టోల్ తీస్తామంటున్న కూటమి సర్కార్ ?

దీని వల్ల అటు ప్రభుత్వం ఇటు ప్రైవేట్ మరో వైపు పబ్లిక్ పార్టనర్ షిప్ ఉంటుందన్న మాట.

Update: 2024-10-12 23:30 GMT

రాజకీయంగా అనుభవం నిండుగా ఉన్న వారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన విజన్ నుంచి తాజాగా ఒక కీలక సమస్యకు పరిష్కారం కనుగొంటున్నారు. అదే పీపీపీ అనే విధానం. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ అన్నది దీని ఫుల్ ఫార్మ్. దీని వల్ల అటు ప్రభుత్వం ఇటు ప్రైవేట్ మరో వైపు పబ్లిక్ పార్టనర్ షిప్ ఉంటుందన్న మాట.

ఏపీలో రోడ్లు దుస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఈ రోడ్లకు రిపేర్లు చేయాలంటేనే ఏకంగా నాలుగు వేల నుంచి అయిదు వేల రూపాయల దాకా ఖర్చు అవుతాయని లెక్క వేశారు. లేటెస్ట్ గా మంత్రి నారా లోకేష్ ని ఇదే విషయం మీద మీడియా కూడా ప్రశ్నిస్తే రోడ్ల నిర్మాణం అన్న దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయని అవి తగ్గితే రోడ్ల నిర్మాణం పనులు మొదలెడతామని జవాబు ఇచ్చారు

అయితే రోడ్ల నిర్మాణానికి వేల కోట్లు సర్కార్ దగ్గర లేవు అని అంటున్నారు ఒక వైపు జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్రం వద్ద ప్రతిపాదనలు పెట్టిన ఏపీ ప్రభుత్వం వేల కిలోమీటర్లు ఉన్న రాష్ట్ర రోడ్లను ఏమి చేస్తుంది అన్న ప్రశ్న ఉండనే ఉంది. ఏపీలో రోడ్ల నిర్మాణం సరిగా లేదని గుంతలు పడిన రోడ్లు అని గత అయిదేళ్ల వైసీపీ పాలన మీద ట్రోలింగ్స్ ఎన్నో వచ్చాయి.

అయితే ఇపుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయినా అదే రకమైన పరిస్థితి ఉంది అని అంటున్నారు. ఇంకా చెప్పాలీ అంటే ఈ నాలుగు నెలల కాలంలో భారీ వర్షాలు ఎన్నడూ లేని విధంగా కురియడంతో ఆ మాత్రం రోడ్లు కూడా నాశనం అయ్యాయి.

ఈ క్రమంలో రోడ్లను నిర్మించకపోతే మాత్రం జనాలలో పూర్తి స్థాయిలో అసంతృప్తి చెలరేగడం ఖాయమని అంటున్నారు. అయితే ప్రభుత్వం దీని మీద పీపీపీ విధానం అని ఒకటి ముందుకు తెస్తోంది. ఈ నెల 16న జరిగే ఏపీ మంత్రి వర్గ సమావేశంలో ఈ అంశం మీద చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు.

ఇంతకీ పీపీపీ అంటే ఏమిటి అంటే రోడ్లను ప్రైవేట్ వారికి అప్పగించడమే. ప్రైవేట్ సంస్థలు రోడ్లను నిర్మిస్తాయి. వారికి తగిన విధమైన సాయం అంటే ఆర్ధిక విషయాలు తప్పించి మిగిలినవి అన్నీ కూడా ప్రభుత్వం అందిస్తుంది. దీనికి సంబంధించి ఒక కమిటీ కూడా ఉంటుంది. అందులో ఆర్ అండ్ బీ అధికారులు, ఇంజనీర్లు ఉంటారు. టెక్నికల్ హెల్ప్ ప్రభుత్వం తరఫున ఇస్తారు అన్న మాట.

ఈ విధంగా రోడ్లను నిర్మించే ప్రక్రియలో తొలి విడతగా 13 వేల కిలోమీటర్లను పీపీపీ విధానంలో అప్పగిస్తారు అని అంటున్నారు అంతా బాగానే ఉంది ప్రైవేటు సంస్థలు రోడ్లను నిర్మించి తమ సొమ్ముని ఏ విధంగా రికవరీ చేసుకుంటాయన్నదే ఇక్కడ కీలకమైన ప్రశ్న. వారికి కచ్చితంగా పెట్టిన సొమ్ము లాభాలతో సైతం వెనక్కి రావాలి అంటే జనం మీద టోల్ ఫీజు పెట్టాల్సిందే అని అంటున్నారు.

సరిగ్గా ఇక్కడే మరో పీ ముందుకు వస్తోంది. ఈ పీ అంటే ప్రజలు అన్న మాట. వారు టోల్ ఫీజు చెల్లించి ఈ రోడ్లను వాడుకోవాలి. మరి ఆ విధంగా టోల్ ఫీజు వసూలు చేస్తే ప్రజల నెత్తిన అది పెను భారం కాదా అన్న చర్చ ఉంది. ఇప్పటికే జాతీయ రహదారి ఎక్కితే చాలు టోల్ దెబ్బ పడుతోంది. ఇపుడు లోకల్ రోడ్లకు అదే బాధ ఉంటే జనాలు ఏమిటీ బాదుడు అని ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేయరా అన్నది కూడా చర్చగా ఉంది.

అయితే ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు, గ్రామాలలో మండలాలలో రోడ్లను అభివృద్ధి చేయాలీ అంటే ప్రజల నుంచి కూడా ఆ మాత్రం సహకారం ఉండాల్సిందే కదా అని అంటున్నారు. మరి ప్రజలు కనుక టోల్ ఫీజు చెల్లించమని అంటే అపుడు సంగతేంటి అన్న చర్చ ఉంది. మరి పీపీపీ విధానంలో రోడ్లను వేయడానికి కాంట్రాక్టర్లు సిద్ధమవుతారా అన్నది కూడా చూడాలని అంటున్నారు

ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చే ఈ విధానం కనుక సక్సెస్ అయితే దేశమంతా అనుసరిస్తుంది. కానీ తేడా వస్తేనే ఇబ్బంది అని అంటున్నారు, ఏపీలో ప్రజలు టోల్ దెబ్బకు సిద్ధంగా ఉన్నారా లేరా అన్నది కూడా చూడాల్సి ఉంది.

Tags:    

Similar News