ఆ ముగ్గురూ బీజేపీ పాతకాపులే !

గత ఎన్నికల్లోనూ బలమైన ఓట్లు సాధించడమే కాకుండా విద్యావంతుల ఆదరణ తమకే ఉందని నిరూపించే సంకల్పంతో బీజేపీ ఈ స్థానంపై కన్నేసింది.

Update: 2024-05-18 17:30 GMT

ఇటీవల ముగిసిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో పలు స్థానాల నుండి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తరపున బీఆర్ఎస్ నుండి చేరిన వారే ఎంపీ బరిలో అభ్యర్థులుగా నిల్చున్నారు. అయితే నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల శాసనమండలికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ముగ్గురూ బీజేపీ పాతకాపులే పోటీ చేస్తుండడం విశేషం.

వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులతో సహా 52 మంది పోటీ పడుతున్నారు. సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ పావులు కదుపుతుండగా, ఈసారి ఎలాగైనా పాగా వేయాలనే కాంగ్రెస్‌ పట్టుదలతో వ్యవహరిస్తోంది. గత ఎన్నికల్లోనూ బలమైన ఓట్లు సాధించడమే కాకుండా విద్యావంతుల ఆదరణ తమకే ఉందని నిరూపించే సంకల్పంతో బీజేపీ ఈ స్థానంపై కన్నేసింది.

ఇక్కడ కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. తీన్మార్ మల్లన్న గతంలో బీజేపీలో చేరి బయటకు రాగా, అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. ప్రేమేందర్ రెడ్డి ఇదే స్థానం నుండి గత ఎన్నికల్లో బీజేపీ తరపున ఓడిపోవడం విశేషం. ముగ్గురు పాత్రధారులు పోటీ పడుతున్న ఈ ఎన్నికలో ఎవరు గెలుస్తారా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News