షాకింగ్ న్యూస్: జూదం ఆడుతున్న మహిళల పట్టివేత.. ఎక్కడో తెలుసా..?
ఆధునిక ప్రపంచంలో పురుషులతో పాటు మహిళలు అన్నిరంగాల్లోనూ దూసుకెళ్తున్నారు.
ఆధునిక ప్రపంచంలో పురుషులతో పాటు మహిళలు అన్నిరంగాల్లోనూ దూసుకెళ్తున్నారు. మగవాళ్లకు దీటుగా ముందుకు సాగుతున్నారు. ఎందులోనూ తగ్గేదేలే అని అంటున్నారు. అయితే.. నిజామాబాద్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన యావత్ ఆ జిల్లానే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
జూదం అనేది ఓ వ్యసనం లాంటిది. పూర్వం రాజుల కాలం నుంచి ఈ ఆటను ఆడుతున్నారు. అయితే.. జూదానికి అలవాటు పడి చాలా కుటుంబాలు నాశనం అయ్యాయి. చాలా మంది తమ ప్రాణాలను ఫణంగా పెట్టారు. భార్యల మెడలోని పుస్తెలనూ అమ్ముకున్నారు. భూములు, ఇళ్లను సైతం కోల్పోయారు. చివరకు ప్రాణాలు సైతం తీసుకున్న వారు ఉన్నారు. ఇంకొందరు పోలీసులకు పట్టుబడి జైలు జీవితం గడిపిన వారూ ఉన్నారు.
మన దేశంలో పేకాటను సరదాగా మాత్రమే ఆడుకోవచ్చు. ఎలాంటి బెట్టింగులు, డబ్బులు పెట్టరాదు. అది చట్టవిరుద్ధం కూడా. బెట్టింగ్‌తో ఆడితే అది నేరమే అవుతుంది. అయితే.. ఇప్పటివరకు పేకాట అంటే పురుషులు మాత్రమే ఆడుతారని అనుకున్నాం. ఒకవేళ మహిళలు అయితే ఇంటి వరకే ఇంట్లోనే ఆడుతుంటారని భావిస్తాం. కొన్నిచోట్ల బడా మహిళలు మాత్రం క్లబ్బుల్లోనో.. ఇతరత్రా చోట్ల ఆడుతుంటారు. కిట్టి పార్టీల పేరిట కూడా ఒకదగ్గర పోగై జూదం ఆడడం అలవాటు. కానీ.. నిజామాబాద్ జిల్లాలో నలుగురు మహిళలు పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిపోయారు. దీంతో అంతా షాక్‌కు గురయ్యారు. అయితే.. పోలీసులకు పట్టుబడ్డ వీరంతా ప్రముఖ వైద్యుల భార్యలని తెలిసింది. దీనికి సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
నిజామాబాద్ నగరంలోని సరస్వతీనగర్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రి నాల్గవ అంతస్తును వీరు అడ్డాగా మార్చుకున్నారు. పక్కా సమాచారం మేరకు వన్ టౌన్ పోలీసులు అక్కడికి వెళ్లిచూడగా పేకాట ఆడుతూ చిక్కారు. పేకాట ఆడుతున్న మహిళల నుంచి 5 సెల్‌ఫోన్లు, రూ.15,100 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు కూడా నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.