రాహుల్ వదిలేసే స్థానమిదే.. ఉప పోరు బరిలో ఆమె
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అంశంపై రాహుల్ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికల్లో రెండు లోక్ సభా స్థానాల నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైన రాహుల్ గాంధీ.. తాను పోటీ చేసిన రెండు స్థానాలను గెలుచుకోవటం తెలిసిందే. నిబంధనల ప్రకారం ఒకస్థానాన్ని తనతో ఉంచుకొని మరో స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఇందుకు నిర్దిష్టమైన గడువు ఉంటుంది.అయితే.. తాను పోటీచేసి గెలిచిన వయనాడు (కేరళ).. రాయ్ బరేలీ (ఉత్తరప్రదేశ్) లలో ఒకదాన్ని మాత్రమే ఉంచుకునే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని కన్ఫ్యూజన్ లో ఉన్నట్లుగా రాహుల్ పేర్కొనటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అంశంపై రాహుల్ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో రాయ్ బరేలీ సీటును ఉంచుకొని.. వయనాడ్ ను వదులుకోవాలన్న ఆలోచనలో రాహుల్ ఉన్నట్లుగా చెబుతున్నారు. షెడ్యూల్ ప్రకారం యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. రాయ్ బరేలీ సీటును అట్టి పెట్టుకోవటం రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందన్న ఆలోచనలో ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో షాకింగ్ ఫలితం బీజేపీకి ఎదురైందంటే అందుకు కారణం ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి భారీగా సీట్లను కోల్పోవటమే. ఈసారి ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో జత కట్టిన కాంగ్రెస్ భారీగా లబ్థి పొందింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో ఇండియా కూటమి పెద్ద ఎత్తున సీట్లు సాధించటానికి యూపీ ఫలితాలే కారణమన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వయనాడ్ ను తనతో ఉంచుకొని.. రాయ్ బరేలీ సీటును వదులుకుంటే తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని రాహుల్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
అదే సమయంలో తనను ఆదరించి.. అక్కున చేర్చుకున్న వయనాడ్ ను వదిలేయటం కేరళీయుల్ని దూరం చేసుకున్నట్లు అవుతుందన్న మాట వినిపిస్తోంది. అందుకే రాజీ ఫార్ములాను సిద్ధం చేసినట్లుగా సమాచారం. తాను వయ్ నాడు స్థానాన్ని వదులుకోవటం ద్వారా జరిగే ఉప ఎన్నికల్లో తన సోదరి ప్రియాంక వాద్రాను నిలవటం ద్వారా ఈ సీటు గాంధీ ఫ్యామిలీలోనే ఉన్నట్లుగా అవుతుందని.. దీంతో కేరళీయుల్ని నొప్పించదన్న భావనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇటీవల ఎన్నికల్లో ప్రియాంక ఎన్నికల బరిలో దిగుతారన్న ప్రచారం జరిగినా.. అదేమీ నిజం కాదంటూ కొట్టిపారేయటం తెలిసిందే. వయనాడు సీటులో పోటీ చేయటం ద్వారా డ్యామేజ్ కంట్రోల్ చేసే వీలుందని చెబుతున్నారు. అయితే.. ఉప పోరులో ప్రియాంక ఎన్నికల బరిలోకి దిగుతారా? అన్నది ప్రశ్న. ఎందుకుంటే.. ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ప్రచారం 2019 నుంచి జరుగుతున్నా.. ఎప్పుడూ రియాల్టీలోకి రాలేదు. అప్పట్లో ఆమె వారణాసి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. 2022లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ మాట్లాడిన ప్రియాంక తాను ముఖ్యమంత్రిఅభ్యర్థిని కావొచ్చని వ్యాఖ్యానించటంపై పెద్ద చర్చ జరిగింది.అయితే.. తాను నోరు జారినట్లుగా పేర్కొంటూ ఆమె వివరణ ఇచ్చారు. ఆ తర్వాత రాజ్యసభ నుంచి ఎంపికయ్యారు.
తాజాగా వయ్ నాడు నుంచి ప్రియాంక పోటీ చేయకుంటే పరిస్థితి ఏమిటి? అన్నది మరో చర్చగా మారింది. పోటీకి ప్రియాంక ఆసక్తి చూపని పక్షంలో.. ఈ స్థానాన్ని ఇంకెవరికి ఇవ్వాలి? అలా ఇచ్చిన తర్వాత ఫలితంలో మార్పు వస్తే జరిగే పరిణామానికి బాధ్యులు ఎవరు? అన్నది హాట్ టాపిక్ గా మారింది. మొత్తంగా ఈ పీటముడి ఎలాంటి ఇబ్బంది లేకుండా వీడిపోవాలంటే ప్రియాంక రంగంలోకి రావాల్సిన అవసరం ఉందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.