మహిళల ఉచిత బస్సు ప్రయాణం... జనవరి 1 నుంచి కీలక మార్పు!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ఆరుగ్యారెంటీలు కీలక పాత్ర పోషించాయనేది తెలిసిన విషయమే
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ఆరుగ్యారెంటీలు కీలక పాత్ర పోషించాయనేది తెలిసిన విషయమే. ఇదే సమయంలో ఆ ఆరుగ్యారెంటీల్లోనూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే మహాలక్షీ పథకం మరింత హాట్ టాపిక్. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం జనవరి 1 నుంచి అమలవ్వనుంది.
అవును... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్పందన కనిపిస్తోంది. మరోపక్క ఈ పథకం అమలు వల్ల వచ్చిన పలు సమస్యలు కూడా తెరపైకి వచ్చాయి. ఇలా జీరో టికెట్ విధానం రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతోన్న నేపథ్యంలో... టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు.
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలవుతున్న ఈ సమయంలోనే గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. తాజాగా ఈ నిర్ణయాన్ని ఆన్ లైన్ వేదికగా టీఎస్ ఆర్టీసీ ఎంపీ సజ్జనార్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఈ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించారు.
ఇందులో భాగంగా... "ప్రయాణికులకు ముఖ్య గమనిక! మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను జనవరి 1 - 2024 నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది" అని సజ్జనార్ ట్విట్టర్ లో వెల్లడించారు.
ఇదే సమయంలో... "ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి. వారి వయసును నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి స్కీం వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టి-6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోంది. ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ప్రయాణికులకు ఆ సౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశ్యంతో ఆ టికెట్లను ఉపసంహరించాలని సంస్థ నిర్ణయించింది" అని ఆయన క్లారిటీ ఇచ్చారు.
కాగా... తాజాగా తెలంగాణ ఆర్టీసీలో కొత్త బస్సులను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సుమారు 80 బస్సులను తాజాగా ప్రారంభించగా.. వచ్చే ఏడాది మే లేదా జూన్ నాటికి రూ.400 కోట్ల ఖర్చుతో మరో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభిస్తామని సజ్జనార్ స్పష్టం చేసారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు! ఇదే సమయంలో... మహిళల ఉచిత బస్పు ప్రయాణం ఇప్పటి వరకు ఆరు కోట్ల మంది వినియోగించుకున్నారని వెల్లడించారు.