అవకాశం ఉండీ.. వైసీపీ డేర్ చేయట్లేదా ..!
తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు సహా రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో వైసీపీ మౌనం వహించింది.
కీలక విషయాల్లో వైసీపీ డేర్ చేయట్లేదా? అసలు ఎందుకులే! అని అనుకుంటోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. కీలకమైన రెండుఎన్నికలకు వైసీపీ దూరంగా ఉండిపోవడంతో రాజకీయ వర్గాల్లో ఇదే తరహా చర్చ జరుగుతోంది. గతంలో బలం లేకపోయినా.. టీడీపీ కొన్ని ఎన్నికల్లో పోటీ చేసి.. వైసీపీని ఇరుకున పెట్టింది. ఇలాంటివి రాజకీయాల్లో కామనే. అయితే.. ఈ తరహా విషయాల్లోనూ వైసీపీ దూకుడు చూపించలేకపోతుండడం గమనార్హం.
తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు సహా రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో వైసీపీ మౌనం వహించింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనికి రాజకీయాలతో పనిలేకుండా.. పట్టభద్రులే ఎన్నికల్లో పాల్గొని ఓటు వేయనున్నారు. అయితే.. ఈ ఎన్నికల్లో వైసీపీ దూరంగా ఉండడం గమనార్హం. నిజానికి ఒకరిద్దరు నాయకులు పోటీ చేయాలని భావించారు. కానీ, జగన్ దానికి సమ్మతించలేదు.
దీంతో వారిద్దరు కూడా..పార్టీ నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్లుగా బరిలో నిలిచారు. అయితే.. ఇలాంటి పరిణామాలతో వైసీపీ దూకుడుపై ప్రశ్నలుతలెత్తుతున్నాయి. అసలు యుద్ధంలోకి దిగకుండానే చేతులు ఎత్తేయడంపై సొంత పార్టీ నాయకలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇక, కీలకమైన రాజ్యసభ ఎన్నికల్లోనూ వైసీపీ పోటీ చేసేందుకు అవకాశం ఉంది. మూడు స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో వైసీపీ ఒక్కస్థానంలో కూడా పోటీ పెట్టకపోవడం గమనార్హం.
నిజానికి గతంలో తమకు 21 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నప్పటికీ.. టీడీపీ వర్ల రామయ్యను రంగంలోకి దింపింది. కానీ, ఇప్పుడు వైసీపీ ఆ మాత్రం సాహసం కూడా చేయడం లేదు. మాకెందుకులే అన్నట్టుగానే వదిలేయడం గమనార్హం. అలా కాకుండా.. ఒక్కరినైనా పోటీకి పెట్టి ఉంటే.. ఆ పరిస్థితి వేరేగా ఉండేది. ఓటమి, గెలుపుతో సంబంధం లేకుండా ఎన్నికల రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. కానీ, ఈ దిశగా వైసీపీ అధినేత వ్యూహాత్మక స్టెప్ వేయకపోవడం గమనార్హం. మున్ముందు ఆ పార్టీపై ఈ పరిణామాలు తీవ్రంగానే ప్రభావం చూపుతాయని అంటున్నారు పరిశీలకులు.