అక్కా, తమ్ముళ్ళ శ్రమ ఫలిస్తుందా ?
తెలంగాణాలో ఎన్నికల ప్రచారాన్ని ప్రియాంక గాంధి, రాహుల్ గాంధి బాగానే ఓన్ చేసుకున్నారు. ఇద్దరు కలిసి తెలంగాణాలోని చాలా నియోజకవర్గాల్లో బాగా ప్రచారం చేశారు.
తెలంగాణాలో ఎన్నికల ప్రచారాన్ని ప్రియాంక గాంధి, రాహుల్ గాంధి బాగానే ఓన్ చేసుకున్నారు. ఇద్దరు కలిసి తెలంగాణాలోని చాలా నియోజకవర్గాల్లో బాగా ప్రచారం చేశారు. ఇపుడు ప్రచారం చేసినట్లుగా గతంలో ఎప్పుడూ వీళ్ళు ఇంతలా తిరగలేదు. ఎలాగైనా కాంగ్రెస్ ను అధికారంలోకి తేవాలన్న కసి అక్కా, తమ్ముళ్ళ ప్రచారంలో కనబడుతోంది. బహిరంగసభల్లో ప్రసంగించటమే కాదు రోడ్డుషో, ర్యాలీల్లో కూడా పాల్గొన్నారు. 119 నియోజకవర్గాల్లో వీళ్ళిద్దరు తక్కువలో తక్కువ ఓ 50 నియోజకవర్గాల్లో ప్రచారం చేసుంటారు.
ఎన్నికల నోటిఫికేషన్ కు ముందునుండే వీళ్ళ ప్రచారం మొదలైంది. రైతు, యువత, మహిళ, మైనారిటి, బీసీల డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరినీ పదేపదే తెలంగాణాకు రప్పించింది. వరంగల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చాలా నియోజకవర్గాల్లో ఇద్దరు విస్తృతంగా ప్రచారం చేశారు. చత్తీస్ ఘడ్, రాజస్ధాన్, మధ్యప్రదేశ్, మిజోరంలో ఎన్నికల్లో ప్రచారం చేస్తూనే తెలంగాణా మీద కూడా వీళ్ళిద్దరు ప్రత్యేకంగా దృష్టిపెట్టారు.
వీళ్ళ సభలకు, ప్రసంగాలకు జనాలు బాగానే సానుకూలంగా స్పందించారు. డైరెక్టుగా కేసీయార్ అండ్ ఫ్యామిలీని వీళ్ళు ఎటాక్ చేయటం కూడా జనాల్లో మంచి జోష్ నింపింది. వీళ్ళకి అదనంగా ఐఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్నాటక పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ రెగ్యులర్ గా తెలంగాణాలో ప్రచారం చేస్తునే ఉన్నారు. వీళ్ళతో పాటు అవసరమైనపుడల్లా కర్నాటక సీఎం సిద్ధరామయ్య కూడా ప్రచారం చేస్తునే ఉన్నారు.
వీళ్ళెంతమంది ప్రచారం చేసినా ఎలాగైనా ప్రియాంక, రాహుల్ ప్రచారం చేయటంలో ఒక కిక్కు కనబడుతుంది. ఈ ఐదు రాష్ట్రాల్లో అక్కా, తమ్ముళ్ళు చేసిన ప్రచారాలు తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు చాలా ఉపయోగపడుతుందనే చెప్పాలి. సీనియర్ నేతలను కలుపుకుని వెళ్ళటం, నేతలతో మమేకం అవ్వటం గతంలో రాహుల్లో తక్కువగా ఉండేది. బహుశా పాదయాత్ర ఆ సమస్యను అధిగమంచినట్లుంది. అందుకనే తెలంగాణాలోని సీనియర్లతో పదేపదే సమావేశమవుతు మార్గదర్శకత్వం కూడా చేశారు. దాని ఫలితమే కాంగ్రెస్ నేతలంతా ఏకతాటిపైకి వచ్చి ఎన్నికల్లో పోరాడటం.