రాజీవ్‌ గాంధీ చేసినట్టు మోదీ చేస్తారా?

ఇప్పటికే ఇండియా కూటమిలోని పలువురు నేతలు ఈ డిమాండ్‌ వినిపించగా ఇప్పుడు రాజస్థాన్‌ కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ ఇదే అంశాన్ని లేవనెత్తారు.

Update: 2024-06-07 08:00 GMT

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 292 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. 400 స్థానాలను లక్ష్యంగా పెట్టుకున్నా సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ పరాజయానికి నరేంద్ర మోదీ నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని పదవిని చేపట్టకూడదని కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఇండియా కూటమిలోని పలువురు నేతలు ఈ డిమాండ్‌ వినిపించగా ఇప్పుడు రాజస్థాన్‌ కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ ఇదే అంశాన్ని లేవనెత్తారు.

1989లో నాడు ప్రధానిగా ఉన్న రాజీవ్‌ గాంధీ సైతం ఆ ఎన్నికల్లో మెజార్టీ కంటే తక్కువ సీట్లు వచ్చాయని.. ప్రధాని పదవిని చేపట్టడానికి ఇష్టపడలేదని సచిన్‌ పైలట్‌ గుర్తు చేశారు. 1989 లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 197 స్థానాలు వచ్చాయి. నాడు లోక్‌ సభలో ఆ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రజలు తమకు పూర్తి మెజార్టీ ఇవ్వలేదని.. ప్రధాని పదవిని చేపట్టడం సరికాదని రాజీవ్‌ గాంధీ భావించారు. దీంతో 143 స్థానాలు సాధించిన జనతాదళ్‌ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జనతాదళ్‌ కు టీడీపీ సహా పలు పార్టీలు నాడు మద్దతు ఇచ్చాయి. అయితే ఈ ప్రభుత్వం రెండేళ్లకే కుప్పకూలింది. 1991లో కాంగ్రెస్‌ పార్టీ ఇతర పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఇప్పుడు ఇదే అంశాన్ని సచిన్‌ పైలట్‌ గుర్తు చేశారు. నాడు ఎన్నికల్లో పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీవ్‌ గాంధీ ప్రధాని పదవికి దూరంగా ఉన్నట్టే.. ఇప్పుడు నరేంద్ర మోదీ కూడా ప్రధాని పదవిని చేపట్టకూడదని సచిన్‌ పైలట్‌ డిమాండ్‌ చేశారు.

ప్రస్తుత ఫలితాల విషయంలో బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాలని సచిన్‌ పైలట్‌ కోరారు. 1989లో కాంగ్రెస్‌ పెద్ద పార్టీగా అవతరించినా పూర్తి మెజార్టీ రాలేదని రాజీవ్‌ గాంధీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. దీంతో కాంగ్రెస్‌ తర్వాత పెద్ద పార్టీగా నిలిచిన జనతాదళ్‌ కు అవకాశం వచ్చిందని గుర్తు చేశారు.

తాజా ఎన్నికల్లో బీజేపీకి కూడా నాడు కాంగ్రెస్‌ కు ఎదురైన పరిస్థితే ఎదురయిందని సచిన్‌ పైలట్‌ చెప్పారు. కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ఉండాలన్నారు. ప్రస్తుత ఎన్నికల ఫలితాలు బీజేపీకి, ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

కాగా ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 240 ఎంపీ స్థానాలు వచ్చాయి. ఎన్డీయే భాగస్వామ్య పార్టీలతో కలిసి బీజేపీ మొత్తం 292 స్థానాలు గెలుచుకుంది. దీంతో మెజార్టీ (272) కంటే అధికంగా 20 స్థానాలు ఎన్డీయే కూటమికి ఉన్నాయి. దీంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది.

మరోవైపు బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌ ఉంది. ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో 99 స్థానాలు దక్కాయి. ఒక ఇండిపెండెంట్‌ ఎంపీ కూడా కాంగ్రెస్‌ లో చేరడంతో 100 స్థానాలు దక్కినట్టయింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ తన మిత్ర పక్షాలతో కలుపుకుని 240 సీట్లు సాధించింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీ నేతలు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొద్దని కోరుతున్నారు.

అయితే మరోసారి ప్రధాని మోదీని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు తమ నాయకుడిగా ఎన్నుకున్నాయి. జూన్‌ 9న ఆయన మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో ఇండియా కూటమి ఆశలకు తెరపడ్డట్టే!

Tags:    

Similar News