ఏమిటీ 'ముడా' స్కాం?
సీఎం సిద్దరామయ్యపై ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో శనివారం రాత్రి కర్ణాటక కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది.
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై క్రిమినల్ కేసు నమోదు కావటం.. తాజాగా వెలుగు చూసిన ముడా (మైసూర్ నగరాభివృద్ధి ప్రాధికార)లో వెలుగు చూసిన కుంభకోణం ఆ రాష్ట్రంలో ప్రకంపనల్ని సృష్టిస్తోంది. ఈ స్కాంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు బాధ్యత ఉందన్న ఆరోపణలతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ ఓకే చెప్పటంతో.. ఇప్పుడు రాజకీయ సంచలనంగా మారింది. ఇంతకూ ఈ కుంభకోణం ఏమిటి? కర్ణాటక సీఎం సిద్దరామయ్య మీద ఉన్న ఆరోపణలు ఏమిటి? లాంటి అంశాల్ని చూస్తే..
దశాబ్దాల క్రితం మైసూర్ లో సిటీ ఇంప్రూవ్ మెంట్ ట్రస్టు బోర్డు ఉంది. దాని పేరు సీఐటీబీ. దాని స్థానంలో 1987లో ముడా 9మైసూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ)ని ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రి సిద్దరామయ్య బావమరిది మల్లికార్జునస్వామి కెసరె గ్రామ సర్వే నంబరు 464లో ఉన్న 3.16 ఎకరాల వ్యవసాయ భూమిని 2004లో కొనుగోలు చేశారు. సదరు భూమిని మైసూర్ కు చెందిన నింగాబింగ్ జౌరా చిన్న కొడుకు దేవరాజ్ నుంచి మల్లికార్జున స్వామి కొనుగోలు చేసినట్లుగా రికార్డులు ఉన్నాయి. ఈ ఆస్తి దేవరాజ్ తండ్రి నుంచి వచ్చింది. ఇదిలా ఉంటే సదరు ఆస్తిని మల్లికార్జున స్వామి.. ఆడపడుచు లాంఛనం కింద సీఎం సిద్దరామయ్య భార్య పార్వతికి దానం ఇచ్చారు. సదరు భూమిని ముడా స్వాధీనం చేసుకొని పార్కు ఏర్పాటు చేసింది. దీనికి పరిహారంగా ఆమెకు 14 ఇళ్ల స్థలాల్ని కేటాయించింది.
ఇక్కడ వివాదం ఏమంటే.. ముడాలో వేలాది స్థలాలు ఖాళీగా ఉన్నాయి. అయితే.. బాగా డెవలప్ అయిన విజయనగర లే అవుట్ లో ఇంటి స్థలాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యేగా సిద్దరామయ్య ముడాకు రాసిన లేఖ ఇప్పుడు బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ ఇంటి స్థలాల విలువ రూ.70 కోట్లకు పైనే పలుకుతుంది. తమకు వచ్చిన భూమిని ముడా తీసుకున్నందున.. దానికి తగ్గట్లు తమకు ఇంటి స్థలాలు దక్కాయని.. అందులో అవినీతి ఏముంది? అక్రమం ఏముంది? అంటూ సిద్దూ పలు సందర్భాల్లో వివరణ ఇచ్చారు.
దీనికి కౌంటర్ వాదన ఏమంటే.. కెసర పరిధిలో పార్కుగా తీసుకున్న భూమి చదరపు అడుగు ఇప్పటికి రూ.2-3 వేలు పలుకుతుంటే.. విజయనగర్ లే అవుట్ లో సిద్దూ ఫ్యామిలీకి కేటాయించిన భూమి చదరపు అడుగు రూ.10-12 వేల వరకు పలకటాన్ని ఎత్తి చూపుతున్నారు. అంతేకాదు.. సిద్దూ కుటుంబానికి కేటాయించిన భూమి దళితులకు చెందినదిగా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
ఈ ఇష్యూ ఇలా నడుస్తున్న వేళలో.. ముడా నుంచి ఇంటి స్థలాల్ని అక్రమంగా పొందారని.. ముఖ్యమంత్రి కుటుంబాన్ని ప్రాసిక్యూట్ చేయాలని సామాజిక కార్యకర్త టీజే అబ్రహాం.. మైసూరుకు చెందిన మర సామాజిక కార్యకర్త స్నేహమయి క్రిష్ణ.. బెంగళూరుకు చెందిన ప్రదీప్ కుమార్ లు రాజభవన్ కు కంప్లైంట్ చేశారు. దీంతో.. స్పందించిన గవర్నర్ స్పందించి.. ముడా ఇంటి స్థలాల అక్రమంలో ముఖ్యమంత్రి సిద్దూను ప్రాసిక్యూట్ చేయాలని అనుమతులు ఇవ్వటం తాజా వివాదం. గతంలోనూ ముఖ్యమంత్రి యడియూర్ప మీద కూడా ఇలాంటి కంప్లైంట్ ఇవ్వటం.. అప్పటి గవర్నర్ ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వటాన్ని ప్రస్తావిస్తున్నారు.
సీఎం సిద్దరామయ్యపై ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో శనివారం రాత్రి కర్ణాటక కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. గవర్నర్ నిర్ణయాన్ని ఖండించింది. ముఖ్యమంత్రికి మద్దతుగా ఉండాలని.. న్యాయపోరాటం చేయాలని తీర్మానించింది. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ.. చట్ట వ్యతిరేకంగా కేబినెట్ లో తీర్మానం చేశారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు గవర్నర్ కుట్ర చేస్తున్నారని.. కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. మరోవైపు సిద్దూకు అధిష్ఠానం అండగా ఉంటుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి.. పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్ ఛార్జ్ సుర్జేవాలా వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా శనివారం సాయంత్రం న్యాయ నిపుణులతో సీఎం సిద్ధూ అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ ఇష్యూపై న్యాయపోరాటానికి ఏమేం చేయాలన్న దానిపై ఈ రోజు ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఢిల్లీ నుంచి బెంగళూరుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు కం మాజీ కేంద్ర మంత్రులు కపిల్ సిబల్.. అభిషేక్ సింఘ్వీలు బెంగళూరుకు వస్తున్నారు.
తన రాజీనామాను కోరుతున్న వారికి నైతికత లేదన్న సీఎం సిద్దరామయ్య.. కేంద్ర మంత్రి కుమారస్వామి.. మాజీ మంత్రులు మురుగేశ్ నిరాణి.. శశికళ జొల్లె.. జనార్దన్ రెడ్డిలపై రాజ్ భవన్ కు కంప్లైంట్లు ఇచ్చినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ఉత్తరాఖండ్.. జార్ఖండ్.. ఢిల్లీలో చేసిన తరహాలోనే కర్నాటకలోనూ తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నినట్లుగా ముఖ్యమంత్రి ఆరోపించారు. తాను పేర్కొన్నట్లుగా ఎవరిపైనా చర్యలు తీసుకోకుండా.. తనపై చర్యలకు సిద్ధం కావటాన్ని తప్పు పట్టారు.
రాజ్ భవన్ వేదికగా తప్పుడు ఫిర్యాదుతో ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఇరికించాలనే కుట్ర సాగుతుందని.. ముఖ్యమంత్రిని తాము మద్దతుగా ఉంటామని కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమారర్ వ్యాఖ్యానించారు. తాజా పరిణామాల నేపథ్యంలో కర్ణాటక వ్యాప్తంగా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టారు.మొత్తానికి కర్నాటకలో రాజకీయ కాక మొదలైనట్లుగా చెప్పక తప్పదు.