తాకట్టులో ఉంది. నాడు 20 కోట్ల డాలర్ల రుణం కోసం 20 టన్నుల బంగారాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్‌ కు తాకట్టు పెట్టారంటే నమ్మాల్సిందే.

ఆ సంస్కరణలు

ఇప్పుడంటే ఏకగవాక్ష అనుమతులు.. సింగిల్ క్లిక్ తో అనుమతులు అంటూ ప్రభుత్వాలు ఊదరగొడుతున్నాయి. కానీ, 1991కి ముందు దేశంలో అంతా లైసెన్స్ రాజ్. అంటే.. ఏ పనికావాలన్నా లంచాలు. అంతకుమించిన తిరుగుడు. అలాంటి సమయంలో ఆర్థిక విధానాలను మార్చేసే సంస్కరణలను పీవీ పట్టాలెక్కించారు. దీంతోనే భారత్ రూపురేఖలు మారిపోయాయి. విప్లవాత్మకమైన నాటి సంస్కరణల సారథి పీవీ అయితే.. దాని అమలులో రథసారథి నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్. ఈ ఒక్క నిర్ణయం భారత దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్లింది. ఆర్థిక వృద్ధి, ఎగుమతులు, అంతర్జాతీయ సంక్షోభాలకు ఎదురొడ్డి నిలిచేలా చేసింది. 30 ఏళ్ల కిందట ఆహార పదార్థాల దిగుమతిలో అట్టడుగున ఉన్న భారత్ ఇవాళ అంతర్జాతీయ సమాజానికి పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస స్థితికి ఎదిగింది. దీనికి పీవీ సంస్కరణలే కారణం.

విదేశీ మారక నిల్వలు, సమాచార సాంకేతిక పురోగతి, స్టాక్ మార్కెట్లు, టెలీ కమ్యూనికేషన్లు వంటి పలు రంగాల్లో మన దేశ పురోగతికి హద్దు లేకపోయింది. వాస్తవానికి ఇందిరా గాంధీ 1966లోనే సంస్కరణల కోసం విఫల ప్రయత్నం చేశారు. రాజీవ్ గాంధీ కంప్యూటర్లు, కలర్ టీవీలు తెచ్చారు. ఆనాటి పరిస్థితులు దృష్ట్యా ఆర్థిక సంస్కరణలపై ఎక్కువ దృష్టిపెట్టలేదు. వీరిద్దరూ చనిపోయాక ఆర్థిక సమస్యలు పెరిగాయి.

తలుపులు తెరిచేశారు..

1991 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను క్లోజ్డ్ ఎకానమీ అనేవారు. అంటే.. బయటి శక్తులకు అవకాశం లేదు. ప్రతి నిర్ణయం ప్రభుత్వం చేతుల్లోనే ఉండేది. అంటే.. ఉత్పత్తి, ఖర్చు, వినియోగం ఇలా అన్నిటినీ ప్రభుత్వమే చూసుకుంటుంది. దీన్నే పర్మిట్‌ రాజ్ లేదంటే లైసెన్స్ రాజ్ అనేవారు. అయితే, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాక ఓపెన్ ఎకానమీలో ప్రభుత్వ పెట్టుబడులను తగ్గించేశారు. ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించారు. నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ జులై 24, 1991న పెట్టిన బడ్జెట్ ద్వారా భారత మార్కెట్ తలుపులు తెరిచారు. తద్వారా లైసెన్సింగ్ రాజ్ ముగిసింది. కంపెనీలకు నిబంధనలతో కూడిన పర్మిట్లు చెల్లయ్యాయి. ఎగుమతులను ప్రోత్సహించడం, దిగుమతి లైసెన్సింగ్‌ లో సడలింపులే లక్ష్యంగా బడ్జెట్‌ ప్రకటించారు. ఎగుమతులను ప్రోత్సహించడానికి ‘దిగుమతి-ఎగుమతి విధానం’లో విదేశీ పెట్టుబడులను స్వాగతించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉద్యోగాలు సృష్టిస్తాయని తెలిపారు. సాఫ్ట్‌ వేర్ ఎగుమతి కోసం ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 హెచ్‌ హెచ్‌ సి కింద పన్ను మినహాయింపు ఇచ్చారు. తదనంతరం విద్యాశాఖను మానవవనరుల అభివృద్ధి శాఖగా మార్చడం, జైళ్ల శాఖలో సంస్కరణలు తేవడం, నవోదయ పాఠశాలల ఏర్పాటు, గురుకుల విద్యకు నాంది వంటి పలు సంస్కరణలను తెచ్చారు. పేదరికం, నిరుద్యోగం, అసమానతల నిర్మూలనలో ఎన్నో మార్పులు తెచ్చారు.

కొసమెరుపు: 1991 నాటికి హరిత విప్లవం కారణంగా కొద్దిపాటి ఆహార స్వావలంబన సాధ్యమైంది. ఇప్పుడు పీవీతో పాటు హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ కూ భారత రత్న దక్కింది.

Tags:    

Similar News