టీమిండియా కప్పు.. బీఆర్ఎస్ హ్యాట్రిక్.. ఇప్పుడేంది హరీశా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. తెలంగాణ అధికారపక్షం నేతల నోటి నుంచి వచ్చిన కొన్ని మాటలు అవసరానికి మించినట్లుగా ఉంటున్నాయి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. తెలంగాణ అధికారపక్షం నేతల నోటి నుంచి వచ్చిన కొన్ని మాటలు అవసరానికి మించినట్లుగా ఉంటున్నాయి. తొందరపడి కూసిన కోయిల మాదిరి.. కొన్ని వ్యాఖ్యలతో లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయాన్ని వదిలేయటం ఇప్పుడో కొత్త సమస్యగా మారింది. తాజాగా అలాంటి ఇబ్బందే తాజాగా ఎదురైందంటున్నారు.
గులాబీ పార్టీ ఎన్నికల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే మిన్నగా గులాబీ కారుకు ఇంధనంగా వ్యవహరిస్తున్నారు మంత్రులు కమ్ బావ బావమరుదులు హరీశ్.. కేటీఆర్ లు. ఈ ఇద్దరు నేతలు గడిచిన వారం.. పది రోజులుగా ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా విజయయాత్రను ప్రస్తావిస్తూ.. టీమిండియా మాదిరి తాము ఎన్నికల్లో దూసుకెళతామని చెప్పుకోవటం తెలిసిందే. అంతవరకు ఆగినా సరిపోయేది. దానికి రెండు అడుగులు ముందుకు వేసి.. టీమిండియా చేతికి ప్రపంచకప్.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయమని పదే పదే చెప్పటం తెలిసిందే.
లీగ్ దశ నుంచి ఫైనల్ కు వచ్చే వరకు ఒక్కటంటే ఒక్క ఓటమి లేకుండా.. చివరకు ఫైనల్ మ్యాచ్ లో చతికిలపడిన టీమిండియా తీరుతో కోట్లాదిమంది అభిమానులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. మ్యాచ్ మొదలైన కాసేపటికే వికెట్లు దారుణంగా పడిపోవటం.. తక్కువ స్కోర్ కే బ్యాటింగ్ ముగించటం.. అనంతరం బౌలర్లు సైతం తమ సత్తా చూపకపోవటం.. వెరసి దారుణ రీతిలో మ్యాచ్ ఓటమిపాలు అయ్యారు. దీంతో.. క్రికెట్ ప్రేమికులకు షాకింగ్ గా మారింది. టీమిండియా ఓటమి వేళ.. బీఆర్ఎస్ పై సోషల్ మీడియాలో పడుతున్న పంచ్ లు అన్ని ఇన్ని కావు.
టీమిండియా చేతికి ప్రపంచకప్ ఏమో కానీ.. హ్యాట్రిక్ విజయంతో లింకు పెట్టి.. మొత్తానికి ప్రపంచ కప్ లేకుండా చేశారన్న విరుపులు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నారు. ప్రపంచకప్ లో ఫైనల్ పోటీలో టీమిండియా చేతులు ఎత్తేయటమంటే.. ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితి కూడా ఇంతేనా? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు. ఈ తరహా వ్యాఖ్యల నేపథ్యంలో.. టీమిండియా ఓటమికి హరీశ్.. కేటీఆర్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు కూడా కారణమై ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో బీఆర్ఎస్ భవిష్యత్తును టీమిండియా చేతల్లో చేసి చూపించదన్న మాటకు గులాబీ నేతల నోటి నుంచి మాటలు రాని పరిస్థితినెలకొందన్న మాట వినిపిస్తోంది.