స్థాయి నోబెల్.. తీరు భారత్ పై గోబెల్.. బంగ్లా కొత్త ప్రధాని యూనస్ తీరిది

15 మంది మంత్రులతో గురువారం రాత్రి యూనస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.

Update: 2024-08-08 12:30 GMT

ఆయన బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంక్ వ్యవస్థాపకుడు.. అక్కడి పేద ప్రజల మరీ ముఖ్యంగా మహిళల జీవన స్థితిగతులను మార్చిన వాడిగా గొప్ప పేరు.. అందుకే ఆయనకు నోబెల్ వంటి గొప్ప బహుమతి దక్కింది. అర్ధశాస్త్రంలో పండితుడేమో గానీ.. పరిస్థితులను అర్థం చేసుకోవడం మాత్రం చేతకాదనే విమర్శలున్నాయి. ఇదంతా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నమహమ్మద్‌ యూనస్‌ గురించి. 15 మంది మంత్రులతో గురువారం రాత్రి యూనస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.

ఫ్రాన్స్ నుంచి పయనం..

యూనస్ ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఉంటున్నారు. ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన బంగ్లాదేశ్ యంత్రాంగం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో ఢాకా వస్తున్నారు. కాగా, ఈయన మాజీ ప్రధాని షేక్ హసీనాకు బద్ద వ్యతిరేకి. 84 ఏళ్ల వయసున్న యూనస్.. 2006లో నోబెల్ బహుమతి అందుకున్నారు. బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంక్ ఏర్పాటు చేసి పేద మహిళలకు రుణాలు ఇస్తూ వారి జీవనాన్ని మెరుగుపరిచినందుకు ఈ అత్యున్నత పురస్కారం దక్కింది. సూక్ష్మరుణాల విషయంలో ఎన్నో ప్రశంసలు పొందినా, హసీనా మాత్రం యూనస్ ను తీవ్రంగా విమర్శించేవారు. ఓ కోర్టు ఇటీవల జైలు శిక్ష కూడా విధించింది. కాగా, యూనస్ పారిస్‌ వెళ్లినది వైద్య చికిత్సం కోసం అని తెలుస్తోంది. 1983లో ఈయన బంగ్లాదేశ్ గ్రామీణ్ బ్యాంకును ప్రారంభించారు. ఇది పేద ప్రజలు సొంత, చిన్న వ్యాపారాలను ప్రారంభించడానికి సూక్ష్మ, దీర్ఘకాలిక రుణాలను అందజేస్తుంది. అలా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అంతర్జాతీయంగా "పేదల బ్యాంకర్" అని పిలిచినా.. హసీనా మాత్రం ఆయనను పేదల "రక్తం పీల్చే" వ్యక్తిగా అభివర్ణించడం గమనార్హం. ఆయన బ్యాంక్ అధిక వడ్డీ రేట్లను హసీనా ఆక్షేపించేవారు. ఈ ఏడాది జనవరిలో కార్మికుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడంలో విఫలమైనందుకు, దేశంలోని కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు యూనస్‌ కు 6 నెలల జైలు శిక్ష విధించారు.

అంతా తెలిసినా..

ఉమ్మడి భారత్ విభజన గురించి కాస్తో కూస్తో అవగాహన ఉండి.. బంగ్లాదేశ్ ఏర్పాటును యువకుడి చూసిన యూనస్.. భారత్ అంటే వ్యతిరేకించేవారు. బంగ్లాలో మొన్నటి పరిణామాల అనంతరం పారిస్ లో ఆయన మీడియాతో మాట్లాడిన వైనాన్ని చూస్తే ఇది తెలిసిపోతుంది. బంగ్లా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుందని కూడా ఆరోపించారు. హసీనా గెలుపునకు భారత్ కారణం అనే అర్థం ఇందులో ఉంది. దీంతో నోబెల్ గ్రహీత అయినా.. ఆ హుందాతనం లేదనే విమర్శలు వస్తున్నాయి. కాగా, తాత్కాలిక ప్రధానిగా 84 ఏళ్ల యూనస్ ఎంతకాలం ఉంటారో చూడాలి. మరోవైపు బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ) చీఫ్ బేగం ఖలీదా జియా బయటకు వస్తున్న నేపథ్యంలో యూనస్ పదవి దిగిపోక తప్పదు.

Tags:    

Similar News