లిప్ స్టిక్ వేసుకునే వారికే... మహిళా రిజర్వేషన్ పై మాజీమంత్రి కీలక వ్యాఖ్యలు!
ఎన్నో ఏళ్లుగా మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న మహిళ రిజర్వేషన్ బిల్లు తాజాగా చట్టంగా మారిన సంగతి తెలిసిందే
ఎన్నో ఏళ్లుగా మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న మహిళ రిజర్వేషన్ బిల్లు తాజాగా చట్టంగా మారిన సంగతి తెలిసిందే. చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో చట్టంగా మారింది. దీంతో పలు రాష్ట్రాల్లో మోడీ సర్కార్ కు కృతజ్ఞత తెలుపుతూ సభలు పెడుతున్నారు ఆ పార్టీ నేతలు.
ఇదే క్రమంలో తాజాగా తెలంగాణ రాజ్ భవన్ లో గవర్నర్ తమిళ సై... కృతజ్ఞత సభ ఏర్పాటుచేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన ప్రధాని మోడీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో చట్టంలో ఓబీసీ మహిళలకు కోటా లేకపోవడంపై విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై ఆర్జేడీ సీనియర్ నేత అబ్దుల్ బారీ సిద్ధిఖి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవును... మహిళా రిజర్వేషన్ చట్టంపై ఆర్జేడీ సీనియర్ నేత, మాజీ మంత్రి అబ్దుల్ బారీ సిద్ధిఖి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ చట్టంతో లిప్ స్టిక్ వేసుకునే మహిళలు మాత్రమే ప్రయోజనం పొందుతారని తెలిపారు. లిప్ స్టిక్ పెట్టుకుని, బేబీ కటింగ్ హెయిర్ స్టైల్ తో ఉండే ఆడవాళ్లు .. మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో హంగామా చేస్తుంటారని అన్నారు.
రిజర్వేషన్లను వెనుకబడిన వర్గాల మహిళలకు ఇవ్వాలని, లిప్ స్టిక్ పెట్టుకుని వచ్చే ఆడవాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అబ్దుల్ బారీ అన్నారు. బీహార్ లోని ముజఫర్ పూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ చట్టంలో ఓబీసీ మహిళలకు కోటా లేకపోవడంపై సిద్ధిఖీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. వెనకబడిన వర్గాల మహిళలకు చట్టంలో తగిన కోటా ఇవ్వాల్సిందేనని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లాలుప్రసాద్ యాదవ్ కు అత్యంత సన్నిహితుడు అయిన సిద్ధిఖీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యవహారంపై పెను దుమారం రేగింది.
దీంతో... సిద్ధిఖీ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం అంటూ ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. దీంతో ఈ విషయంపై ఆర్జేడీ అధికార ప్రతినిధి అజాజ్ అహ్మద్ స్పందించారు. వెనకబడిన వర్గాలకు చెందిన మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించకపోతే ఈ మహిళా రిజర్వేషన్ చట్టంతో న్యాయం ఎప్పటికీ జరగదని స్పష్టం చేశారు. సిద్ధిఖీ వ్యాఖ్యలను సరిగా అర్థం చేసుకోకుండా ప్రతిపక్ష నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.